Amar Akbar Anthony: Why It Is A Big Disappointment
‘అమర్ అక్బర్ ఆంటోని’ ఎందుకు బాగోలేదు?
పదకొండేళ్ల క్రితం వచ్చిన ‘ఢీ’ అనూహ్యమైన విజయాన్ని చవిచూసింది. అసలు సినిమా పూర్తవుతుందో, లేదో అనుకొనే దశ నుంచి, ఎలాగో పూర్తయ్యిందనిపించిన ఆ సినిమా ప్రేక్షకుల్ని చాలా బాగా అలరించింది. శ్రీను వైట్ల దర్శకత్వం, కోన వెంకట్ స్క్రిప్టు, డైలాగులు ఆ సినిమాను ఆహ్లాదకరంగా మార్చాయి. అక్కడి నుంచి దర్శకుడిగా శ్రీను ఇమేజ్ బాగా పెరిగింది. దాని తర్వాత ‘దుబాయ్ శీను’, ‘రెడీ’, ‘కింగ్’, ‘నమో వెంకటేశ’, ‘దూకుడు’, ‘బాద్షా’ సినిమాల వరకూ ఆయన కెరీర్‌కు ఢోకా లేకుండా పోయింది. ప్రధానంగా ‘దూకుడు’ బ్లాక్‌బస్టర్ అయ్యాక అగ్ర దర్శకుల్లో ఒకడిగా శ్రీనును పరిగణించారు. కానీ ఏ హీరోతో ‘దూకుడు’ సినిమాతో అందలానికి ఎక్కాడో, అదే హీరో మహేశ్‌తో చేసిన ‘ఆగడు’ నుంచి శ్రీను కెరీర్ దిగజారడం మొదలైంది. ‘బ్రూస్లీ’, ‘మిస్టర్’ సినిమాలు దాన్ని కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా.. పోనీ అతి తక్కువ లోపాలతో, కొత్త తరహా కథతో, చక్కని స్క్రీన్‌ప్లేతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ని చాలా జాగ్రత్తగా తీసుంటాడని ఆశించినవాళ్లకు శ్రీను షాక్ ఇచ్చాడు. ఆసక్తిగా ఆ సినిమా కోసం ఎదురుచూసిన ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపర్చాడు. ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఎందుకంతగా ప్రేక్షకుల్ని అసంతృప్తికి గురిచేసింది? శ్రీను చేసిన పొరపాట్లేంటి? పరిశీలిద్దాం.
శ్రీను డైరెక్షన్లో స్పార్క్ ఏదీ?
కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో సిద్ధహస్తుడని పేరుపొందిన శ్రీను వైట్లకు ఏమైంది? ఉన్నట్లుండి ఆయన డైరెక్షన్ ఎందుకంత బ్యాడ్‌గా తయారైందనేది ఆశ్చర్యం కలిగించే విషయం. సినిమా అంటేనే ఆసక్తికర సన్నివేశాల సమాహారం. ఆ సన్నివేశాల్ని సరిగ్గా గుదిగుచ్చి, ఒకదానికొకటి లింక్ మిస్సవకుండా చేస్తేనే సినిమా మొత్తంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. విడి విడి సన్నివేశాల్ని చూసినప్పుడు బాగానే ఉన్నట్లుంటాయి. కానీ సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడి మనసుపై దాని ప్రభావం పడకపోతే, ఆ సన్నివేశాలకు విలువలేకుండా పోతుంది. ‘అమర్ అక్బర్ ఆంటోని’లో జరిగిందదే. సినిమాని క్యారీ చేసే భావోద్వేగ అనుభూతిని ప్రేక్షకుల్లో కలిగించడంలో శ్రీను పూర్తిగా విఫలమయ్యాడు. ‘ఢీ’ చూడండి.. అందులో ప్రేమలో పడిన హీరో హీరోయిన్లు ఎక్కడ హీరోయిన్ అన్నకు దొరికిపోతారో, దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తుతాయోనని అనుక్షణం ఆదుర్దా పడతాడు ప్రేక్షకుడు. ఆ ఎమోషన్ని చివరిదాకా నిలబెట్టడాడు శ్రీను. అలాగే ‘దూకుడు’లోనూ విలన్లపై ప్రతీకారం తీర్చుకొనే క్రమంలో హీరో ఎక్కడ తన తండ్రికి దొరికిపోతాడోననే సస్పెన్స్‌ను క్రియేట్ చేసి, క్లైమాక్స్ దాకా దాన్ని నిలబెట్టి సక్సెసయ్యాడు. ‘అమర్ అక్బర్ ఆంటోని’లో అమర్ ఐడెంటిటీ విలన్లకు తెలియకుండా చేయడానికి కావాల్సిన ఎమోషన్‌ను క్యారీ చెయ్యలేకపోయాడు శ్రీను. ఆయన టేకింగ్‌లో గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క సీనూ మనకు కనిపించదు. ఫలితం.. సినిమా పూర్తయ్యాక పెదవి విరుస్తూ బయటికొస్తాడు ప్రేక్షకుడు.
మూస కథ
ఇవాళ కథలతో దర్శకులు ఎన్నెన్ని ప్రయోగాలు చేస్తున్నారు! ఒక కథను కొత్తగా ఎలా చెప్పాలని వాళ్లు ఆలోచిస్తున్నారు. కానీ శ్రీనుకు అదేమీ పట్టలేదు. ఏవో లెక్కలు వేసుకొని, ఒక రివెంజ్ డ్రామా కథను ఎంచుకొని, హీరో హీరోయిన్లకు మానసికపరమైన జబ్బుల్ని పెట్టి, వాటిద్వారా కథను నడిపిస్తే అదే కొత్తగా ఉంటుందని భావించాడేమో! కానీ ‘గజిని’ తర్వాత స్ప్లిట్ పర్సనాలిటీ నేపథ్యంలో కొన్ని సినిమాలు రావడంతో అది ప్రేక్షకులకు కొత్తగా అనిపించట్లేదు. అసలు పాత్ర అమర్, సందర్భానికి తగ్గట్లు ఒకసారి అక్బర్‌గా, ఇంకోసారి ఆంటోనీగా ప్రవర్తించే సన్నివేశాల్లో అక్బర్ తొలిసారి పరిచయమైన సన్నివేశం మినహా మిగతా ఏవీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రధాన కథ ప్రతీకారం చుట్టూనే నడవడం, అలాంటి ప్రతీకార కథలు కుప్పలు తెప్పలుగా తెలుగుతెరను పావనం చెయ్యడం వల్ల అమర్ రివెంజ్ కథ ఫక్తు మూసకథలానే కనిపించింది తప్పితే కొత్తదనాన్ని ప్రేక్షకులు ఫీలవలేదు. ‘గజిని’, ‘అపరిచితుడు’ వంటి సినిమాలు వచ్చాక అంతకంటే మిన్నగా ఉంటేనే కదా స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఆదరించేది! తనకు సంబంధించినతవరకు కొత్తేమో కానీ ప్రేక్షకులకు కాదుగా! ఈ విషయాన్ని శ్రీను ఎందుకు పట్టించుకోలేదో…
వేస్ట్ విలన్లు
సినిమాలో ఐదుగురు విలన్లు ఉన్నారు. నలుగురు హీరో కుటుంబాన్ని చంపినవాళ్లు, ఇంకొకరు విలన్ల తరపున పనిచేస్తూ హీరోను ట్రేస్ చెయ్యడానికి ప్రయత్నించే ఎఫ్‌బీఐ ఆఫీసర్. నలుగురు ప్రధాన విలన్లలో ఏ ఒక్క పాత్రనూ ఇంప్రెసివ్‌గా, బలంగా చూపించలేదు దర్శకుడు. రెండు కుటుంబాల్ని సునాయాసంగా హత్యచేసిన వాళ్లు తమను వెంటాడుతున్న వాడ్ని కనిపెట్టడానికి ఎఫ్‌బీఐ ఆఫీసర్‌కు తలవంచే సన్నివేశాలు బలహీనంగా కనిపిస్తాయి. తమంతట తాము హీరోను ఢీకొట్టే సామర్థ్యం లేనివాళ్లుగా విలన్లను ఎస్టాబ్లిష్ చెయ్యడంతో హీరో ప్రతీకార సన్నివేశాలూ బిగువు కోల్పోయాయి. మొదట ఇద్దరు విలన్లను హీరో అతి సునాయాసంగా చంపేయడం, మూడో విలన్ ఆదిత్య మీనన్‌ను హీరోతో కాకుండా వెన్నెల కిశోర్ ద్వారా చంపించడం టెంపోని నీరుకార్చేసింది. ఇక నాలుగో విలన్ తరుణ్ అరోరా అయితే చివర్లో బఫూన్ తరహాలో కనిపిస్తాడు. ఓవైపు ఎఫ్‌బీఐ ఆఫీసర్ చెబుతున్నా పట్టించుకోకుండా హీరో చేతుల్లో అనాయాసంగా చస్తాడు. రివెంజ్ డ్రామాలో విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అంతగా రాణిస్తాడు. ఆ ఎలిమెంట్ ఈ సినిమాలో లోపించింది.
