Vijay Devarakonda: Man On A Mission


విజయ్ దేవరకొండ: సూపర్ స్టార్ దిశగా…

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తెలుగు చిత్రసీమలో హీరోగా రాణించడం చాలా కష్టం. ఒకసారి పరిశీలిస్తే కొన్ని వందల మందిలో ఒక్కరు మాత్రమే హీరోగా నిలదొక్కుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. ఒక చిరంజీవి, ఒక రవితేజ, ఒక నాని. ఇప్పుడు ఆ జాబితాలో చేరడానికి కష్టపడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఆ దారిలో ఇప్పటికే సగం దూరం వచ్చేశాడు. ఇక్కడ్నుంచే మరిన్ని అవరోధాలు అతడికి ఎదురుకానున్నాయి. వాటిని అధిగమించడం పైనే ఒక స్టార్ హీరోగా అతడు స్థానం సంపాదించే వీలుంటుంది. సినిమా సినిమాకూ విజయ్‌లో కనిపిస్తున్న పరిణతి, పాత్రల్ని, కథల్ని అతడు ఎంచుకుంటున్న విధానం నటుడిగా అతడు మరింత ఎదుగుతాడనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. భిన్న కథలు, భిన్న పాత్రలతో ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్న విజయ్ కెరీర్ సింహావలోకనం…

నువ్విలా (2011)

ఏడేళ్ల క్రితం రవిబాబు రూపొందించిన ‘నువ్విలా’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు విజయ్. అతడిది అందులో ఒక సపోర్టింగ్ కేరక్టర్. అర్ధంతరంగా విషాదంతో ముగిసే పాత్ర. విష్ణు అనే క్రికెటర్ పాత్ర పోషించాడు. హీరోయిన్ యామీ గౌతం ప్రేమలో పడేది అతడితోనే. అతడి కారణంగా ఆమె గర్భవతి అవుతుంది కూడా. కానీ అతను అనుకోకుండా చనిపోవడంతో హీరో అజయ్ ఆమెకు అండగా నిలుస్తాడు. ఈ సినిమాలో కనిపించేది కొద్దిసేపే కావడం, సినిమా ఆడకపోవడంతో విజయ్‌కు గుర్తింపు రాలేదు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)

ఔత్సాహిక నటుడిగా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న విజయ్‌కు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అజయ్ అనే నెగటివ్ షేడ్స్ ఉన్న సపోర్టింగ్ రోల్ చేశాడు. ఒక హీరోయిన్‌ను బలాత్కారం చేయబోయి దెబ్బలు తినే ఆ కేరక్టర్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. మనిషి బాగున్నాడే అనిపించుకున్నాడు.

ఎవడే సుబ్రమణ్యం (2015)

రెండో సినిమా చేసిన మూడేళ్ల దాకా విజయ్ మరో సినిమాలో కనిపించలేదు. మంచి పాత్ర కోసం ఎదురుచూస్తూ గడిపిన అతడికి తొలి బ్రేక్ ఇచ్చింది ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రం. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో నాని అయినా, విజయ్ సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రిషి పాత్రను డైరెక్టర్ మలచిన తీరూ, ఆ పాత్రను విజయ్ పోషించిన తీరూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. అందులోనూ రోడ్ యాక్సిడెంట్‌లో మధ్యలోనే విషాదాంతమయ్యే పాత్ర కావడంతో ప్రేక్షకుల సానుభూతినీ పొందాడు.

పెళ్ళిచూపులు (2016)

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రం విజయ్‌కు కేవలం గుర్తింపు మాత్రమే తీసుకురాలేదు. దానితో పాటు హీరోకు కావాల్సిన లక్షణాలున్న నటుడిగానూ సినీ వర్గాల దృష్టిలో పడ్డాడు. అదిగో.. అలా వచ్చింది ‘పెళ్ళిచూపులు’ సినిమాలో హీరో ఛాన్స్. ఆ అవకాశాన్ని రెండు చేతులా ఆహ్వానించాడు. అలా అని ఏదో ఒక సినిమాతో హీరో కావడం అతడి ఉద్దేశం కాదు. షార్ట్ ఫిల్మ్ మేకర్ అయిన తరుణ్ భాస్కర్ చెప్పిన సబ్జెక్ట్, అందులోని ఫ్రెష్‌నెస్ బాగా నచ్చి హీరోగా తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జీవితంపై స్పష్టమైన అవగాహనలేని ప్రశాంత్ కేరక్టర్‌ను ఎంతో సునాయాసంగా చేసి, రాణించాడు. హీరోగా తొలి సినిమాతోటే పెద్ద హిట్ కొట్టడమే కాకుండా, విమర్శకుల్నీ మెప్పించాడు.

ద్వారక (2017)

‘పెళ్ళిచూపులు’లో బాధ్యతలేని యువకుడిగా కనిపించిన విజయ్ ‘ద్వారక’లో దొంగ నుంచి దొంగ స్వామిగా శ్రీనివాస్ అనే పాత్రను కన్విన్సింగ్‌గా చేశాడు. భక్తుల్ని హ్యాండిల్ చేసే సమయంలో అతడి హావభావాలు ఆకట్టుకుంటాయి. కథన లోపాలు, నిర్మాణ విలువల్లో నాణ్యత లోపించడం వల్ల ‘ద్వారక’ బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించలేకపోయింది. కానీ నటుడిగా విజయ్‌కు మంచి మార్కులు పడ్డాయి.

అర్జున్‌రెడ్డి (2017)

విజయ్‌ని రాత్రికి రాత్రి స్టార్‌ను చేసిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’. బోల్డ్ కాన్సెప్ట్, టైటిల్ రోల్‌లోని బోల్డ్‌నెస్, డైరెక్టర్ వంగా సందీప్‌రెడ్డి రూపొందించి విధానంతో ల్యాండ్ మార్క్ ఫిలింగా విశ్లేషకులు పేర్కొన్న ఈ సినిమాలో విజయ్ చెలరేగిపోయాడు. కసితో ఉన్న ఒక నటుడు తనను తాను ప్రూవ్ చేసుకోడానికి ఎలాంటి రోల్ కావాలో అలాంటి రోల్ చాల తక్కువ సమయంలోనే విజయ్‌కు లభించింది. చిన్న విషయానికి కూడా ఆవేశపడే మనస్తత్వం ఉన్న అర్జున్‌రెడ్డి అనే మెడికో క్యారెక్టర్ తన కోసమే ఎదురు చూస్తున్నంతగా ఆ పాత్రలో ఇమిడిపోయి చేశాడు విజయ్. ఫలితం అతడితో సహా ఎవరూ ఊహించని విజయం దక్కింది. విజయ్ పేరు, ‘అర్జున్‌రెడ్డి’ పాత్ర మారుమోగిపోయాయి. సంప్రదాయవాదులు ఎంత నెత్తీనోరూ బాదుకున్నా యువత ఆ సినిమానూ, విజయ్‌నూ ఆకాశానికెత్తేశారు. మిగతా యువహీరోలు అసూయ చెందే రీతిలో ఒక్కసారిగా స్టార్‌డం వచ్చింది విజయ్‌కు.

ఏ మంత్రం వేసావే (2018)

ప్రతి వ్యక్తికీ జీవితంలో ఎదురుదెబ్బలు తప్పవు. వాటిని కాచుకుంటూ వెళ్తేనే ఎదుగుదల. అలా వచ్చిన సినిమా ‘ఏ మంత్రం వేశావే’. అయినా ఇందులోనూ మునుపటి పాత్రలకు భిన్నమైన పాత్రనే చేశాడు విజయ్. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ వీడియో గేమ్స్ ఆడుకుంటూ, సోషల్ మీడియాలో గడుపుతుండే బాధ్యతారాహిత్య యువకుడిగా నటించాడు. ఈ సినిమాకున్న ఏకైక ప్లస్ పాయింట్ విజయ్. ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం తీసిన సినిమాలా అనిపించడం, డైరెక్టర్ టేకింగ్ బాగా లేకపోవడం వల్ల సినిమా ఆడలేదు.

