B. Jaya, CineDirector


సినీ లోకానికి బి. జయ, సాహితీ లోకానికి కలిదిండి జయ.. 54 యేళ్ల వయసులో ఆగస్ట్ 30 రాత్రి గుండెపోటుతో చనిపోయారు. ఒక పట్టాన జీర్ణం చేసుకోలేని మరణం. ఆమెతో, ఆమె భర్త బి.ఎ. రాజుతో రెండు దశాబ్దాల అనుబంధం. 31 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఆమె పార్థివ దేహం దగ్గరే మిగతా జర్నలిస్టు మిత్రులతో కలిసి గడిపాను. రచయిత్రిగా సీరియస్ సాహిత్యాన్ని ఇష్టపడిన ఆమె సినీ రంగంలో దర్శకురాలయ్యాక, సీరియస్ సినిమా వైపు కాకుండా కమర్షియల్ సినిమా వైపు మొగ్గడం ఆమెలోని మార్పు. రచయిత్రిగా ‘చక్ర’, ‘తండ్రులూ కూతుళ్లూ’, ‘పారిపోతావా? ఎటు?’, ‘మీరే ఆలోచించండి’, ‘వృత్తి’, ‘స్పర్శ’ వంటి చక్కని కథలు రాసిన ఆమె డైరెక్టర్‌గా ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’, ‘వైశాఖం’ వంటి సినిమాలు రూపొందించారు. చాలా ముక్కుసూటి మనిషి. కలిసిన ప్రతిసారీ సినిమాల కంటే సాహిత్యం గురించే మాట్లాడుకొనే వాళ్లం. కమర్షియల్ సినిమాలు మగవాళ్లే కాదు, స్త్రీలు కూడా తీయగలరని నిరూపించాలనే ఉద్దేశంతో అలాంటి సినిమాలు తీస్తున్నానని ఒకసారి ఆమె అన్నారు. అయితే ఎప్పటికైనా ఒక స్త్రీ చుట్టూ కథ నడిచే సీరియస్ సినిమా చేస్తానని ఆమె అన్నారు. అది వాస్తవరూపం ధరించకుండానే అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆమె గురించి ఇప్పుడిలా రాయాల్సొస్తుందని అనుకోలేదు. జయగారూ.. ఈ లోకం వదిలి వెళ్లడానికి మీరెందుకింత తొందరపడ్డారో అర్థం కాకుండా ఉంది.

Leave a Reply

Your email address will not be published.