6 Best Movies You Can Watch For Free On YouTube


ఫ్రీగా యూట్యూబ్‌లో చూడదగ్గ మంచి సినిమాలు

అమెజాన్ ప్రైం, నెట్‌ఫ్లిక్స్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ప్రజల తీరిక సమయాల్ని ఆక్రమించుకుంటూ ఉండటంతో సంప్రదాయ వీడియో సంస్థలకు కష్ట కాలం వచ్చినట్లయింది. ఇదివరకు వివిధ సినిమాల వీడియో హక్కుల్ని ఫ్యాన్సీ రేట్లకు కొని యూట్యూబ్‌లో అందుబాటులోకి తెచ్చి, ఒకసారి సినిమా వీక్షణకు రూ. 25 నుంచి రూ. 100 వరకు చార్జి చేయడం ద్వారా, మరోవైపు ప్రకటనల ద్వారా లాభాల్ని ఆర్జించే ఆ సంస్థల ఆదాయానికి ఇప్పుడు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ దెబ్బ గట్టిగా తగిలింది. దాంతో అధికారికంగా కొన్ని సినిమాల్ని ఫ్రీగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరికొన్ని సినిమాలను వాటి నిర్మాణ సంస్థలే నేరుగా యూట్యూబ్‌లో ఉచితంగా చూపిస్తున్నాయి. ఫ్రీగా చూపించినా చాలా సినిమాల్ని చూసే ఆసక్తి ప్రేక్షకులకు లేదు. మంచి సినిమాలు ఉచితంగా చూపిస్తే చూసేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారు. టీవీలో కొత్త, మంచి సినిమాలు వస్తున్నా, అవి ప్రసారమయ్యే సమయానికి వీలుపడక చూడని వాళ్లెందరో. అలాంటి వాళ్లు యూట్యూబ్‌లో చక్కని సినిమాల్ని ఉచితంగా చూసి ఆస్వాదించవచ్చు. అలాంటి సినిమాల్లో ఒక ఆరు మంచి సినిమాలేవిటో చూద్దాం.

ఫిదా (2017)

డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్ రాజు తొలి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’. మలయాళ చిత్రం ‘ప్రేమం’తో క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకొన్న సాయిపల్లవి తెలుగులో తొలిసారి నాయికగా నటించిన సినిమా ‘ఫిదా’. ఇందులో కథానాయకుడు వరుణ్ తేజ్ అయినప్పటికీ మూకుమ్మడిగా ప్రేక్షకులనందర్నీ తన బుట్టలో వేసేసుకుంది సాయిపల్లవి. తెలంగాణ అమ్మాయి భానుమతిగా ఆమె ఆమె హావభావ, నాట్య విన్యాసాలు, ఆమె డైలాగులు ప్రేక్షకుల్ని మైమరపించాయి. ఆమె మాయలో పడేట్లు చేశాయి. అందుకే వరుణ్ తండ్రి నాగబాబు సైతం ఈ సినిమాలో హీరో సాయిపల్లవేనని ప్రశంసించారు. వరుణ్ తేజ్ పోషించిన వరుణ్ పాత్ర పాసివ్‌గా వ్యవహరించడం, భానుమతి క్యారెక్టర్ ప్రోయాక్టివ్ కావడం కూడా ఆమె డామినేషన్‌కు కారణం. అన్న పెళ్లికి అమెరికా నుంచి తెలంగాణకు వచ్చిన ఆంధ్రా అబ్బాయి వరుణ్, అక్కడ తన కాబోయే వదిన చెల్లెలు భానుమతిని చూసి ప్రేమలో పడటం, క్రమంగా భానుమతి సైతం వరుణ్‌ను ఇష్టపడటం, ఆ తర్వాత అపోహతో వరుణ్‌కు భానుమతి దూరంగా జరగడం, అమెరికాకు వెళ్లిన వరుణ్ ప్రపోజల్‌ను భాను తిరస్కరించడం, ఆ తర్వాత అపోహలు తొలగి ఇద్దరూ ఒక్కటవ్వడం ‘ఫిదా’ కథ. ఎలాంటి కాంప్లెక్సులూ లేకుండా సింపుల్ నెరేషన్‌తో శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమాతో సాయిపల్లవి ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది.

శతమానం భవతి (2017)

అదివరకు ‘దొంగలబండి’, ‘రామదండు’, ‘కులుమనాలి’ వంటి సినిమాలతో ఫ్లాపుల డైరెక్టర్‌గా ముద్ర వేసుకున్న సతీశ్ వేగేశ్న.. రూటు మార్చి, నిర్మాత దిల్ రాజును తన కథతో మెప్పించి తీసిన సినిమా ‘శతమానం భవతి’. ఈ ఒక్క సినిమాతో దర్శకుడిగా సతీశ్ మునుపటి చెడ్డపేరు ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకు పోవడమే కాకుండా, ఏకంగా జాతీయ అవార్డును కొల్లగొట్టిన దర్శకుడిగా కీర్తిని సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ప్రేక్షకాదరణతో ఘన విజయం సాధించడం అతడికి అమితానందాన్ని చేకూర్చింది. ఉద్యోగాల పేరుతో తమను వదిలిపెట్టి విదేశాలకు తరలిపోయే పిల్లలకు దూరమై బతుకును వెళ్లదీసే తల్లిదండ్రుల ఆవేదనకు అద్దంపట్టిన సినిమా ‘శతమానం భవతి’. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో.. ఆ మాటకొస్తే దేశంలోని ఎంతోమంది తల్లిదండ్రుల పరిస్థితి అదే. అందుకే ప్రేక్షకులు ఆ పాత్రలతో సహానుభూతి చెంది, చిత్రానికి ఘన విజయాన్ని సాధించిపెట్టారు. పిల్లలకు దూరంగా ఆత్రేయపురం గ్రామంలో రోజులు గడిపే తల్లిదండ్రులుగా ప్రకాశ్‌రాజ్, జయసుధ, వాళ్లకు మనవడి వరసయ్యే రాజుగా శర్వానంద్, అమెరికా నుంచి అమ్మమ్మ తాతయ్యలను చూడ్డానికి వచ్చి రాజుతో ప్రేమలో పడే నిత్య పాత్రలో అనుపమా పరమేశ్వరన్ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. మనసును తడిచేసే సున్నిత సన్నివేశాలు, మనుషుల మధ్య చూపించిన అనుబంధాలు, బంధుత్వాల్లోని తియ్యదనం.. వెరసి ఈ సినిమా ఒక చక్కని అనుభూతిని కలిగిస్తుంది.

మనమంతా (2016)

చంద్రశేఖర్ ఏలేటి అంటేనే అర్థవంతమైన, రెగ్యులర్‌కు భిన్నమైన సినిమాల రూపకర్త. దర్శకుడిగా తొలి సినిమా ‘ఐతే’ నుంచే ఆ విషయం మనకు తెలుసు. ఆయన నుంచి వచ్చిన మరో చక్కటి, హృదయాల్ని స్పృశించే సినిమా ‘మనమంతా’. మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ అంత తేలిగ్గా మరో భాషలో చేయడానికి ఒప్పుకోరు. ఏక కాలంలో ఆయన చేయడానికి ఒప్పుకున్న రెండు తెలుగు సినిమాల్లో ఒకటి ‘జనతా గారేజ్’ అయితే, ఇంకొకటి ‘మనమంతా’. రెండు సినిమాల్లోనూ తండ్రి పాత్రలే అయినా, ‘మనమంతా’లో ఆయనే కథానాయకుడు. కుటుంబ ఖర్చులు పెరిగిన దానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవడంతో ఒక సూపర్‌మార్కెట్‌లో పనిచేసే సాయిరాం (మోహన్‌లాల్) అనే ఒక మధ్యతరగతి వ్యక్తి స్వార్థంతో చేసే ఒక పని ఎలాంటి అవాంఛనీయ పరిణామాలకు దారితీసిందనేది ఒక కథ. అలాగే మంచి జీవితం గడిపే అవకాశం వచ్చినప్పుడు గాయత్రి (గౌతమి) అనే మిడిల్‌క్లాస్ మహిళ ఏం చేసింది, ఒక అందమైన అమ్మాయి ప్రేమలో పడి చదువును నిర్లక్ష్యం చేసిన అభి (విశ్వాంత్) చివరకు ఏం తెలుసుకున్నాడు, ఒక పేదమ్మాయికి సాయం చేయాలనుకున్న ఏడో తరగతి చదివే మహిత (రైనారావ్) ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంది.. అనేవి మరో మూడు సమాంతర కథలు. ఈ నలుగురి కథలు ఏ తీరానికి చేరుకున్నాయి, ఈ నలుగురికీ ఒకరితో ఒకరికి ఉన్న సంబంధమేమిటి.. అనే విషయాలను అత్యంత ఆసక్తికరంగా, ఆర్ద్రంగా చిత్రంచాడు ఏలేటి. సున్నితమైన భావాలను, అంతే సున్నితంగా, భావోద్వేగపూరితంగా సన్నివేశాల్లోకి అనువదించడం అందరు దర్శకులకూ సాధ్యమయ్యే విషయం కాదు. ‘మనమంతా’ చూస్తున్నంతసేపూ రకరకాలా భావావేశాలతో కుదుపులకు గురవుతాం. జీవితంలోని కష్టనష్టాలు, ఆనందానుభూతులను ఎంతో చక్కగా కళ్లముందు నిలిపిన ‘మనమంతా’ నిస్సందేహంగా మిస్సవకూడని ఒక మంచి చిత్రం.

పెళ్ళిచూపులు (2016)

హీరోగా విజయ్ దేవరకొండకు తొలి చిత్రం, దర్శకుడిగా తరుణ్ భాస్కర్‌కు తొలి చిత్రం అయిన ‘పెళ్ళిచూపులు’ అన్యూహ్య విజయాన్ని సాధించడమే కాదు, ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ను కలిగించింది. తెలుగు చిత్రసీమకు ఒక మంచి హీరోను, ఒక ప్రతిభావంతుడైన డైరెక్టర్‌నూ అందించింది ఈ సినిమా. అప్పటివరకూ షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ వస్తున్న తరుణ్ భాస్కర్ చెప్పిన కథ నచ్చి నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమాను తలకెత్తుకోవడం, ఆయన సూచన మేరకు సినిమా చూసిన డి. సురేశ్‌బాబు విడుదల బాధ్యతను తీసుకోవడంతో మనముందుకొచ్చింది ‘పెళ్ళిచూపులు’. జీవితంలో ఏం సాధించాలో అవగాహన ఉన్న చిత్ర (రీతూవర్మ), జీవితమంటే ఏమిటో తెలీని తికమక స్థితిలో ఉండే ప్రశాంత్ (విజయ్) పెళ్లిచూపుల్లో కలుసుకొని, ఒకరి భావాలు మరొకరికి సరిపోలవని తెలుసుకున్నాక, తిరిగి కలిసి పనిచేయాల్సిన పరిస్థితుల్లో పడ్డాక, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ప్రశాంత్‌లో ఎలాంటి మార్పు వచ్చిందనేది ఈ చిత్ర కథాంశం. చక్కని స్క్రీన్‌ప్లేతో, అదివరకు మనం చూడని ఆహ్లాదకరమైన సన్నివేశాలతో, ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచాడు తరుణ్ భాస్కర్. ప్రధాన పాత్రల్లో రీతూ, విజయ్ అభినయం సినిమాకు మరింత జీవాన్నిచ్చింది. ఫస్టాఫ్‌ను ఎంతగా ఎంజాయ్ చేస్తామో, సెకండాఫ్‌లోని ఎమోషన్స్‌కు అంతగా కదిలిపోతాం. మిస్ చేయకూడని సినిమాల్లో నిస్సందేహంగా ‘పెళ్ళిచూపులు’ ఒకటి.

మళ్లీ మళ్లీ ఇది రానిరోజు (2015)

అదివరకు తీసిన ‘ఓనమాలు’ సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న క్రాంతిమాధవ్ రూపొందించిన రెండో సినిమా ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’. నేటి తరం తెలుగు దర్శకుల ఆలోచనలూ, అభిరుచులూ ఎంత సృజనాత్మకంగా, మూస ధోరణులకు భిన్నంగా ఉంటున్నాయో చెప్పడానికి క్రాంతిమాధవ్ నిదర్శనంగా నిలుస్తాడు. అలాంటి దర్శకుల వెన్నుతట్టే నిర్మాతలే కావాలిప్పుడు. శర్వానంద్, నిత్యా మీనన్.. ఇద్దరూ రెగ్యులర్ కథలకు భిన్నమైన కథల్ని ఎంచుకొనే నటులనే విషయం తెలిసిందే. నటన విషయంలో ఇద్దరూ ఎంతో పరిణతి కలిగినవారు. ఒకరు మెథడ్ యాక్టర్‌లా కనిపిస్తే, మరొకరు పాత్రలో ఇట్టే ఇమిడిపోయే సహజ అభినేత్రిలా కనిపిస్తారు. ఆ ఇద్దరూ కలిసి చేసిన ఈ సినిమా చూశాక గుండె తడి అవ్వనివాళ్లు ఒక్కరూ ఉండరు. జాతీయ స్థాయిలో రన్నింగ్‌లో ఛాంపియన్‌గా నిలవాలని తపించే కాలేజీ స్టూడెంట్ రాజారాం (శర్వానంద్).. అదే కాలేజీలో కొత్తగా చేరిన నజీరా అనే ముస్లిం అమ్మాయి ప్రేమలో పడి, ఆమె ప్రేరణతో తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాక, అనుకోనివిధంగా ఆ ఇద్దరూ ఎలా విడిపోయారు, ఒకర్నొకరు అమితంగా ప్రేమించుకున్న ఆ ఇద్దరూ మళ్లీ ఎలా కలిశారు? అసలెందుకు విడిపోయారు? అనేది ఈ చిత్ర కథాంశం. ఆ ఇద్దరూ విడిపోయే పరిస్థితులు చూశాక ప్రేక్షకుడి హృదయం ఎంత బరువెక్కుతుందో, ఆ ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో తెలిసి ఎంతగా తడి అవుతుందో! ఒకరికొకరు తీసిపోకుండా నటించి దర్శకుడి ఊహల్లోని కథను సజీవంగా మనముందు నిలిపారు నిత్య, శర్వానంద్. వాళ్లను ప్రేమించకుండా ఉండలేం. ఒక స్వచ్ఛమైన, అందమైన ప్రేమకథని చూడాలనుకొనేవాళ్లు వెంటనే యూట్యూబ్‌లో ఈ సినిమాని ఫ్రీగా చూసేయొచ్చు.

లెజెండ్ (2014)

రెగ్యులర్ కమర్షియల్ సినిమానే, కమర్షియల్ ఫార్మట్‌లోనే సినిమా తీసి మెప్పించే దర్శకులు మనకు మొదట్నించీ ఉన్నారు. కొంతమంది ఒకట్రెండు సక్సెస్‌ఫుల్ సినిమాలు చేశాక, మూస ధోరణిని వదులుకోక, కొత్తగా ఎలా చూపించాలో తెలీక రన్నింగ్ రేస్‌లో వెనుకపడిపోతారు. కొంతమంది దర్శకులు మాత్రమే పాత కథను కూడా ఎమోషనల్‌గా, గ్రిప్పింగ్‌గా తీసి విజయాల మీద విజయాలు సాధిస్తుంటారు. అలాంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను. అతడికి బాలకృష్ణ లాంటి ఎమోషన్స్‌ను బాగా పండించే, డైలాగ్స్‌ను పవర్ఫుల్‌గా చెప్పే నటుడు లభిస్తే ఇక చెప్పేదేముంది! అదివరకే ‘సింహా’తో బాలకృష్ణను ఫ్లాపుల నుంచి బయటపడేసిన అతడు, మరోసారి అదే స్థితిని ఎదుర్కొంటున్న బాలకృష్ణను ‘లెజెండ్’గా ప్రెజెంట్ చేసి, మరో గొప్ప విజయాన్ని అందించాడు. ‘సింహా’ తర్వాత బాలకృష్ణకు మళ్లీ అంతటి బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచింది ‘లెజెండ్’. ప్రొద్దుటూరులో ఏకంగా వెయ్యి రోజులకు పైగా ఆడి, తెలుగు చిత్రసీమలోనే సరికొత్త రికార్డును సాధించింది ఈ సినిమా. అంతేకాదు, అప్పటివరకు హీరోగా కుటుంబ ప్రేక్షకులకు సన్నిహితుడైన జగపతిబాబును అతి క్రూరుడైన విలన్‌గా చూపించి, మెప్పించిన ఘనతనూ పొందాడు బోయపాటి. ఇండియాలోనే తన పెళ్లి జరగాలని ఫారిన్ నుంచి వచ్చిన కృష్ణ (బాలకృష్ణ) చెడు చూసి సహించలేని మనస్తత్వంతో జితేంద్ర (జగపతిబాబు) కొడుకును చితగ్గొడితే, కృష్ణని చంపడానికి వచ్చిన జితేందర్, అతడ్ని చూసి షాక్ తినడం, అప్పుడే జయదేవ్ (బాలకృష్ణ) ప్రత్యక్షమై కృష్ణకు కాపాడ్డం, జయదేవ్ ఎవరనే విషయం, అతడికీ, కృష్ణకూ ఉన్న బంధం, అతడికీ, జితేంద్రకూ ఉన్న వైరం బయటపడ్డం, చివరకు శత్రుసంహారం జరగడం.. ఇదీ కథ. జయదేవ్ పాత్రను బోయపాటి తెరపై చూపించిన తీరు, ఆ పాత్రను బాలకృష్ణ పోషించిన వైనం ఈ సినిమాకు ఘన విజయాన్ని సాధించిపెట్టాయి. అదే సమయంలో భావోద్వేగ సన్నివేశాలతో కట్టిపడేస్తాడు దర్శకుడు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను ఇష్టపడే సంప్రదాయ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొనే సినిమా ‘లెజెండ్’.

– బుద్ధి యజ్ఞమూర్తి

28 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *