Sye Raa Narasimha Reddy: 5 Rumours We Know Are False
సైరా నరసింహారెడ్డి: తప్పని తేలిన రూమర్లు
చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెలుగులో ‘బాహుబలి’ తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా. బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రంలో అతిరథ మహారథుల్లాంటి తారలు నటిస్తున్నారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ బచ్చన్, భార్య సిద్దమ్మ పాత్రలో నయనతార, ఓబయ్యగా విజయ్ సేతుపతి, అవుకురాజాగా సుదీప్, మైరారెడ్డిగా జగపతిబాబు, ఇంకో కీలక పాత్రలో తమన్నా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత రామ్ చరణ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటి ఈ సినిమాపై మొదట్నుంచీ అనేకానేక వదంతులు షికారు చేస్తూ వస్తున్నాయి. అవేమిటో, వాటిలో నిజమెంత ఉందో చూద్దాం.
అల్లు అర్జున్ అతిథి పాత్ర
గతంలో చిరంజీవి సినిమాలు ‘డాడీ’, ‘శంకర్ దాదా జిందాబాద్’లో కనిపించిన అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం అర్జున్ ఈ సినిమాలో నటించడం లేదు. కనిపిస్తాడని చెబుతున్నది ఉత్త రూమర్.
గుణశేఖర్ సూపర్విజన్
షూటింగ్ మొదలై కొన్ని రోజులు జరిగాక రష్ చూసుకున్న చిరంజీవి అసంతృప్తి చెందారనీ, ఇలాంటి సినిమాల రూపకల్పనలో సురేందర్ రెడ్డికి అనుభవం లేకపోవడం వల్ల ఆశించినట్లు తియ్యలేకపోతున్నాడని చిరంజీవి భావించారనీ ప్రచారంలోకి వచ్చింది. అందుకే సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ను కొన్ని సన్నివేశాల చిత్రీకరణను పర్యవేక్షించామని అడిగినట్లు, గుణశేఖర్ సరేనన్నట్లూ ఈ ఏడాది ఆరంభంలో వినిపించింది. అయితే అవన్నీ పుకార్లు మాత్రమేనని యూనిట్ వర్గాలు తెలిపాయి. మొదట కొన్ని సన్నివేశాలు తీసినప్పుడు మరింత బాగా తియ్యడానికి అవకాశం ఉందని సురేందర్ రెడ్డికే అనిపించిందని, దానికి తగ్గట్లు మరింత శ్రద్ధగా సన్నివేశాలు చిత్రీకరించుకుంటూ వచ్చాడనీ, సురేందర్ పనితీరుపై చిరంజీవి పూర్తి సంతృప్తితో ఉన్నారనీ ఆ వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల గుణశేఖర్ పర్యవేక్షణ అనేదే లేదని అవి స్పష్టం చేశాయి.
అమితాబ్ తప్పుకున్నారు
తొలి షెడ్యూల్ అయ్యాక సినిమాలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రను అమితాబ్ చేస్తున్నారనే విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ వెంటనే ఈ ప్రాజెక్ట్ నుంచి అమితాబ్ తప్పుకున్నారనీ, దాని వెనుక అనేక కారణాలున్నాయనీ ప్రచారమైంది. అమితాబ్ స్థానంలో ప్రకాశ్‌రాజ్ వచ్చారనీ కూడా ఇంటర్నెట్లో ప్రచారం జరిగింది. కానీ అదంతా ఎవరో కావాలని పుట్టించిన రూమర్ అనీ, అమితాబ్ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సంతోషంగా షూటింగ్లో పాల్గొన్నారనీ తేలింది. ఆయన పాల్గొన్న సన్నివేశానికి సంబంధించి స్టిల్స్ కూడా బహిర్గతమయ్యాయు. రూమర్లు పుట్టించినవాళ్లు మిన్నకుండిపోయారు.
నయనతార తప్పుకున్నారు
‘సైరా’ షూటింగ్ 2017 డిసెంబర్లో మొదలైంది. నరసింహారెడ్డి భార్య సిద్దమ్మ పాత్రను నయనతార చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఆమె 2018 నుంచి కాల్షీట్లు ఇచ్చినట్లు వర్తలు వచ్చాయి. ఆ వెంటనే అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉండేందుకు వీలుగా ఏడాదంతా డేట్స్ కావాలని ఆమెను నిర్మాతలు అడిగారనీ, అప్పటికే తమిళంలో కమిట్మెంట్స్ ఉన్నందున నయనతార అందుకు అంగీకరించలేదనీ, ఫలితంగా ఆమె సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారనీ ప్రచారం చేశారు. అది కూడా కేవలం వదంతి మాత్రమే అని, చిరంజీవి, ఆమె కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలతో తేటతెల్లమైంది.
రెహమాన్ డ్రాపవడం వెనుక..
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ వంటి సంగీత దర్శకుడైతే మరింత ఆకర్షణ చేకూరుతుందని భావించిన నిర్మాతలు ఆయనను సంప్రదించడం, ఆయన అంగీరించడం జరిగాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి ముందుగానే ఆయన ప్రాజెక్టు నుంచి తొలగడం రకరకాల సందేహాలకు తావిచ్చింది. రెమ్యూనరేషన్ సమస్యతోనే రెహమాన్ బయటకు వెళ్లిపోయారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన తప్పుకోవడం వెనుక ప్రాజెక్ట్ ఆలస్యమవడమే కారణమని తర్వాత వెల్లడైంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందుగానే ఆయన వేరే ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం, ‘సైరా’ షూటింగ్లో జాప్యం కారణంగా తన షెడ్యూల్ దెబ్బతినే అవకాశం ఉందని భావించిన రెహమాన్, మున్ముందు తన కారణంగా ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే సున్నితంగా సినిమా నుంచి తప్పుకున్నారని స్పష్టమైంది. అప్పట్లో హైదరాబాద్‌లో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్న ఆయన అక్కడ “సైరా సినిమాకి పని చేయడం కోసం ఆత్రుతగా ఎదురుచూశాను. కానీ నా షెడ్యూల్ ప్రకారం పనులు జరగలేదు. అందువల్ల విధిలేని స్థితిలో ఆ ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చింది” అని స్పష్టం చేశారు.
– బుద్ధి యజ్ఞమూర్తి
24 నవంబర్, 2018