మాటలతో జోక్యం చేసుకున్నాడు
సినిమా అంటేనే దృశ్య మాధ్యమం. చెప్పాలనుకున్న విషయన్ని ఎంత ప్రభావవంతంగా దృశ్యరూపంలో చెబితే అంతగా సినిమా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందుకు భిన్నంగా దర్శకుడు శ్రీను వైట్ల కథలో జోక్యం చేసుకొని ప్రేక్షకులతో మాట్లాడుతూ వచ్చాడు. మొదట హీరో హీరోయిన్ల కుటుంబాలను తన మాటలతోనే పరిచయం చేశాడు. దానికి నాలుగైదు నిమిషాలు తీసుకున్నాడు. ఆ తర్వాత హీరోలో వచ్చే మార్పుల్ని ఎక్కడ ప్రేక్షకులు అర్థం చేసుకోలేరో అని తనే జోక్యం చేసుకొని మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వచ్చాడు. హీరోయిన్ విషయంలోనూ అదే దారి. దీంతో కథా గమనం దెబ్బతిన్నదనే విషయం ఆయన గ్రహించలేకపోయాడు.
మిస్సయిన రొమాంటిక్ యాంగిల్
చివరిదీ, ముఖ్యమైందీ హీరో హీరోయిన్ల మధ్య ‘కెమిస్ట్రీ’. ఆరేళ్ల తర్వాత ఇలియానా తెలుగు తెరకు తిరిగిరావడం ఆసక్తికర అంశం. పైగా ‘కిక్’ సినిమాలో రవితేజ, ఇలియానా మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ ఎలా పండాయో మనకు తెలుసు. ఫ్లాపైన ‘ఖతర్నాక్’లోనూ ఆ ఇద్దరి జంట ఆకట్టుకుంది. ‘అమర్ అక్బర్ ఆంటోని’లో అంతకంటే ఎక్కువగా ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుందని ఆశించిన వాళ్లను తీవ్రంగా నిరుత్సాహపరిచాడు శ్రీను. రెండు పాటల్లో తప్పితే వాళ్ల మధ్య రొమాన్స్‌కు వీలు లేకుండా చేసేశాడు. చిన్నతనంలో ఒకరంటే ఒకరికి ప్రాణంగా మెదిలిన వాళ్లు విడిపోయాక, క్లైమాక్స్‌లోనే కలవడం పెద్ద మైనస్ పాయింట్. కలిసి కనిపించే సన్నివేశాలున్నా, ఎవరికి వారే అన్నట్లుగా ఆ పాత్రలు నడచుకోవడంతో వాళ్ల మధ్య కెమిస్ట్రీకి ఆస్కారం లేకుండా పోయింది. పాత్రల రూపకల్పనలో ఈ విషయాన్ని దర్శకుడు గుర్తించలేకపోయాడు. ఇదే కాదు.. కొంత కాలం క్రితం నాయికగా ప్రేక్షకులపై తన ముద్ర వేసిన లయకు సరైన స్పేస్ ఇవ్వలేకపోయాడు. ఆమె బదులు వేరే అంతగా పేరులేని నటితో ఆ పాత్ర చేయించినా తేడా ఉండదు.
– బుద్ధి యజ్ఞమూర్తి
18 నవంబర్, 2018