Subrahmanyapuram Trailer Reactions: Thums Up


సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ రియాక్షన్స్

సుమంత్ హీరోగా నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ డిసెంబరులో విడుదలకు సిద్ధం అవుతోంది. సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ ప్రమోషన్ పనులు ట్రైలర్ రిలీజ్‌తో మొదలయ్యాయి. థ్రిల్లర్ అనేది కత్తిమీద సాము తరహా జోనర్. బాగా తీయగలిగితే ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేసి, ఒక కొత్త అనుభూతినిస్తుంది. స్క్రీన్‌ప్లే సరిగా లేకపోతే, అదే సినిమాకు శాపంగా మారి ప్రేక్షకుల చేత తిరస్కారానికి గురవుతుంది. ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. ‘ఎవరికైనా కష్టం వస్తే భగవంతుడికి చెప్పుకుంటాం. కానీ భగవంతుడే కష్టానికి కారణం అయితే ఎవరికి చెప్పుకుంటాం’ అనే లైన్‌పై ఆధారపడి ఈ సినిమా రూపొందింది. సుబ్రహ్మణ్యపురంలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం చుట్టూ నడిచే కథగా ట్రైలర్‌ని బట్టి చూస్తే అర్థమవుతుంది. హీరో సుమంత్ భగవంతుడిపై నమ్మకంలేని నాస్తికుడిగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ ఈషా రెబ్బా ”దేవుడంటే నమ్మకం లేకపోతే నీ ఖర్మ” అనడం, గ్రామ పెద్దగా కనిపిస్తున్న సురేశ్ ”గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలంటారు. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు” అనే మాటల్ని బట్టి సుమంత్ కేరక్టర్ ఎలా ఉంటుందనేది తెలుస్తోంది. సుమంత్ “వీటి వెనుక దేవుడున్నా సరే, నా కళ్లతో చూసేవరకు, నా చేతుల్తో పట్టుకొనేవరకు ఈ ఊరొదిలే ప్రసక్తే లేదు” అనడాన్ని బట్టి అతడేదో పెద్ద పనిమీదే సుబ్రహ్మణ్యపురానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకు థ్రిల్లర్లకు తన మ్యూజిక్‌తో ప్రాణం పోసిన శేఖర్ చంద్ర ఈ సినిమాకీ ఆ బాధ్యతను బాగా నిర్వర్తించాడని ట్రైలర్‌లో మ్యూజిక్ చెబుతోంది. చాలా కాలంగా సుమంత్ కెరీర్ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 2011లో వచ్చిన ‘గోల్కొండ హైస్కూల్’ తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొంటూ వస్తున్న అతనికి మునుపటి సినిమా ‘మళ్లీ రావా’ కాస్త ఊపిరినిచ్చింది. అందులో అతడి పేరు కార్తీక్. ‘సుబ్రహ్మణ్యపురం’లోనూ అతడి పేరదే. తొలిసారిగా అతడు చేసిన ఈ థ్రిల్లర్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.