5 Movies You’re Feared You Love


5 Movies You're Feared You Love

భయపడుతూనే ఇష్టపడతాం!

సినిమాలకు సంబంధించిన గొప్ప విషయం వాటికి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా కనెక్ట్ కావడం. సినిమాల్లో ఎన్నో రకాల జోనర్స్, సబ్-జోనర్స్.. ఆ సబ్-జోనర్స్‌లోనూ మళ్లీ అనేక రకాలు.. వెరసి సినిమా మనకి వినోదాన్నీ, కాలక్షేపాన్నీ ఇస్తోంది. ఇద్దరు స్నేహితులు కలిస్తే తప్పకుండా వాళ్ల మధ్య సినిమాల గురించిన టాపిక్ రాకుండా ఉండదు. మనకు నచ్చిన, నచ్చని సినిమాల గురించి ఏకరువుపెట్టకుండా ఉండం. ఒక సినిమా ఒకరికి బాగా కనెక్టవుతుంది, ఒకరికి కాదు. కొన్ని సినిమాలు మనల్ని భయపెడతాయి. భయపడుతూనే వాటిని చూస్తాం, అయినా వాటిని ఎంజాయ్ చేస్తాం. అవే హారర్ సినిమాలు. ఫక్తు హారర్ కానివ్వండి, హారర్ కామెడీలు అవనివ్వండి.. ఆ సినిమాలను అంత త్వరగా మనం మరచిపోలేం. అలాంటి వాటిలో ది బెస్ట్ అని చెప్పే సినిమాలేంటో చూద్దాం…

గీతాంజలి (2014)

హారర్‌లో కామెడీని మేళవించి సరికొత్త అనుభవాన్నిచ్చిన సినిమాల్లో ‘గీతాంజలి’ది అగ్రస్థానం. సినీ దర్శకుడు కావాలనుకొన్న శ్రీనివాస్ (శ్రీనివాసరెడ్డి) హైదరాబాద్‌లో అద్దెకు ఒక అపార్ట్‌మెంట్ తీసుకొని అందులో నివసించడం మొదలుపెట్టాక, తన స్నేహితుల కోసం వచ్చిన అంజలి (అంజలి) తారసపడ్డాక ఎదుర్కొనే భయానక సందర్భాలు.. ఓ వైపు దడ పుట్టిస్తూనే, మరోవైపు హాస్యాన్నీ అందిస్తాయి. అదివరకు వచ్చిన ‘ప్రేమకథా చిత్రం’ థ్రిల్లర్ కామెడీల్లో ఒక ఒరవడిని సృష్టిస్తే, హారర్ కామెడీల్లో ‘గీతాంజలి’ ఇంకో ఒరవడిని సృష్టించింది. హారర్‌నూ, కామెడీని సమపాళ్లలో రంగరించడంలో డైరెక్టర్ రాజకిరణ్ పనితనం స్పష్టం.

5 Movies You're Feared You Love

అనసూయ (2007)

క్రిమినల్ సైకాలజీ చదువుకున్న అనసూయ అనే టీవీ రిపోర్టర్ కొన్ని సీరియల్ హత్యల వెనకున్న రహస్యాన్ని ఛేదించడానికి చేసే ప్రయత్నాలే ‘అనసూయ’ సినిమా కథ. సీరియల్ కిల్లర్ ఒక్కో హత్యనూ చేసే విధానం, భయానకమైన ఆ సన్నివేశాలు, ఆ సీరియల్ కిల్లర్ నుంచి తప్పించుకోడానికి అనసూయ చేసే పోరాటంతో ఆద్యంతం సినిమా ఉత్కంఠతో నడిచి గగుర్పాటు కలిగిస్తుంది. డైరెక్టర్ అయిన రవిబాబే స్వయంగా సీరియల్ కిల్లర్ పాత్రలో కనుబొమ్మల్ని పూర్తిగా తీసేసి నటించి ప్రేక్షకుల్ని బాగా భయపెట్టాడు. టైటిల్ రోల్‌లో భూమిక కనిపిస్తుంది. శేఖర్‌చంద్ర సమకూర్చిన రీరికార్డింగ్ ప్రేక్షకుల్ని కుర్చీల్లో మునివేళ్లపై కూర్చోబెట్టింది.

5 Movies You're Feared You Love

మంత్ర (2007)

వారసత్వంగా తనకు సంక్రమించిన ‘మంత్ర నిలయం’ అనే భవంతిని అమ్మాలనుకున్న మంత్ర (ఛార్మి) చుట్టూ నడిచే కథ ఇది. దెయ్యాల బంగ్లాగా పేరుబడ్డ ఆ ఇంట్లో మూడు నెల్లపాటు ఉండేందుకు వచ్చిన హీరో (శివాజీ) బృందానికి ఎదురయ్యే భయానక ఘటనలు, హత్యలతో ఒళ్లు జలదరించిపోతుంది. ఉత్కంఠ, భీభత్స, భయానక సన్నివేశాలతో ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టి చూస్తాడు. దర్శకుడు తులసీరాం సమకూర్చిన బిగువైన స్క్రీన్‌ప్లే, దడపుట్టించే శివేంద్ర ఛాయగ్రహణం, ఆనంద్ రీరికార్డింగ్.. హారర్ సినిమాల్లో ‘మంత్ర’కు స్థానాన్ని కల్పించాయి. ‘మహా.. మహా..’ పాట, ఆ పాటలో ఛార్మి డ్యాన్స్ (జెన్నిఫర్ లోపెజ్ స్టైల్) ప్రత్యేక ఆకర్షణ.

5 Movies You're Feared You Love

ఎ ఫిల్మ్ బై అరవింద్ (2005)

తెలుగులో హారర్ సినిమాల ట్రెండును తీసుకొచ్చిన ఖ్యాతి ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’కు దక్కుతుంది. డైరెక్టర్ అరవింద్ (రాజీవ్ కనకాల), సినీ హీరో రిషి (రిషి) కలిసి మూడో సినిమా చేద్దామనుకొని, ఒక కథను ఎంచుకున్నాక, అ కథలోని పాత్రలు ఎదుర్కొన్న భీతిగొల్పే ఘటనలే అరవింద్, రిషి ఎదుర్కోవడం ఈ సినిమా ఇతివృత్తం. క్షణ క్షణం టెన్షన్ పుట్టిస్తూ, తర్వాత ఎలాంటి సన్నివేశం చూడాల్సి వస్తుందోనని ఊపిరి పీల్చడం మర్చిపోయి, మునివేళ్ల మీద కూర్చొని చూసేలా సినిమాని రూపొందించిన ఘనత నిస్సందేహంగా డైరెక్టర్ శేఖర్ సూరిదే. సన్నివేశాలు అంత భయోత్పాతాన్ని కలిగించేలా తయారవడానికి విజయ్ కురాకుల నేపథ్య సంగీతం, రమేశ్‌కృష్ణ ఛాయాగ్రహణం దోహదం చేశాయి. ఎంత భయపడుతూ చూసినా, దీన్ని ఇప్పటికీ జనం ఇష్టపడుతూనే ఉన్నారు.

5 Movies You're Feared You Love

దెయ్యం (1996)

ఫక్తు హారర్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు తొలిసారి రుచి చూపించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆ సినిమా ‘దెయ్యం’. ఒక శ్మశానంపైన కట్టిన బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న కుటుంబంలోని ఒక్కొక్కరినే దెయ్యాలు చంపేస్తుంటే, ఆ కుటుంబంలోని తన ప్రేయసి మహి (మహేశ్వరి)ని కాపాడ్డానికి నర్సింగ్ (జె.డి. చక్రవర్తి) చేసే ప్రయత్నాలు, నాస్తికురాలైన మహి అతడి మాటల్ని పెడచెవిన పెడుతుంటే, ప్రేక్షకుడిలో కలిగే భయం, తర్వాత ఏం జరుగుతుందోననే ఆందోళన.. కుదురుగా నిలవనీయవు. ఓపెనింగ్ సీన్‌లోనే శ్మశానం మీదుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఒక స్రీని చూసి, ఆమె వెంటపడటం, ఆ స్త్రీ దెయ్యంగా మారి అతడ్ని చంపడం భయపెట్టేస్తుంది. ఈ సినిమాతో డైరెక్టర్‌గా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు వర్మ.

– బుద్ధి యజ్ఞమూర్తి

17 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *