6 Movies That Became Classics


మన కాలం క్లాసిక్స్

చాలా సినిమాలు ఆర్థికంగా గొప్ప విజయాన్ని సాధించవచ్చు. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డుల్ని సృష్టించవచ్చు. కానీ వాటిలో అత్యధిక శాతం సినిమాలు ప్రజల హృదయాల నుంచి చెరిగిపోతాయి. కొన్ని గుర్తుండినా ‘గొప్ప’ అనే భావనను కలిగించవు. కొన్ని సినిమాలు విషయపరంగా, సన్నివేశాలపరంగా, చిత్రీకరణపరంగా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి. మన కాలంలో.. అంటే 21వ శతాబ్దంలో వచ్చి, ప్రేక్షకుల మనసులపై అలాంటి ముద్ర వేసిన 6 సినిమాల గురించి చెప్పుకుందాం.

రంగస్థలం (2018)

నేటి కాలంలోనూ క్లాసిక్స్ తీసే సత్తా కలిగిన దర్శకులు తెలుగు చిత్రసీమలో ఉన్నందుకు మనం గర్వించాలి. వాళ్లు తీసినవన్నీ గొప్పగా ఉండకపోవచ్చు. ఏ దర్శకుడైనా తన ప్రతి చిత్రాన్నీ గొప్పగా తియ్యలేడు. కొంతమంది ఒక్క సినిమానే క్లాసిక్‌గా తీసి, తర్వాత ఆ స్థాయిలో మరే సినిమానీ తియ్యకపోవచ్చు. అన్నీ కలిసి రావడం వల్ల ఒక గొప్ప సినిమా ఆ దర్శకుడి మేధస్సు నుంచి బయటకు రావచ్చు. డైరెక్టర్ సుకుమార్ అందుకు మినహాయింపు. ఆయన రూపొందించిన ‘ఆర్య’ ఒక ట్రెండ్‌సెట్టర్. హీరోయిన్ ప్రేమను పొందడానికి ఆర్య అనే కాలేజీ కుర్రాడు అవలంబించిన నెగటివ్ అప్రోచ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదే కాదు, సన్నివేశాల కల్పన, హీరో పాత్ర చితణ.. ఆ సినిమాను క్లాసిక్‌కు దగ్గరగా నిలిపాయి. అయితే అది వచ్చిన చాలా ఏళ్ల తర్వాత అదే సుకుమార్ రూపొందించిన, నిస్సందేహంగా మరింత గొప్ప చిత్రం ‘రంగస్థలం’. భవిష్యత్ తరాలవాళ్లు ఈ సినిమాను క్లాసిక్‌గా కచ్చితంగా చెప్పుకొనే సినిమా. పెత్తందారీతనంతో ఊరినంతట్నీ తన చెప్పుచేతల్లో ఉంచుకున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి (జగపతిబాబు)ని ఎదిరించి అతనికి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిల్చున్న కుమారబాబు (ఆది పినిశెట్టి) హత్యకు గురైతే, తన అన్న హత్యకు ప్రతీకారం తీర్చుకున్న తమ్ముడు చిట్టిబాబు (రాంచరణ్) కథ ఇది. ‘రంగస్థలం’ కథ పైకి ప్రతీకార చిత్రంగా కనిపించినా, ఒకప్పుడు గ్రామాల్లోని స్థితిగతులు, పెత్తందారుల అరాచకాలు, మనుషుల మధ్య అనుబంధాలు, చిన్న చిన్న గొడవలు, ప్రేమలను ఎంతో సహజంగా కళ్లముందు నిలిపాడు సుకుమార్. ప్రధాన పాత్ర చిట్టిబాబును చెవిటివాడిగా, అదే సమయంలో, నమ్మినదాన్ని ఆరు నూరైనా పాటించే బలమైన వ్యక్తిత్వం ఉన్నవాడుగా చిత్రించాడు. రామలక్ష్మి (సమంత), రంగమ్మత్త (అనసూయ), కుమారబాబు (ఆది పినిశెట్టి), ఫణీంద్రభూపతి, మిగతా వాళ్లంతా పాత్రలుగా కాకుండా సహజ వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. ఆయా పాత్రలతో మనం సహానుభూతి చెందుతాం. రంగస్థలం మన ఊరైనట్లు, మనం ఆ ఊరివాళ్లమైనట్లు భావించుకుంటాం. ప్రెసిడెంటు ఒక్కడే విలన్ కాదనీ, రాజకీయ నాయకుడైన ప్రకాశ్‌రాజ్ కూడా విలనేననీ తెలుసుకొని షాక్‌కు గురవుతాం. తన కూతురు తక్కువ కులంవాడు, ఆర్థికంగా తనకు ఏమాత్రం తూగలేనివాడూ ఐన కుమారబాబుతో ప్రేమలో పడటం సహించలేకే కుమారబాబును అతడు చంపించడం గ్రామాల్లోని కులాల, ఆర్థిక అంతరారాలను కూడా చూపిస్తుంది. ‘రంగస్థలం’ ఆర్థికపరంగా పెద్ద విజయం సాధించిన సినిమా మాత్రమే కాదు, క్లాసిక్ అనిపించుకోడానికి తగిన అర్హతలున్న సినిమా.

మహానటి (2018)

బయోపిక్ తియ్యడం సామాన్య విషయం కాదు. వాస్తవ ఘటనలు ఎక్కువగా, కల్పన తక్కువగా ఉంటూ, ఆసక్తికరమైన కథనంతో సినిమా రూపొందించాలి. అప్పుడే ప్రేక్షకులు హర్షిస్తారు, ఆదరిస్తారు. అందరికీ తెలిసిన మహానటి సావిత్రి గురించి తెలీని వ్యక్తిగత విషయాలను చూపిస్తూ సినిమా రూపొందించడం, మెప్పించడం చాలా క్లిష్టమైన పని. అలాంటి కార్యాన్ని తలకెత్తుకొని ‘మహానటి’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మహా మహా దర్శకులే స్పృశించడానికి వెనుకంజ వేసిన, ప్రజల హృదయాల్లో గొప్ప స్థానాన్ని పొందిన సావిత్రి జీవితాన్ని ఇదివరకు ఒకే ఒక్క సినిమా తీసిన అనుభవం కలిగిన ఆశ్విన్ సెల్యులాయిడ్ పైకి తీసుకు రావాలని సంకల్పించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. చాలామంది పెదవి విరిచారు కూడా. అయినా భయపడకుండా సావిత్రి జీవితంలో జరిగిన ఘటనల గురించి పరిశోధించి, పరిశీలించి, ఆమె కుమార్తెను సంప్రదించి మరీ కథ రాసుకొని, పకడ్బందీ కథనంతో ‘మహానటి’ని తీర్చిదిద్దాడు అశ్విన్. సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్‌ను చూపించడం కూడా సాహసమే. ఆమె ఎక్కువ అనుభవం కలిగిన నటి కాదు. అయినా ఆమెను తెర సావిత్రిగా మెప్పించడంలో సక్సెసయ్యాడు అశ్విన్. జెమినీ గణేశన్ (దుల్కర్ సల్మాన్)ను చూపించిన విధానం, కొన్ని ఘటనల కాలాన్ని తప్పుగా చూపించడం విమర్శలకు తావిచ్చినా సన్నివేశాల కల్పన పరంగా, కథన పరంగా, పాత్రల చిత్రణ పరంగా క్లాసిక్‌గా నిలుస్తుంది ‘మహానటి’.

అర్జున్‌రెడ్డి (2017)

ట్రెండ్ సెట్టర్స్ అన్నీ క్లాసిక్స్ అనిపించుకోలేవు. కొన్ని మాత్రమే టేకింగ్ పరంగా, కథాంశ పరంగా, ప్రేక్షకుల మనసులపై వేసే ముద్ర పరంగా క్లాసిక్‌గా నిలుస్తాయి. ఆ కోవకు చెందిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’. కోపాన్ని అదుపులో ఉంచుకోలేని ఒక మెడికో, దాని వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు, ప్రేమికురాల్ని ఎలా దూరం చేసుకున్నాడు, జీవితంలో ఓడి, చివరకు ఎలా గెలిచాడనే విషయాన్ని దర్శకుడు వంగా సందీప్‌రెడ్డి అత్యంత ప్రభావవంతంగా చిత్రించి, ప్రేక్షకులకు ఒక సరికొత్త చిత్రానుభవాన్ని కలిగించాడు. అర్జున్‌రెడ్డి పాత్ర సృష్టి, ఆ పాత్ర ప్రవర్తించే తీరు సంప్రదాయ సినీ ప్రేక్షకులకు మింగుడుపడదు. కానీ వాస్తవాన్ని అంగీకరించే యథార్థవాదులు, ఆధునిక కాలంలో సమాజంలో వస్తున్న మార్పుల్ని అర్థం చేసుకోగలిగేవాళ్లు ఈ సినిమాని తమదిగా చేసుకున్నారు. ముఖ్యంగా యువత అర్జున్‌రెడ్డిలో తమని తాము చూసుకున్నారు. తాము చెయ్యలేని పనుల్ని అర్జున్‌రెడ్డి చేస్తుంటే ఆనందపడ్డారు. ఆ పనుల వల్ల అతడు బాధలు పడుతుంటే తామూ బాధపడ్డారు. ప్రీతి (శాలిని పాండే)ని చివరకు దక్కించుకుంటే అమితానందపడ్డారు. బోల్డ్ కంటెంట్, విప్లవాత్మక సన్నివేశాల, పాత్రల చిత్రణ పరంగా ‘అర్జున్‌రెడ్డి’ ఒక కల్ట్ క్లాసిక్‌గా చరిత్రలో నిలుస్తుందని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు.

గమ్యం (2008)

దర్శకత్వం చేసేవాడికి తానేమి తీస్తున్నాననే విషయంలో క్లారిటీ ఉండాలి. కథను ఎలా చెప్పాలనుకున్నాడో, దాన్ని ఎలాంటి తికమకలకు తావివ్వకుండా చెప్పాలి. కథనం పరుగులు తియ్యాలి. ఆ పరుగుకు ‘గమ్యం’ ఏమిటో తెలియాలి. తొలి సినిమాతోటే ఇవన్నీ చేసి చూపించాడు దర్శకుడు క్రిష్. తన సంతోషం, తన సుఖం మాత్రమే ప్రధానమనుకొనే స్వార్థం నిండిన అభిరాం (శర్వానంద్) అనే యువకుడు, తన మనస్తత్వానికి పూర్తి విరుద్ధంగా నలుగురికీ మంచి చెయ్యాలనీ, ఆపదలో ఉనవాళ్లకు సాయం చెయ్యాలనీ తపించే జానకి (కమలినీ ముఖర్జీ) అనే యువతి ప్రేమలో పడి, తన ప్రవర్తన కారణంగా ఆమెకు దూరమయ్యాక, ఆమె విలువ గ్రహించాక ఆమెను వెతుక్కుంటూ చేసే ప్రయాణమే ‘గమ్యం’. జీవిత సత్యాన్ని, తత్వాన్ని తన కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకొనే గాలి శీను (నరేశ్) పరిచయం తర్వాత అభిరాంలో క్రమేణా కలిగే మార్పు, శీను మరణంతో అతడిలో కలిగే పరివర్తన సినిమాకు జీవాన్నిచ్చాయి. నిజానికి జానకి పాత్ర చుట్టూ కథ తిరిగినా, కథనం అభిరాం పాత్ర ద్వారా నడిపించి తెలివిగా వ్యవహరించాడు క్రిష్. గాలి శీను పాత్ర ప్రవేశంతో కథనానికి ఊపు తెచ్చాడు. కథ ఎక్కువగా రోడ్ జర్నీగా సాగినా, ఆ జర్నీలో అభిరాంకు తారసపడే సంఘటనలు, వాటి ద్వారా పొందే అనుభవాలు జీవితాన్ని అవగాహన చేసుకోడానికి సాయపడతాయి. అభిరాం, గాలి శీను పాత్రలతో సహానుభూతి చెందడం వల్లే అతి తక్కువ ప్రచారంతోనే చెప్పుకోదగ్గ విజయం సాధించింది ‘గమ్యం’. ఆర్థిక విజయాన్ని అలా ఉంచింతే రూపకల్పన పరంగా ఈ సినిమా క్లాసిక్ కోవకు చెందుతుంది.

బొమ్మరిల్లు (2006)

ఒక సినిమాలోని పాత్రలు కొన్నేళ్ల తర్వాత కూడా మనల్ని వెన్నాడుతున్నాయంటే, నిదర్శనాలుగా నిలుస్తున్నాయంటే, ఆ సినిమా క్లాసిక్ కాకుండా ఎలా ఉంటుంది! పద్నాలుగేళ్ల తర్వాత కూడా ‘బొమ్మరిల్లు’ ఫాదర్, హాసిని పాత్రలు మన మనసుల నుంచి చెరిగిపోలేదు. పిల్లల జీవితాలని తాము కోరుకున్నట్లు నడిపే ఏ తండ్రినైనా ‘బొమ్మరిల్లు’ ఫాదర్ అంటున్నాం. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా జీవితాన్ని ఆనందంగా గడపాలనుకొనే ఆమ్మాయిని హాసినితో పోలుస్తున్నాం. ప్రేక్షకులపై అంతటి బలమైన ముద్ర వేసింది ‘బొమ్మరిల్లు’ చిత్రం. ఇది కూడా భాస్కర్ అనే దర్శకుడికి తొలి చిత్రమే. తండ్రి (ప్రకాశ్‌రాజ్) మాట జవదాటని సిద్ధు (సిద్ధార్థ్) అనే సంపన్న యువకుడు, ఆ తండ్రికి తెలీకుండా హాసిని (జెనీలియా) అనే ఆనందంగా జీవితాన్ని గడిపే ఒక మధ్యతరగతి అమ్మాయి ప్రేమలో పడి, తండ్రి చేత హాసిని మంచి అమ్మాయి అని చెప్పించాలని ఆమెను తన ఇంట్లో కొన్ని రోజులు ఉండేట్లు చేసి, ఎదురుదెబ్బ తిని, తన జీవితం తన చేతుల్లో కాకుండా తండ్రి చేతుల్లో బందీ అయివుందని గ్రహించడం ఈ సినిమాలోని ప్రధానాంశం. చివరలో సిద్ధు “ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్నా” అనడం స్వేచ్ఛను కోరుకునే పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టింది. ప్రేమ పేరుతో పిల్లల్ని కట్టడి చేసి, తమ ఇష్టాల్ని పిల్లలపై బలవంతంగా రుద్దుతున్నారని పెద్దలపై చురకలు వేసిన ఈ సినిమా కథ పరంగా, కథన పరంగా, పాత్రల పరంగా అత్యుత్తమ స్థాయి సినిమాగా నిలిచింది. హాసిని పాత్రలో జెనీలియా నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. పేరుకు సిద్ధు పాత్ర హీరో అయినా, సినిమాకు హీరో హాసిని పాత్రే. ‘బొమ్మరిల్లు’ ఫాదర్ అనే మాటకు నిదర్శనంగా నిలిచిన పాత్రలో ప్రకాశ్‌రాజ్, కూతురిని కళ్లల్లో పెట్టుకొని పెంచి, ఆమె క్షేమం కోసం తపించే సగటు మధ్యతరగతి తండ్రిగా కోట శ్రీనివాసరావు ఈ సినిమాకు అదనపు బలాన్నిచ్చారు. ఈ సినిమా తర్వాత భాస్కర్ కొన్ని సినిమాలు చేసినా, క్లాసిక్‌లా తీసిన ‘బొమ్మరిల్లు’కు దరిదాపుల్లో మరే సినిమానీ తియ్యలేకపోయాడు.

ఆ నలుగురు (2004)

మనిషనేవాడు తాను పోయాక తన కోసం ఏడ్చే నలుగురిని, తనను కాటికి తీసుకుపోయే నలుగురిని సంపాదించుకోవాలంటారు. లేకపోతే వాడు మనిషే కాడన్నది మనవాళ్లనే మాట. అంటే, మనిషి నీతి తప్పకుండా, నిజాయితీని నమ్ముకొని బతకాలనేది దాని వెనకున్న తాత్పర్యం. కానీ అలా నీతి నిజాయితీలతో బతకడమే నేటి కాలంలో చేతికానితనంగా మారిందనే ఆవేదనకు సెల్యులాయిడ్ కల్పనే ‘ఆ నలుగురు’ చిత్రం. చంద్రసిద్ధార్థ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేటి కాలపు క్లాసిక్. ప్రజా వేదిక అనే దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేసే రఘురాం (రాజేంద్రప్రసాద్)కు నీతి నిజాయితీలే ప్రాణం. తన జీతంలో సగం సామాజిక సేవకే వినియోగించే మనసున్న మనిషి. ఉద్యోగం కోసం లంచం ఇవ్వడానికి పెద్దకొడుకు రాజా (రాజా), ఇంజినీరింగ్ సీట్ కోసం డొనేషన్ కట్టాలని చిన్నకొడుకు, భర్తతో పాటు అమెరికా వెళ్లాలనే కూతురు డబ్బులు అడుగుతుంటే, విలువలకు కట్టుబడిన రఘురాం వాటిని సమకూర్చకపోవడంతో భార్య (ఆమని) సైతం అతడిపై ఒత్తిడి తీసుకురావడంతో, మనసు చంపుకొని అప్పు చేసి, ఆ అప్పు తీర్చే దారి తెలీక ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాతే భార్యాపిల్లలు అతడి గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం ‘ఆ నలుగురు’ ఇతివృత్తం. విలువలతో బతికేవాడిని సొంత మనుషులే ఎలా కాల్చుకుతింటారో, ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి చేస్తారో, నిజాయితీతో బతకాలనుకొనేవాడికి ఇంటా బయటా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయో రఘురాం పాత్ర ద్వారా మనసులు తడయ్యేట్లు చిత్రించాడు చంద్రసిద్ధార్థ. రఘురాం పాత్రలో ఒక కొత్త రాజేంద్రప్రసాద్ మనకు దర్శనమిచ్చాడు. ఈ సినిమా బలమంతా ఆయన పాత్ర చిత్రణ, ఆయన నటనలోనే ఉంది. తెలుగు సినిమా తనదంటూ గొప్పగా, గర్వగా చెప్పుకొనే సినిమాల్లో ‘ఆ నలుగురు’ ఒకటి.

– బుద్ధి యజ్ఞమూర్తి

26 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *