Sai Pallavi And Sharwanand: Who Is The Best?


సాయిపల్లవి, శర్వానంద్: పైచేయి ఎవరిది?

తెలుగులో ‘ఫిదా’ సినిమాతో నాయికగా పరిచయమై తొలి సినిమాతోటే ప్రేక్షకులకు అత్యంత సన్నిహితమైపోయిన సాయిపల్లవి, ఆ వెంటనే నానితో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’లో జోడీ కట్టి అలరించింది. ఈ రెండూ 2017లో వచ్చినవే. ఈ ఏడాది ‘కణం’ అనే ద్విభాషా చిత్రం వచ్చింది. అది ఆఫ్‌బీట్ ఫిల్మ్. ఇప్పుడు డిసెంబర్ 21న ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఆమె శర్వానంద్ సరసన కనిపించనుండటం ఆసక్తిని కలిగిస్తోంది. శర్వానంద్ అంటేనే భిన్నమైన సబ్జెక్టులు ఎంచుకుంటాడని పేరు. అతని సినిమా అంటే మినిమం గ్యారంటీ అని డిస్ట్రిబ్యూటర్లు కూడా నమ్ముతున్నారు. గత ఏడాది ‘శతమానం భవతి’, ‘మహానుభావుడు’ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ‘మహానుభావుడు’ తర్వాత శర్వానంద్ నుంచి వస్తున్న సినిమా అదే. ‘పడి పడి లేచే మనసు’కు సంబంధించి ఇంకో ఇంట్రెస్ట్ పాయింట్ పాయింట్ హను రాఘవపూడి డైరెక్షన్. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ వంటి హిట్ తర్వాత అతడు రూపొందించిన ‘లై’ ఫ్లాపయింది. దాంతో ఈసారి చాలా జాగ్రత్తగా ‘పడి పడి లేచే మనసు’ను తీర్చిదిద్దాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా డిజిట‌ల్, శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ క‌లిపి 12 కోట్ల‌కు అమ్ముడుపోయాయని నిర్మాతలు తెలిపారు. డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైం, శాటిలైట్ హక్కుల్ని స్టార్ మా చానల్ దక్కించుకున్నాయి. కోల్‌కతా నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో సాయిపల్లవి, శర్వానంద్ జోడీ ఎలా ఉంటుందోననే ఆసక్తి వ్యక్తమవుతోంది ప్రేక్షకుల్లో. ఇద్దరికి ఇద్దరూ చక్కని నటులు కావడంతో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో చూడాలని వాళ్లు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *