Robot And 2.0: Which Movie Is The Best?


Robot And 2.0: Which Movie Is The Best?

‘2.0’ కంటే ‘రోబో’నే బెటర్

శంకర్. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. సామాజిక అంశాలకు కమర్షియాలిటీని జోడించి అత్యధిక ప్రజానీకం చూసేవిధంగా ఆకర్షణీయంగా చిత్రాలు మలచడంలో అగ్రగణ్యుడు. అందుకు ‘జెంటిల్‌మన్’, ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజి’, ‘రోబో’ వంటి సినిమాలే నిదర్శనం. ‘ఐ’ సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రం ‘2.0’. ఇది 2010లో రజనీకాంత్‌తో ఆయన తీసిన ‘రోబో’కు సీక్వెల్. తన మునుపటి సినిమాల తరహాలోనే ఒక సామాజికాంశానికి వాణిజ్య అంశాలు జోడించి ఈ సినిమాని ఆయన రూపొందించాడు. ఈ సందర్భంగా ఒరిజినల్, సీక్వెల్‌లలో ఏది బాగుంది? అనే ప్రశ్న రాక మానదు. ఈ మధ్య రాజమౌళి నుంచి వచ్చిన ‘బాహుబలి 2’ సినిమా దాని ఒరిజినల్ కంటే ఘన విజయం సాధించడం చూశాం. బాలీవుడ్‌లోనూ మొదటి సినిమా కంటే దాని కొనసాగింపుగా వచ్చిన పలు సినిమాలు మరింత విజయాన్ని, మరింత బాగున్నాయనే ప్రశంసల్నీ పొందాయి. ఈ నేపథ్యంలో ‘రోబో’, ‘2.0’లలో ఏది బాగుంది? ఒరిజినల్ కంటే సీక్వెల్‌ను శంకర్ మరింత బాగా తీశారా లేక ఆశించినట్లు తీయలేకపోయారా? పోల్చి చూద్దాం…

రోబో (2010)

కృత్రిమ మేధస్సు సాయంతో రోబోలను తయారుచేసి భారత్ ఆర్మీకి వాటిని అందజేస్తే, భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్ఠమవుతుందనే ఉద్దేశంతో ‘చిట్టి’ అనే రోబోను తయారుచేస్తాడు సైంటిస్ట్ డాక్టర్ వశీకర్. అయితే మానవ భావోద్వేగాల్ని తెలుసుకోలేని మరమనిషి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని వాదిస్తాడు వశీకర్ అంటే గిట్టని ప్రొఫెసర్ బోరా. అందుకు తగ్గట్లే ఒక అగ్నిప్రమాదంలో బాధితుల్ని కాపాడిన చిట్టి, ఒక యువతి స్నానం చేస్తున్న సమయంలో ఆమెను కాపాడతాడు కానీ, ఆ సన్నివేశాలు టీవీ చానళ్లలో లైవ్ కావడంతో భరించలేని ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత ఆర్మీ పెట్టిన పరీక్షలో ఫెయిలవడంతో చిట్టిని డిస్మాంటిల్ చేస్తాడు వశీకర్. అయితే చిట్టి తాలూకు విడి భాగాల్ని తీసుకొచ్చి, చిట్టిని పునర్మిస్తాడు బోరా. కానీ గ్రీన్ చిప్ బదులు ప్రమాదకరమైన రెడ్ చిప్ పెడతాడు. దాంతో వినాశకర రోబోగా అవతరించిన చిట్టి మొదట బోరానే చంపి, అదివరకు తాను ప్రేమించిన వశీకర్‌కు కాబోయే భార్య సనాను కిడ్నాప్ చేస్తాడు. చెన్నైలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆక్రమిస్తాడు. అప్పటికే తనకు నకలులాంటి వేలాది రోబోలను సృష్టిస్తాడు. చిట్టి నుంచి ప్రజల్ని కాపాడ్డంతో పాటు, వినాశకరంగా మారిన చిట్టిని మామూలుగా మార్చడానికి వశీకర్ చేసిన ప్రయత్నం ఫలిస్తుంది. ఎట్టకేలకు చిట్టి మామూలుగా మంచి రోబోగా మారతాడు. అయితే అప్పటికే దానివల్ల జరిగిన దారుణాలతో కోర్టు చిట్టిని నిషేధిస్తుంది. వశీకర్ దాన్ని మరోసారి డిస్మాంటిల్ చేయడంతో కథ ముగుస్తుంది.

