3 To Ravi Teja 4 To Sreenu Vaitla
రవితేజకు 3, శ్రీను వైట్లకు 4
రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నమోదైంది. సుమారు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వ్యయమైన ఈ సినిమాకు తొలి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10 కోట్ల షేర్ (అంచనా) కూడా రాకపోవడంతో ఆర్థికంగా ఈ సినిమాతో సంబంధించిన వారంగా చాలా పెద్ద మొత్తంలో నష్టాల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు ముందు ఇదే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘సవ్యసాచి’తో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకే కమీషన్ బేసిస్‌లో ఈ సినిమాను పంపిణీ చేశారు. అయినప్పటికీ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఇటు నిర్మాతల్నీ, అటు పంపిణీదారుల్నీ దెబ్బకొట్టింది. ఫలితంగా రవితేజకు ఫ్లాపుల పరంగా హ్యాట్రిక్ నమోదైంది. ‘రాజా ది గ్రేట్’ హిట్ తర్వాత ఆయన చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’ సినిమాలు ఫ్లాపైన విషయం తెలిసిందే. వాటిని ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనుసరించింది. ఇక డైరెక్టర్‌గా శ్రీను వైట్ల పరిస్థితి ఈ సినిమాతో అగమ్యగోచరంగా మారినట్లే. ‘ఆగడు’తో మొదలైన పరాజయ పరంపర ‘బ్రూస్లీ’, ‘మిస్టర్’, ఇప్పుడు ఈ సినిమా వరకు కొనసాగింది. అంటే వరుసగా 4 ఫ్లాపులు. ‘దూకుడు’ టైంలో నిజంగానే అగ్రశ్రేణి దర్శకుడిగా మంచి దూకుడు మీదున్న ఆయన ఆ తర్వాత స్వల్ప కాలానికే ఇలాంటి స్థితిని ఎదుర్కోవడం బాధాకరం. ఇప్పటికైనా ఆయన సబ్జెక్టుల విషయంలో తను చేస్తున్న తప్పులను తెలుసుకొని, తన పంథా మార్చుకుంటాడో, లేదో చూడాలి.