2.0 Movie Review: 4 Ups And 3 Downs


2.0 రివ్యూ: 4 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి

‘రోబో’కు సీక్వెల్ వస్తున్నదంటే ఆ సినిమాను అభిమానించి, ఆదరించిన ప్రేక్షకులందరిలోనూ ఎంతో క్యూరియాసిటీ. హాలీవుడ్‌లో మినహా  మరే సినిమాల్లోనూ అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో సన్నివేశాల్ని చూసివుండని భారతీయ ప్రేక్షకులకు ‘రోబో’తో వాటిని పరిచయం చేశాడు డైరెక్టర్ శంకర్. అలాంటి సినిమాకు కొనసాగింపును తీస్తున్నాడంటే కచ్చితంగా అంతకుమించిన విజువల్ వండర్‌ను ప్రేక్షకులు ఆశించడం సహజం. డాక్టర్ వశీకర్, చిట్టి పాత్రల్లో మరోసారి రజనీకాంత్ నటించగా, విలన్ పాత్రలోకి ఈసారి ఏకంగా బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన అక్షయ్‌కుమార్ రావడంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ప్రేక్షకుల ఆశలు, ఊహలు, ఆసక్తులు, అంచనాలకు తగ్గట్లే ‘2.0’ ఉందా? అంతకు మించి ఉందా? చూద్దాం…

కథ

చెన్నైలోని సెల్‌ఫోన్లనీ ఎవరో లాగేసుకున్నట్లే అకాశంలోకి వెళ్లి అదృశ్యమవుతుంటాయి. నగరంలో ఒక్క సెల్‌ఫోన్ కూడా ఎవరి దగ్గరా ఉండదు. జనంలో గగ్గోలు పుడుతుంది. పోలీసు వ్యవస్థకూ, ప్రభుత్వానికీ ఈ మిస్టరీ సవాలుగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఒక సెల్‌ఫోన్ వ్యాపారి, ఒక సెల్ నెట్‌వర్క్ యజమానీ హత్యకు గురవుతారు. వాళ్లను సెల్‌ఫోన్లు హత్య చేశాయని డాక్టర్ వశీకర్ (రజనీకాంత్) చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. ఒక అజ్ఞాత శక్తి ఈ సెల్‌ఫోన్లను కంట్రోల్ చేస్తున్నదనీ, దాన్ని ఎదుర్కోవాలంటే చిట్టిని మళ్లీ తీసుకురావడం ఒక్కటే పరిష్కారమనీ వశీకర్ సూచిస్తాడు. దీనికి ఒక సైంటిస్ట్ అడ్డు చెబుతాడు. అతను చనిపోయిన డాక్టర్ బోరా కొడుకు. పోలీసు అధికారులు, మంత్రి (ఆదిల్ హుస్సేన్) కూడా వశీకర్ ప్రతిపాదనకు ఒప్పుకోరు. ఆ వెంటనే సమాచార మంత్రి కూడా చనిపోతాడు. అతడి కడుపును చీల్చుకుంటూ వచ్చిన సెల్‌ఫోన్‌ను ప్రత్యక్షంగా చూసిన మంత్రి వెంటనే చిట్టిని తీసుకురమ్మని వశీకర్‌కు చెబుతాడు. అప్పటికే రోబో అయిన తన అసిస్టెంట్ వెన్నెల (అమీ జాక్సన్) సాయంతో మ్యూజియంలో ఉన్న చిట్టితలను రహస్యంగా తీసుకువచ్చిన వశీకర్ దాన్ని పునర్నిర్మిస్తాడు. సెల్‌ఫోన్లన్నీ ఎక్కడకు చేరుకుంటున్నాయో కనిపెట్టిన వశీకర్, అక్కడకు చిట్టి, వెన్నెలతో వెళ్తాడు. అక్కడ సెల్‌ఫోన్లను తనలో కలిపేసుకొని పక్షిలా మారిన ఆకారాన్ని ప్రోటాన్ శక్తితో న్యూట్రలైజ్ చెయ్యడానికి యత్నిస్తాడు. ఆ ప్రయత్నంలోనే పక్షిలా మారిన వ్యక్తి తానిదంతా ఎందుకు చేస్తున్నాడో చిట్టికి చెబుతాడు. అతనెవరు? సెల్‌ఫోన్లకీ, అతనికీ లింకేమిటి? అతను చేయతలపెట్టిన మారణహోమాన్ని వశీకర్ బృందం అడ్డుకోగలిగిందా? పక్షిరాజు ఏమయ్యాడు?.. అనేది మిగతా కథ.

కథనం

‘రోబో’తో పోల్చుకుంటే ‘2.0’ కథనంలో బిగువు తగ్గిందని చెప్పాలి. ఇంటర్వల్ ముందు మాత్రమే విలన్ ముఖం మనకు రివీల్ అవుతుంది. అదికూడా మనిషిలా కాదు. సెల్‌ఫోన్లతో కలిపిన ముఖంలోంచి ఖండఖండాలుగా. చిట్టి కూడా అంతకు కొద్ది సేపటి క్రితమే మనకు దర్శనమిస్తాడు. ఈ లోపుల సెల్‌ఫోన్లతోనే కథను నడిపించాడు దర్శకుడు. మాట్లాడుతున్నవాళ్లు మాట్లాడుతుండగానే ఒక్కసారిగా సెల్‌ఫోన్లన్నీ ఎగిరిపోవడం, సెల్‌ఫోన్ల వ్యాపారి కారు వెనుక రోడ్డుమీద సెల్‌ఫోన్లన్నీ ప్రవాహంలా అనుసరించడం, అతను ఇంటికెళ్లి పడుకున్నాక, గదంతా.. గోడలు, సీలింగ్, ఫ్లోరింగ్ మొత్తం సెల్‌ఫోన్లమయమైపోవడం, అవి వ్యాపారి నోట్లోకి వెళ్లి కడుపు చీల్చుకొని రావడం, సెల్‌ఫోన్ నెట్వర్క్ యజమానిని కూడా రోడ్డుపై వెంటాడి వధించడం వంటి సన్నివేశాలతో కథను నడిపించాడు శంకర్. కథ మొత్తానికీ కీలకమైంది పక్షిరాజా ఫ్లాష్‌బ్యాక్. ఆ ఎపిసోడ్‌ను ఎంతో ఆర్ద్రంగా, భావోద్వేగపూరితంగా చిత్రించాడు దర్శకుడు. సినిమాకు జీవాన్నిచ్చింది ఆ ఎపిసోడే.

తల్లి కడుపులోంచి బయటకువచ్చినప్పుడు మృతశిశువు పుట్టాడని డాక్టర్లు సహా అందరూ భావిస్తుండగా, తాలి ఏడ్పుల మధ్య ఎక్కడ్నుంచో వచ్చిన ఒక చిన్న పిచ్చుక ఆ శిశువు పొట్టపై వాలి, రొమ్ము మీద ముక్కుతో పొడిస్తే, ఊపిరి పీల్చి బతికిన ఆ శిశువు తర్వాత, పక్షులే లోకంగా బతికే మనిషిలా మారతాడు. ప్రొఫెసరవుతాడు. కానీ సెల్‌ఫోన్ల రాకతో, నెట్‌వర్క్ ప్రొవైడర్లు రేడియేషన్ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూపోవడం పక్షుల ప్రాణాల మీదకు వస్తుంది. తన కళ్ల ముందే పక్షులు విలవిల్లాడుతూ ప్రాణాలు పోతుంటే తట్టుకోలేని ప్రొఫెసర్ ప్రభుత్వానికీ, సెల్ నెట్‌వర్క్ యజమానులకీ ఎన్ని విన్నపాలు చేసినా ప్రయోజనం కనిపించదు. ఆ స్థితిలో ఒక సెల్ టవర్‌కు ఉరేసుకొని చనిపోతాడు ప్రొఫెసర్. సినిమా ఓపెనింగ్ సీన్ అదే. మృత శరీరంలోంచి బయటకొచ్చిన ఆత్మకు అప్పటికే చనిపోయిన పక్షుల ఆత్మలు కలియడంతో భయంకర శక్తిగా రూపు దాలుస్తుంది. అదే సెల్‌ఫోన్లు ఉన్నవాళ్లను, ఆ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నవాళ్లను లక్ష్యంగా చేసుకొని అరాచకాలు సృష్టిస్తుంటుంది. అంతా బాగానే ఉందికానీ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో కూడా కథనానికి ఆత్మను తోడు తెచ్చుకోవడమే అసందర్భంగా అనిపిస్తుంది. పక్షిరాజా మీదకు చిట్టిని ప్రయోగించడం బాగానే ఉంది. అయితే ఒకసారి చిట్టిని పక్షిరాజా డిస్‌మాంటిల్ చేశాక వెన్నెల దాన్ని బాగుచేసి, రెడ్‌చిప్ వేయడంతో (‘రోబో’లో చిట్టి నెగటివ్‌గా మారి చేసే అరాచకం గుర్తుందిగా) యుద్ధం ఈవిల్ వర్సెస్ ఈవిల్‌గా మారుతుంది. అయితే రెడ్‌చిప్ వేసిన చిట్టికి ప్రైం టాస్క్ పక్షిరాజాగా ఫీడ్ చెయ్యడంతో చిట్టి జనం జోలికి వెళ్లడు. అంతవరకు నయం.

క్లైమాక్స్ సన్నివేశాలకు వేదికగా ఫుట్‌బాల్ స్టేడియంను ఎంచుకుని, “హీరోషిమా మీద అమెరికా వేసిన బాంబుకు డెబ్భై వేలమంది చనిపోయారు. ఇప్పుడు సెల్‌ఫోన్లలోని రేడియేషన్‌తో నేను ఎనభై వేలమందిని చంపి రికార్డు సృష్టించబోతున్నా’ అని పక్షిరాజా అనడం కృతకంగా అనిపిస్తుంది. అక్కడ చిట్టి, పక్షిరాజా మీద పోరాట దృశ్యాలు ఊహించినంత గొప్పగా లేవు. పక్షిరాజాకు పక్షులంటే ప్రేమ కాబట్టి పక్షుల్ని అడ్డుపెట్టుకొని అతడ్ని అంతం చెయ్యడం సరైన పనికాదు. చిట్టి కూడా “పక్షీ” అని ఎకసెక్కంగా సంబోధించడం ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న “మనుషులు బతకాలంటే పక్షులు కూడా బతకాలి” అనే సందేశాన్ని చిన్నబుచ్చుతుంది. చిట్టిలాంటి వేలాది మీనియేచర్ చిట్టిలను రూపొందించడం, అవి క్లైమాక్స్‌లో పావురాళ్ల మీద వచ్చి పక్షిరాజాను అడ్డుకోవడం పిల్లలకు సరదాగా ఉండే సన్నివేశం.

పాత్రల చిత్రణ

డాక్టర్ వశీకర్ పాత్రలో ఆకర్షణ తగ్గింది. అతని అసిస్టెంట్ వెన్నెల పాత్ర ఆకర్షణీయంగా ఉంది కానీ, వెన్నెల ఒక రోబో అని తెలిశాక సినిమాలోని ఒక కుర్ర పాత్ర తరహాలో దిగులు పుడుతుంది. ఆ తర్వాత నుంచీ వెన్నెలలో మనకు మరమనిషే కనిపించడం వల్ల ఆ పాత్రలోని ఆకర్షణ పోయింది. చిట్టి మళ్లీ రావడం ఆనందం కలిగిస్తుంది. కానీ ఈసారి చిట్టి మేకప్‌లో తేడా కనిపించింది. చిట్టిలోనూ ఆకర్షణ కనిపించలేదు. చివరలో రెడ్‌చిప్ వేసిన చిట్టిగా కొంత బెటర్. సహజంగానే అందర్నీ ఆకట్టుకొనే పాత్ర పక్షిరాజా. సినిమా ఎత్తుగడలో అతని ముఖం కనిపించకుండా సెల్‌టవర్‌కు ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించి, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆ ఆత్మహత్యకు కారణాన్ని రివీల్ చేయడంతో ఆ పాత్రపై సానుభూతి కలుగుతుంది. అంతలోనే పక్షిరాజా టార్గెట్ సామాన్య ప్రజలవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. పక్షులు చనిపోయేది సెల్‌టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల అయినప్పుడు, పక్షిరాజా టార్గెట్ సెల్‌టవర్లు కావాలి. లేదూ.. సెల్‌ఫోన్లే టార్గెట్ అయితే వాటిని ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలు టార్గెట్ కావాలి. వాటినే లేకుండా చేస్తే జనం చేతికి సెల్స్ అనేవే రావుగా! కానీ పక్షిరాజాకు ఆ ఆలోచన రాదు. సెల్‌ఫోన్ల వాడకందారులను చంపేద్దామనే ఆలోచనే వచ్చింది. ఇది ఆ పాత్ర చిత్రణలో దొర్లిన లోపం. డాక్టర్ బోరా కొడుకు పాత్ర వల్లే అంతమయ్యాడనుకున్న పక్షిరాజా మళ్లీ వస్తాడు. ఆ విషయం పక్షిరాజాకు, ప్రేక్షకులకు తప్ప కథలో మిగతా పాత్రలెవరికీ తెలియకుండా ఉండటం కథనంలో దొర్లిన లోపం. ఇక సెల్‌ఫోన్లు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాయి. తమతో చేయించిన సన్నివేశాల్లో అవి బాగా నటించాయి!

నటుల అభినయం

సినిమా మొత్తమ్మీద క్లిష్టమైన అభినయం ఎవరిదంటే అక్షయ్‌కుమార్‌దే. మామూలు రూపంతో అక్షయ్‌కుమార్ మనకు కనిపించడు. మనిషిగా అతడు కనిపించేది తెల్లటి గడ్డంతో వృద్ధ ప్రొఫెసర్‌గా. ఆ సన్నివేశాల్ని ఎంతో పరిణతి చెందిన నటనతో మెప్పించాడు. ఆ పాత్రలోని పెయిన్‌ని బాగా చూపించాడు. ఆ పాత్రతో ప్రేక్షకులు సహానుభూతి చెందారంటే అతడి నటనే కారణం. ఈవిల్‌గా అంటే, పక్షిరాజాగా మారాక క్లిష్టమైన మేకప్‌తో కనిపించే సన్నివేశాల్లో క్రూరత్వాన్ని పండించాడు. అందుకే అందరికంటే ఎక్కువ మార్కులు అతడికే పడతాయి. వశీకర్ పాత్రకు నటించే అవకాశం తక్కువ. చిట్టిగా ప్రిక్లైమాక్స్ నుంచీ రజనీకాంత్ ఆకట్టుకుంటాడు. అమీ జాక్సన్ అందంగా ఉంది. రోబో వెన్నెలగా పాత్రలో చక్కగా ఇమిడింది. మినిస్టర్‌గా ఆదిల్ హుస్సేన్ పాత్రోచితంగా నటించాడు. చనిపోయిన మినిస్టర్ పాత్రను పోషించిన నటుడు బాగా చేశాడు.

సాంకేతిక అంశాలు

సాంకేతికంగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. విజువల్ ఎఫెక్ట్స్ సాయంతో నీరవ్ షా అత్యున్నత స్థాయి ఛాయాగ్రహణాన్ని అందించాడు. సినిమా ఎత్తుగడలో తక్కువ వెలుతురులో ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకొనే సన్నివేశం, అతడి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ఆర్ద్రంగా ఉండటంలో కెమెరా పనితనం స్పష్టం. అలాగే సెల్‌నెట్వర్క్ యజమానిని సెల్‌ఫోన్లు చంపే సన్నివేశం కూడా ఉన్నత స్థాయి కెమెరా పనితనానికి నిదర్శనం. రెహమాన్ గురించి చెప్పేదేముంది. ఛాయాగ్రహణానికి దీటుగా నేపథ్య సంగీతంతో సన్నివేశాలకు బలాన్ని సమకూర్చాడు. ముఖ్యంగా సౌండ్ గొప్పగా ఉంది. పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఆర్ట్ వర్క్ కూడా ఉన్నత స్థాయిలోనే ఉంది. కొన్ని సన్నివేశాలు చూస్తే ఎడిటింగ్ కత్తెర ఎక్కువ పడిందనిపిస్తుంది.

చివరి మాట

సీక్వెల్ కాబట్టి సహజంగానే మునుపటి ఒరిజినల్‌తో పోలిక రావడం సహజం. ఆ రకంగా చూస్తే ‘2.0’ కాస్త నిరాశపరిచిందనేది నిజం. సినిమాను క్యారీ చెయ్యాల్సిన ఎమోషనల్ మూడ్ కథనంలో లోపించింది. ప్రొఫెసర్ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లోనే ఆ ఎమోషన్ కనిపించింది కానీ మిగతా సినిమా అంతా సెల్‌ఫోన్లు, రోబోల కథగా తయారై, ప్రేక్షకుల సహానుభూతిని మిస్ చేసుకుంది. అదే కారణంగా ఇది పిల్లలకు నచ్చే అవకాశాలున్నాయి.

– బుద్ధి యజ్ఞమూర్తి

29 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published.