మనిషి మేధస్సుతో ఏమైనా తయారుచేయొచ్చనే అంశంతో పాటు, ఆ మేధస్సును చెడుకు ఉపయోగిస్తే కలిగే చెడు ఎలా ఉంటుందో కూడా ఈ సినిమాలో ప్రభావవంతంగా చూపాడు దర్శకుడు శంకర్. సినిమాని ఆద్యంతం ఒక భావావేశం నడిపిస్తుంది. మంచి కోసం తను సృష్టించిన చిట్టి దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే, సనతో అసభ్యంగా వ్యవహరిస్తుంటే వశీకర్ పొందే వేదనతో ప్రేక్షకులు సహానుభూతి పొందారు. అదే సమయంలో చిట్టి నాశనం కాకూడదనీ, అది మంచిగా మారాలనీ ప్రేక్షకులు ఆశిస్తారు. చివరలో అదే జరిగినప్పుడు సంతోషిస్తారు. కానీ చిట్టిని కోర్టు నిషేధించినప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో చిట్టిని డిస్మాంటిల్ చేయడానికి వశీకర్ తటపటాయిస్తుంటే, చిట్టే తనను డిస్మాంటిల్ చెయ్యమని చెప్పినప్పుడు ప్రేక్షకుల హృదయాలు బరువెక్కుతాయి. క్లైమాక్స్ ఫైట్లో చిట్టిని వశీకర్ ఎదుర్కొనే విధానం కూడా ప్రేక్షకులు మెచ్చారు. ఆ సన్నివేశాలను స్పెషల్ ఎఫెక్ట్స్ సాయంతో చాలా బాగా రూపొందించారు శంకర్. అలా సినిమా అంతా ఒక మూడ్తో నడవడమే ‘రోబో’ను ఆకర్షణీయంగా మార్చింది. అది కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రధాన సినిమా కాదు. చక్కని కథ కూడా దానికి అమిరింది.

Robot And 2.0: Which Movie Is The Best?

2.0 (2018)

‘రోబో’కు కొనసాగింపు కథ ‘2.0’. వశీకర్, చిట్టి పాత్రలు యథాతథంగా ఇందులో ఉన్నాయి. సన పాత్ర కనిపించదు కానీ ఫోన్‌లో వినిపిస్తుంది. కొత్తగా వెన్నెల అనే రోబో పాత్ర వచ్చింది. ప్రొఫెసర్ బోరా కొడుకు వచ్చాడు. బోరా ‘రోబో’లో చిట్టిని బతికించి చెడుగా మారిస్తే, ఇందులో బందీ అయిన పక్షిరాజాను బోరా కొడుకు విడుదల చేసి, అది మరింత శక్తిమంతంగా మారి, వినాశనం సృష్టించడానికి కారణమవుతాడు. తండ్రీకొడుకులిద్దరూ తాము పునర్జన్మ ఇచ్చిన వాళ్ల చేతుల్లోనే చావడం గమనార్హం. ఒరిజినల్‌లో మంచిదైన చిట్టే విలన్‌గా మారి విధ్వసం, పాణనష్టం చేకూరిస్తే, ఇందులోనూ ఎంతో మంచివాడైన పక్షిరాజా చనిపోయాక ఆత్మ రూపంలోకి మారి, పక్షుల చావుకు కారణమవుతున్న మనుషుల్ని చంపుతాడు. కాకపోతే ఇందులో విలన్ పక్షిరాజా ఆటకట్టించేది చిట్టి. ఒక రోబోకూ, ఇంకో ఆత్మకూ మధ్య పోరాటమన్న మాట. ఒక్క పక్షిరాజా ఫ్ల్యాష్‌బ్యాక్ కథ మాత్రమే మనల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది తప్పితే మిగతా సన్నివేశాలతో మనం అంతగా కనెక్ట్ కాలేం. చిట్టి రూపంలోని మీనియేచర్ చిట్టిలు రావడమే చివరలో కాస్త ఆకట్టుకొనే విషయం. క్లైమాక్స్ కూడా ‘రోబో’ తరహాలో ఆకట్టుకోలేక పోయింది. సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగానే పక్షులు చనిపోతున్నాయని ఆవేదన చెంది, పక్షుల కోసమే పోరాటం చేసిన ప్రొఫెసర్, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాక, రేడియేషన్‌కు కారకులైన వాళ్లని మాత్రమే టార్గెట్ చేసుకోవాలి కానీ, సెల్‌ఫోన్లు వాడే సాధారణ మనుషులపై పగ తీర్చుకోవాలనుకోవడం ఏ రకంగా సమర్థనీయం? అది దర్శకుడు చేసిన పొరపాటు. ఈ విషయం గ్రహిస్తే ప్రేక్షకులు కూడా కథతో డిస్‌కనెక్ట్ అవుతారు. ‘రోబో’లో సన పాత్రలో మనల్ని ఐశ్వర్యారాయ్ ఆకట్టుకుంది. ఇందులో వెన్నెల పాత్రలో అమీ జాక్సన్ ఉంది కానీ, ఆమె ఒక రోబో అని తెలిశాక ఆ పాత్రతోనూ మనం కనెక్ట్ కాలేం. పక్షిరూపంలో పక్షిరాజా కనిపించే సన్నివేశాలు, సెల్‌ఫోన్లు రోడ్లపై ప్రవాహంలా కదిలే సన్నివేశాలు, మీనియేచర్ చిట్టిలు పావురాలపై స్వారీ చేసే సన్నివేశాలు స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా ‘2.0’లో ఆకట్టుకొనేలా ఉన్నాయి. ‘రోబో’తో పోలిస్తే కథ పరంగా కానీ, భావేద్వేగాల పరంగా కానీ ‘2.0’ సరితూగదు.

– సంజయ్

30 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *