Remakes We Like To Watch


Remakes We Like To Watch

మనం కోరుకుంటున్న రీమేక్లు

కంటెంట్ పరంగానే కాకుండా కమర్షియల్గానూ క్లాసిక్స్ అనిపించుకొన్న సినిమాల్ని రీమేక్ చెయ్యాలని, చేస్తే బాగుంటుందనీ తరచూ చిత్రసీమలో వినిపిస్తుంటుంది. క్లాసిక్స్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమనీ, వెళ్తే దెబ్బయిపోవడం ఖాయమనీ కొంతమంది తీర్మానించేస్తుంటారు. హిందీ చిత్రసీమ ఇందుకు భిన్నం. జయాపజయాలను పక్కనపెట్టి పాతవాటిని అడపాదడపా అయినా రీమేక్ చేస్తుంటారు. క్రమంలో వాళ్లు దేవదాస్ను మళ్లీ మళ్లీ తీశారు. మన ఊరుకి మొనగాడుసినిమాని హిమ్మత్వాలాగా రీమేక్ చేసినవాళ్లు, తిరిగి దాన్నే ఆమధ్య అజయ్ దేవగణ్తో రెండోసారి తీశారు. అలాంటి ఉదాహరణే హలో బ్రదర్విషయంలోనూ జరిగింది. ఇక్కడి నుంచి జుడ్వాగా సల్మాక్ ఖాన్తో తొలిసారి రీమేక్ చేస్తే, ఇప్పుడు వరుణ్ ధావన్తో మరోసారి తీసి హిట్ కొట్టారు. ఒరిజినల్ను అందించిన తెలుగువాళ్లు మాత్రం వాటి రీమేక్ జోలికి వెళ్లలేదు. అయితే ప్రేక్షకులు మాత్రం అప్పటి సూపర్హిట్ సినిమాల్ని, ట్రెండ్సెట్టర్ అనిపించుకున్న సినిమాల్ని ఇప్పటి తారలతో రీమేక్ చేస్తే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు రీమేక్స్ వస్తే బాగుండుననుకుంటున్న కొన్ని సినిమాలేంటో చూద్దాం

శివ

రాంగోపాల్వర్మను రాత్రికి రాత్రి సెన్సేషనల్ డైరెక్టర్గా, నాగార్జునను స్టార్గా మార్చేసిన సినిమా శివ‘. ఇది దర్శకుడిగా వర్మ తొలి చిత్రం. కాలేజీ లైఫ్తో పాటు, కాలేజీ విషయాల్లో బయటి శక్తుల జోక్యం, తమ అవసరాలకు విద్యార్థుల్ని గూండాలు ఉపయోగించుకోవడం, కాలేజీ రాజకీయాలు వంటి అంశాల్ని పకడ్బందీ స్క్రీన్ప్లేతో మేళవించి వర్మ రూపొందించిన తీరుతో ఒక కొత్త ధోరణికి నాంది పలికింది శివ‘. అందులోనే ఒక లవ్స్టోరీని కూడా ఇంప్రెసివ్గా జోడించాడు వర్మ. నాగార్జున, అమల జోడీ రోజుల్లో సృష్టించిన అలజడి చిన్నదేమీ కాదు. ఇక భవానీ అనే గ్యాంగ్లీడర్ పాత్రతో రఘువరన్ తరహా పాత్రలకు బెంచ్మార్క్ అయ్యాడు. ఇప్పటికీ అందులోని సైకిల్ చైన్ ఫైట్ గురించి జనం చెప్పుకుంటూనే ఉంటారు. సినిమాను ఇప్పటి కాలేజీ వాతావరణానికి అన్వయించి తీయగలిగితే నేటి తరం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు.

Remakes We Like To Watch

ఆదిత్య 369

తెలుగులో సైన్స్ఫిక్షన్ సినిమాలు లేవనే లోటును తీర్చిన సినిమా ఆదిత్య 369′. టైం మెషీన్ నేపథ్యంలో సింగీతం శ్రీనివాసరావు చిత్రాన్ని మలిచిన తీరు అమోఘం. ఒక సైటిస్ట్ తయారుచేసిన టైం మెషీన్లోకి అనుకోకుండా వెళ్లిన హీరో హీరోయిన్లు బాలకృష్ణ, మోహిని అక్కడ్నుంచి శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లిరావడం, ఇంకోసారి మూడో ప్రపంచ యుద్ధంలో రేడియేషన్ ద్వారా ప్రపంచం నాశనమయ్యే భవిష్యత్ కాలంలోకి వెళ్లడం దర్శకుడి ఊహాశక్తికి తార్కాణం. సమాంతరంగా ప్రపంచంలోని విలువైన వజ్రాల్ని దొంగిలించే రాజవర్మ (ఆమ్రిష్పురి) దృష్టి ఒక మ్యూజియంలో ఉన్న రాయల కాలం నాటి వజ్రంపై పడటం, దానిపై కథ నడవడాన్ని ఎక్కడా బోర్ కొట్టించకుండా, చక్కని సన్నివేశాలతో చిత్రీకరించారు దర్శకుడు. తగిన బడ్జెట్తో, నాణ్యమైన గ్రాఫిక్స్ సాయంతో సినిమాని రీమేక్ చేస్తే ప్రజాదరణ పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Remakes We Like To Watch

ఎ ఫిల్మ్ బై అరవింద్

తెలుగులో హారర్ థ్రిల్లర్లకు ఊపు తెచ్చిన దర్శకుడు శేఖర్ సూరి. 2005లో వచ్చిన ఎ ఫిల్మ్ బై అరవింద్సినిమాతో అందర్నీ తనవైపుకు తిప్పుకున్నాడు. అయితే తర్వాత అదే తరహా సినిమాలు తియ్యాలని రెండు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోయాడు. ‘త్రీ‘, ‘అరవింద్ 2′ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. అవే కాదు, ఆ ఒక్క సినిమా మినహా శేఖర్ తీసిన మరే సినిమా కూడా విజయాన్ని పొందలేదు. కానీ ఇప్పటికీ తెలుగులో హారర్ సినిమాలంటే ఎ ఫిల్మ్ బై అరవింద్ప్రస్తావన రాక మానదు. అలాంటి ఇంపాక్ట్ కలిగించిన సినిమా అది. ఇద్దరు స్నేహితులు.. ఒకరు దర్శకుడు అరవింద్ (రాజీవ్ కనకాల), ఇంకొకరు హీరో రిషి (రిషి) కలిసి మూడో సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తూ ఒక స్క్రిప్టు చదువుతారు. అందులో ఒక పేజీ మిస్సవుతుంది. చిత్రంగా అప్పటిదాకా తాము చదివిన స్క్రిప్టులో ఉన్న భయంకర ఘటనలే నిజంగా తాము ఎదుర్కొంటున్నట్లు గ్రహిస్తారు. అక్కడ్నుంచి అనుక్షణం ఉత్కంఠ పెరుగుతూ పోయే ఈ సినిమాకు రీమేక్ తియ్యడం ఇప్పుడు మరింత కరెక్టుగా ఉంటుందనిపిస్తుంది.

Remakes We Like To Watch

ప్రతిఘటన

విజయశాంతికి హీరోలకు సమానమైన ఇమేజ్ రావడంలో తొలి అడుగు వేయించిన సినిమా ప్రతిఘటన‘. సినిమా కేవలం వ్యాపారాత్మకమే కాదనీ, దానికి సామాజిక ప్రయోజనం ఉందనీ నమ్మి అదే నిబద్ధతతో సినిమాలు తీసిన దర్శకుడు టి. కృష్ణ ప్రతిభకు గీటురాయి ఈ సినిమా. రాజకీయాల్లో పాతుకుపోయిన అవినీతి, నేర ప్రవృత్తిపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఒక సాహసవంతురాలి కథతో కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. భర్త అసహాయుడై తనకు అండగా నిలవకపోయినా, ధైర్యంగా న్యాయం వైపు నిల్చొని, అన్యాయాన్ని ప్రశ్నించి, ఎన్నికల్లో దౌర్జన్యంతో, ధనబలంతో నెగ్గి ఎమ్మెల్యే అయిన ఓ నేరగాడ్ని జనం కళ్లెదుటే కడతేర్చిన ఝాన్సీ పాత్రలో విజయశాంతి నటన గురించి ఇప్పటికీ మనం గొప్పగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఆద్యంతం సినిమాని ఒక సీరియస్ టోన్‌లో నడిపించి, ఎక్కడా విసుగు తెప్పించకుండా తీర్చిదిద్దాడు దర్శకుడు. అప్పటికంటే ఇప్పుడు రాజకీయాలు కానీ, సమాజం కానీ మరింతగా విలువలపరంగా దిగజారిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చెయ్యడం చారిత్రక అవసరం కూడా.

Remakes We Like To Watch

ఐతే..

చంద్రశేఖర్ యేలేటి.. అప్పటిదాకా అతనెవరో ఎవరికీ తెలీదు. ‘ఐతే..’ సినిమా విడుదలయ్యాక ఆ పేరు అందరి నోళ్లలోనూ నానింది. ప్రేక్షకులకు తెలీని కొత్త ముఖాలను ప్రధాన పాత్రధారులుగా చూపిస్తూ ఒక డొమెస్టిక్ ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో కథ కంటే కథనాన్నే నమ్ముకొని చంద్రశేఖర్ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతినిచ్చింది. ఎప్పుడూ అవే ఆరు పాటలు, నాలుగు ఫైట్లతో నిండివుండే సినిమాల్ని చూసి చూసీ బోరెత్తిపోయిన ప్రేక్షకులకు తన సినిమాతో రిఫ్రెషింగ్ ఫీలింగ్‌నిచ్చాడు దర్శకుడు. హైదరాబాద్ నుంచి ఖాడ్మండుకు వెళ్తున్న ఒక విమానాన్ని ఇర్ఫాన్ ఖాన్ అనే మాఫియా లీడర్ హైజాక్ చేస్తే, నలుగురు ఆకతాయి కుర్రాళ్లు ఆ ఖాన్‌నే కిడ్నాప్ చేసి చిక్కుల్లో పడటం, చివరికెలాగో మాఫియా గ్యాంగు నుంచి తప్పించుకొని ఇళ్లకు సురక్షితంగా చేరుకోవడం, అనుకోనివిధంగా భారీ మొత్తంలో డబ్బును బహుమతిగా అందుకోవడాన్ని ఎక్కడా బిగి సడలకుండా, ఉత్కంఠని తగ్గించకుండా తీశాడు చంద్రశేఖర్. నేటి కాలానికి కూడా అన్వయించే కథాంశం ఉన్న ఈ సినిమాని రీమేక్ చెయ్యడం మంచి ఫలితాన్నిస్తుంది.

Remakes We Like To Watch

బొబ్బిలి రాజా

ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ఎలాంటి హంగులుండాలో అలాంటి హంగులన్నీ ఉన్న సినిమా బొబ్బిలి రాజా‘. సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించిన ఈ సినిమాను దర్శకుడు బి. గోపాల్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దాడు. తన తల్లినీ, తాతనూ నేరగాళ్లుగా ముద్రవేసి, తమను అడవిపాలు చేసిన మేనత్తకూ, ఆమె అన్నకూ బుద్ధి చెప్పిన రాజా (వెంకటేశ్) అనే యువకుడి కథ ఇది. సవాళ్లూ, ప్రతిసవాళ్లూ, ఎత్తులు పై ఎత్తులు, మోసాలు, కొట్లాటలు, చేజింగులు, రొమాన్సులు, పాటలు, సరదా సన్నివేశాలు.. అన్నీ కలిపి షడ్రచోపేతమైన విందు భోజనంలా ఉంటుంది సినిమా. రాజా, రాణి (దివ్యభారతి) మధ్య గొడవతో అయిన పరిచయం రొమాన్సులోకి దిగడం, ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడతాయి. తెలుగులో దివ్యభారతికి ఇదే తొలి సినిమా. ఈ ఒక్క సినిమాతోటే ఆమె స్టార్ అయిపోయింది. హీరోగా వెంకటేశ్ ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది ఈ సినిమా. ఎక్కువ భాగం కథ అడవిలో నడిచే ఈ సినిమాను ఇప్పుడు మళ్లీ తియ్యడం సరైన పనే అవుతుంది.

– బుద్ధి యజ్ఞమూర్తి

19 నవంబర్, 2018