మహానటి (2018)

‘మహానటి’ సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో ఒక ఫొటో జర్నలిస్టుగా స్పెషల్ అపీరెన్స్ ఇచ్చాడు విజయ్. సావిత్రి జీవితాన్ని శోధించే మధురవాణి అనే జర్నలిస్టుకు తోడుగా వెళ్లే విజయ్ ఆంటోనీ అనే ఫొటోగ్రాఫర్‌గా ఆకట్టుకున్నాడు.

గీత గోవిందం (2018)

‘అర్జున్‌రెడ్డి’తో యువతకు చేరువైన విజయ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ దగ్గర చేసిన సినిమా ‘గీత గోవిందం’. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మొదట ఒప్పుకోడానికి సందేహించాడు విజయ్. ఒక ఫ్యామిలీ రోల్‌లో తనను ప్రేక్షకులు ఆదరిస్తారా అనేదే ఆ సందేహానికి కారణం. చివరకు ఒప్పుకోవడంతో అతడి కెరీర్ దిశను మార్చేసే సినిమా వచ్చింది. విజయ్ గోవింద్ అనే కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేరక్టర్‌లో విజయ్ నటనను చూసినవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ‘అర్జున్‌రెడ్డి’గా ఒక ఫెరోషియస్ కేరక్టర్‌ను ఉన్నత స్థాయిలో పోషించిన అతడే, హీరోయిన్‌ను బతిమలాడుకొనే ఒక సాఫ్ట్ రోల్‌ను ఎంతో కన్విన్సింగ్‌గా చేసి శభాష్ అనిపించుకున్నాడు. అభిమానుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు.

నోటా (2018)

ఒక వర్థమాన కథానాయకుడికి అతి బరువైన పాత్ర వస్తే ఎలా డీల్ చేస్తాడు? ‘నోటా’లో వరుణ్ అనే ముఖ్యమంత్రి పాత్రను డీల్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు విజయ్. కానీ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల్ని మెప్పించాలంటే, స్క్రీన్‌ప్లే ఎంతో పకడ్బందీగా ఉండాలి. సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండాలి. అవి లోపించడం వల్లే ‘నోటా’ సినిమా ఫెయిలైంది. కానీ యంగ్ చీఫ్ మినిస్టర్‌గా విజయ్ నటనకు వంక పెట్టలేం.

టాక్సీవాలా (2018)

ఈ మధ్య కాలంలో ఒక పేరున్న హీరో సినిమాలు ఐదు విడుదల కావడం అరుదైన విషయం. ‘మహానటి’లో విజయ్‌ది స్పెషల్ అప్పీరెన్స్ అనుకున్నా హీరోగా నాలుగు సినిమాలు విడుదలవడం విశేషమే. విడుదలకు ముందే ‘టాక్సీవాలా’ సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం, విడుదలలో ఏకంగా ఐదు నెలలు జాప్యం కావడం వంటి కారణాలతో చాలామంది ఈ సినిమా విజయంపై నమ్మకం పెట్టుకోలేదు. కానీ వాళ్లందరి అంచనాల్ని తారుమారు చేస్తూ, పోటీలో ఉన్న రవితేజ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’ని పడగొట్టి విజేతగా నిలిచాడు ‘టాక్సీవాలా’. విజయ్ కరిష్మా ఏ స్థాయిలో ఉందో చూపిన సినిమా ఇది. సెమీ థ్రిల్లర్‌గా రూపొందిన ఇందులో శివ అనే టాక్సీ డ్రైవర్‌గా అలరించాడు విజయ్. అతడి డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ సినిమాకు జీవం పోశాయి. ఈ సినిమాతో విజయ్ సాధిస్తున్న విజయాలు గాలివాటువి కావని తేలిపోయింది. ఇప్పుడతడు ఒక స్టార్. సూపర్ స్టార్‌గా ఎదగడానికి అడుగులు వేస్తున్నవాడు. ఇప్పుడే అతడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇప్పటిలాగే భిన్న భిన్న కథలు, పాత్రల్ను ఎంచుకుంటూ వెళ్తే ఒకవైపు హీరోగా, మరోవైపు నటుడిగా విజయ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని పొందడం ఖాయం.

– బుద్ధి యజ్ఞమూర్తి

24 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *