Sankranthi Battle: NTR Vs Vinaya Vidheya Rama Vs F2


సంక్రాంతికి సై: గెలిచేది ఎవరు?

సంక్రాంతి పండుగ కోసం సంప్రదాయ సినీ ప్రేమికులు ఆత్రుతతో ఎదురు చూస్తుంటారు. కారణం, పెద్ద హీరోల, భారీ బడ్జెట్, క్రేజీ సినిమాలు ఒకటికి మించి విడుదలవడం, భిన్న సినిమాలను చూసే, ఎంచుకొనే అవకాశం ఉండటం. అదే తరహాలో వచ్చే సంక్రాంతికీ మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఓవైపు తెలుగునాట బలిష్టమైన కోడిపుంజులు ఒకదానితో ఒకటి ద్వంద్వ యుద్ధానికి సై అనే సమయంలో ఇంకోవైపు ముగ్గురు అగ్ర కథానాయకులు ఒకరితో ఒకరు బాక్సాఫీస్ బరిలో త్రిముఖపోటీకి బస్తీ మే సవాల్ అంటున్నారు. ఆ సినిమాలు నందమూరి బాలకృష్ణ ‘ఎన్.టి.ఆర్: కథానాయకుడు’, రాంచరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకటేశ్ ‘ఎఫ్2’. ఈ మూడో దానిలో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు.

ఎన్.టి.ఆర్: కథానాయకుడు

ప్రేక్షకులు అత్యంత కుతూహలంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ‘ఎన్.టి.ఆర్’. నిజానికి ఇది ఒక సినిమా కాదు. రెండు భాగాల సినిమా. జగద్విఖ్యాత నందమూరి తారకరామారావు బయోపిక్ అయిన ఈ సినిమాని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. వాటిలో తొలి భాగం ‘ఎన్.టి.ఆర్: కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానున్నది. ఎన్టీఆర్ బాల్యం నుంచి, సినీ రంగంలో ఎదురులేని కథానాయకుడిగా రాణించినంత వరకు ఈ సినిమాలో చూపించనున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టి, తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువాళ్ల జీవితాల్ని అదివరకు ఏ రాజకీయ నాయకుడూ ప్రభావితం చేయనంతగా ప్రభావితం చేసిన వైనాన్ని ‘ఎన్.టి.ఆర్: మహానాయకుడు’లో చిత్రిస్తున్నాడు క్రిష్. బయోపిక్ తియ్యడమంటే ఆషామాషీ కాదు. విమర్శకులు ప్రతి అంశాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తారు. వాస్తవ విరుద్ధంగా ఏమాత్రం కనిపించినా చెండాడుతారు. అలాంటి కత్తి మీద సాము లాంటి బాధ్యతను తలమీద మోస్తూ తీస్తున్నాడు క్రిష్. ఇక అన్నింటి కంటే క్లిష్టమైంది ఎన్టీఆర్ పాత్ర పోషణ. ఇప్పటికీ తెలుగువాళ్ల హృదయాల్లో దేవుడిలాంటి స్థానం ఉన్న ఎన్టీఆర్‌గా నటించి మెప్పించడం చాలా చాలా కష్టమైన విషయం. ఆ కష్టాన్ని బాలకృష్ణ మోస్తున్నారు. ఇప్పటి దాకా విడుదల చేసిన స్టిల్స్‌లో ఎన్టీఆర్‌లా కనిపించకపోయినా ఆయనలా ప్రవర్తించడానికి బాలకృష్ణ శాయసక్తులా కృషి చేస్తున్నారనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. విద్యాబాలన్, రానా, సుమంత్, కల్యాణ్‌రాం, రకుల్‌ప్రీత్, తమన్నా, నిత్యా మీనన్, శ్రియ వంటి పేరుపొందిన తారలంతా కనిపించే ఈ సినిమా, తన జీవిత కాలంలో అనేక చరిత్రలు సృష్టించిన ఎన్టీఆర్‌లా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందా? ఎదురులేని విజయాన్ని సాధిస్తుందా? అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఇదే.

వినయ విధేయ రామ

‘మగధీర’, ‘రంగస్థలం’ వంటి బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన సినిమాల్లో నటించిన హీరో ఒకరైతే, ‘సింహా’, ‘లెజెండ్’, ‘సరైనోడు’ వంటి సూపర్ హిట్ పక్కా మాస్ యాక్షన్ సినిమాల్ని రూపొందించిన డైరెక్టర్ ఒకరు. ఆ ఇద్దరు.. రాంచరణ్, బోయపాటి శ్రీను. ఆ ఇద్దరి కలయికలో తయారవుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. టైటిల్ చూస్తేనే.మో సాఫ్ట్‌గా ఉంది. టీజర్ చూస్తే హీరో మహా ఆవేశపరుడిగా కనిపిస్తున్నాడు. ఇందులో తన పేరుతోనే రాంచరణ్ నటిస్తున్నాడు. కాకపోతే చరణ్‌ను తీసేసి ‘రాం కొణిదెల’ అనే పేరున్న పాత్రలో కనిపించనున్నాడు. ఉద్వేగభరిత సన్నివేశాలు. పరాకాష్ఠకు చెందిన హీరోయిజం నిండిన సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి, రాంచరణ్‌ను తెరపై ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. అందుకు తగ్గట్లే బిజినెస్ వర్గాల్లో అమితమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కియారా అద్వానీ నాయికగా, ‘రక్త చరిత్ర’లో పరిటాల రవిగా నటించి తెలుగువాళ్లకు పరిచితుడైన బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ విలన్‌గా కనిపించబోతున్నారు. అటు హీరో, ఇటు డైరెక్టర్.. ఇద్దరూ క్రేజ్ ఉన్నవాళ్లే, హిట్లలో ఉన్నవాళ్లే కావడంతో సంక్రాంతి బరిలో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ‘వినయ విధేయ రామ’కు పుష్కలంగా ఉన్నాయి. జనవరి 11న సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఎఫ్2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్

కొంతకాలంగా సీనియర్ హీరోలు యువ హీరోలతో కలిసి నటించడానికి ముందుకొస్తుండటంతో మల్టీస్టారర్ సినిమాలు తయారవుతున్నాయి. ఆ సీనియర్ హీరోల్లో వెంకటేశ్ ఒకరు. పవన్ కల్యాణ్, మహేశ్, రాం వంటి హీరోలతో కలిసి నటించిన ఆయన ఇప్పుడు వరుణ్ తేజ్‌తో కలిసి ఎఫ్2 సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్‌గా హ్యాట్రిక్ హిట్ కొట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక వెంకటేశ్ సరసన తొలిసారి తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటిస్తున్నారు. ఎలా చూసినా కాంబినేషన్ పరంగా క్రేజీగా కనిపిస్తున్న ఈ సినిమా ఇటు ప్రేక్షకుల్లో, అటు సినీ వర్గాల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే ట్యాగ్ లైన్ చూస్తుంటే సినిమాలో వినోదానికి కొదవ ఉండదని అర్థమవుతోంది. కథ ప్రకారం జరిగే సంఘటనల వల్ల ఏర్పడే ఫ్రస్ట్రేషన్స్ నుండే ఈ ఫన్ పుడుతుందని యూనిట్ వర్గాల సమాచారం. జూలైలోనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాని ఎలాగైనా సంక్రాంతికి తీసుకు రావాలనే పట్టుదలతో ఉన్నారు దిల్ రాజు. బరిలో రెండు అత్యంత క్రేజీ సినిమాలు ‘ఎన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ ఉన్నా ఆయన వెరవడం లేదు. ఈ ఫన్ ఫిలింను సంక్రాంతికి విడుదల చేస్తేనే కరెక్టని ఆయన భావిస్తున్నారు. అందుకే జనవరి 12న విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నారు.

ఇలా మూడు అత్యంత ఆసక్తికర, బలమైన సినిమాలు సంక్రాంతికి తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో ఏది ప్రేక్షకుల్ని రంజింపజేస్తుందో, ఏది ప్రేక్షకుల అనాదరణకు గురవుతుందోననే లెక్కలు మొదలయ్యాయి. గతంలో సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన సందర్భాలున్నాయి. అదే రీతిన ఈ మూడూ విజయాన్ని సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అలా ఆడితే సినీ పరిశ్రమకు నిజంగా పండుగే కదా!

– బుద్ధి యజ్ఞమూర్తి

25 నవంబర్ 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *