2018 Tollywood Review: 5 Best Protagonists


2018 Tollywood Review: 5 Best Protagonists

2018 టాలీవుడ్ రివ్యూ: 5 మంది ఉత్తమ నాయకులు

విడుదలైన ప్రతి పెద్ద సినిమా మనల్ని అలరించదు. అలాగే ప్రతి చిన్న సినిమానూ తేలిగ్గా తీసిపారేయకూడదు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా కొన్ని సినిమాల్లోని సెంట్రల్ కేరక్టర్లు మనల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. కొన్ని కేరక్టర్లు ఐకనిక్‌గా మిగిలిపోతాయి. ప్రేక్షకులు వాటితో అమితంగా కనెక్టయిపోతారు. వాటితో సహానుభూతి చెందుతారు. అలా 2018 సంవత్సరానికి సంబంధించిన సినిమాల్లో 8 మంచి ఉత్తమ హీరోలు లేదా హీరోయిన్లు ఎవరో ఒక్కసారి అవలోకిద్దాం…

చిట్టిబాబు (రంగస్థలం – రాంచరణ్)

చెవిటివాడైన చిట్టిబాబు ఒక సగటు గ్రామీణ కుర్రాడు. ఊరి ప్రెసిడెంటు ఎన్ని అరాచకాలు చేస్తున్నా పట్టించుకోడు. కానీ అదే ప్రెసిడెంటుకు తన అన్న కుమారబాబు ఎదురెళ్లినప్పుడు అన్నకు మద్దతిస్తాడు. రంగమ్మత్త చెప్పిన నిజాలతో అన్నకు ఏమవుతుందోనని భయపడి ప్రెసిడెంటు దగ్గర డబ్బు తీసుకుంటాడు. అన్నను ప్రెసిడెంటు ఎన్నికల నుంచి తప్పుకునేలా చేయాలనుకుంటాడు.

అన్నతో పాటు కుటుంబమంతా అసహ్యించుకోవడంతో ప్రెసిడెంటు డబ్బు అతనికే ఇచ్చేసి, అన్నకు అండగా నిలుస్తాడు. ఆ అన్నకు ప్రాణాపాయం ఎదురైనప్పుడు ఒక తమ్ముడిగా రక్షించుకోవడానికి ఆఖరి నిమిషం దాకా ప్రయత్నించి విఫలమవుతాడు. ప్రళయకాల రుద్రుడిలా మారి ప్రెసిడెంటును చంపుతాడు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజకీయ నాయకుడు దక్షిణామూర్తిని కాపాడి, రెండేళ్లు సేవచేసి, అతను బాగయ్యాక చడీ చప్పుడు లేకుండా అతడ్నీ చంపేస్తాడు. చిట్టిబాబు పాత్ర గురించీ, ఆ పాత్ర చిత్రణ గురించీ ఎంతైనా చెప్పుకోవచ్చు. ఒక మామూలు కుర్రాడి నుంచి పగతో రగిలిపోయే వాడిగా ఆ పాత్ర పరిణామ క్రమం అబ్బురంగా అనిపిస్తుంది.

దర్శకుడు సుకుమార్ ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని అపురూపంగా తీర్చిదిద్దాడు. సాధారణంగా ఊళ్లల్లో ఎన్నో అరాచకాలు జరుగుతుంటాయి. సగటు మనుషులుగా మనం వాటిని విని అయ్యో అనుకొని వదిలేస్తాం. చిట్టిబాబు కూడా అదే తరహా మనిషే. తనేమిటో, తన గోలేమిటో తప్ప మిగతా విషయాలేమీ పట్టించుకోడు. అన్న కారణంగా మనిషిగా అతడిలో పరిణామం మొదలవుతుంది.

అన్నకు ఏమవుతుందోననే భయం నుంచి అతడిని కాపాడుకోవాలనే ఆరాటం కలుగుతుంది. అంతకు ముందు రామలక్ష్మిని చూసి ఇష్టపడి, ఆమెను భార్యగా ఫిక్సయిపోతాడు. ఆమెతో ఆడతాడు, పాడతాడు. రంగమ్మత్తతో కష్టసుఖాలు చెప్పుకుంటాడు. ఆమె కారణంగానే అతడి కళ్లు విచ్చుకుంటాయి, మనసు పరిపక్వత చెందుతుంది, కర్తవ్యం బోధపడుతుంది.

అలాంటి పాత్రకు రాంచరణ్ ఊహాతీతంగా న్యాయం చేశాడు. కెరీర్‌లోనే గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చి తన విమర్శకులకు సమాధానమిచ్చాడు. చిట్టిబాబు పాత్రను చాలా కాలం మన మన్సుల్లో గుర్తుండిపోయేలా చేశాడు. ఆ పాత్రను అలా మలచిన సుకుమార్, దాన్ని ఆ స్థాయిలో పోషించిన చరణ్.. ఇద్దరూ అభినందనీయులే.

2018 Tollywood Review: 5 Best Protagonists

సావిత్రి (మహానటి – కీర్తి సురేశ్)

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సావిత్రి స్థానం అమేయం. నటిగా ఆమెకున్న పేరు ప్రఖ్యాతులు, ఆదరాభిమానాలూ మరే తారకూ లేవు. సావిత్రి అంటే సావిత్రే. అలాంటి ఆమె జీవిత కథతో నాగ్ అశ్విన్ రూపొందించిన సినిమా ‘మహానటి’. ఈ టైటిల్ సావిత్రికి పర్యాయపదంగా మారిపోయింది. సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసులో అడుగుపెట్టి, జెమిని స్టూడియోలో మొదటగా పరిచయమైన గణేశన్‌తో స్నేహం చేశారు సావిత్రి.

కాలక్రమంలో అది ప్రేమగా మారి, అతనప్పటికే వివాహితుడని తెలిసినా అతడిని పెళ్లాడారు. నటిగా తారాపథానికి దూసుకుపోయి, మహానటిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. చంచల స్వభావుడైన గణేశన్ మరో తారతో సన్నిహితంగా ఉండటం చూసిన ఆమె గుండె పగిలింది. అప్పట్నుంచీ అతనికి దూరంగా జరిగి, మనసులోని వేదనను మర్చిపోవడానికి తాగుడుకు బానిస అయ్యింది. చివరకు అనారోగ్యంతో కన్నుమూసింది.

ఆ పాత్రను ఇంతకంటే బాగా ఎవరూ చూపించలేరనే స్థాయిలో ‘మహానటి’లో చూపించాడు నాగ్ అశ్విన్. ఏ కంటి నుంచి ఎన్ని నీటి బిందువులు రాలాలంటే అన్నే బిందువులు రాల్పగలిగే అత్యంత ప్రతిభావంతురాలైన ఆ మహానటి కేరక్టర్‌ను కొత్తగా ఇప్పుడిప్పుడే వస్తోన్న కీర్తి సురేశ్ అనూహ్య స్థాయిలో పోషించి శభాష్ అనిపించుకుంది. సావిత్రిగా కీర్తినా?.. అని నొసళ్లు చిట్లించినవాళ్లంతా కీర్తి అభినయం చూసి ఆశ్చర్యపోయారు.

మొదట్లో అమాయకురాలిగా, తర్వాత పరిణతి చెందిన తారగా, జీవితంలో దెబ్బతిన్న స్త్రీగా, చివరి రోజుల్లో తాగుడుకు బానిసైన వ్యసనపరురాలిగా కీర్తి నటనను ప్రశంసించకుండా ఉండలేం. ‘మహానటి’లో హీరో అయినా, హీరోయిన్ అయినా కీర్తే! 2018 గొప్ప నాయకా నాయిక పాత్రల్లో సావిత్రి పాత్ర ఉండి తీరుతుంది.

2018 Tollywood Review: 5 Best Protagonists

భరత్ (భరత్ అనే నేను – మహేశ్)

ముఖ్యమంత్రి అయిన తండ్రి చనిపోవడంతో విదేశాల నుంచి వచ్చిన భరత్, అనూహ్యంగా ముఖ్యమంత్రి గద్దెపై కూర్చోవాల్సి వచ్చాక, సమాజంలో మార్పు కోసం కృషి చేస్తాడు. అబివృద్ధి పనులెన్నో చేపడతాడు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య భావనను అమలు చేస్తాడు. గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తాడు.

ఈ మధ్యలో ఒక మామూలు పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ కూతురు వసుమతిని ప్రేమించి, ఆమెను అసిస్టెంటుగా నియమించుకుంటాడు. పార్టీ అధ్యక్షుడు వరదరాజు దుష్ట పన్నాగంలో పావుగా మారతాడు. వసుమతితో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడిగా దోషిలా నిలబడి, ముఖ్యమంత్రి కుర్చీలోంచి దిగిపోతాడు.

కుర్చీ ఎక్కిన వరదరాజు కుట్రతో పాటు తన తండ్రి చావుకు కూడా కారణం అతడే అని తెలుసుకుని, వరదరాజు ఆట కట్టిస్తాడు. తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తాడు. ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండాలనే దానికి ఉదాహరణగా భరత్ పాత్రను తీర్చిదిద్దాడు దర్శకుడు కొరటాల శివ. నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలనుకొనేవాడికి నీచ పనులకు అలవాటు పడినవాళ్లు ఎలా ఆటంకాలు, కష్టనష్టాలు కలిగిస్తారో ఆ పాత్ర ద్వారా చూపించాడు.

అలాంటి పాత్రను తనకు అలవాటైన రీతిలో సునాయాసంగా చేసుకుపోయాడు మహేశ్. బలమైన భరత్ పాత్రను అంతే బలమైన అభినయంతో నిలబెట్టాడు. ‘భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను..’ అంటూ ఆ పాత్ర పోషణలో తనదైన ముద్రను వేశాడు మహేశ్. ఒక ఐకనిక్ కేరక్టర్‌గా భరత్‌ను నిలిపాడు.

2018 Tollywood Review: 5 Best Protagonists

గోవింద్ (గీత గోవిందం – విజయ్ దేవరకొండ)

సంస్కారానికీ, సంప్రదాయాలకూ పెట్టింది పేరైన కుటుంబంలో పుట్టిన గోవింద్ ఒక గుడిలో గీతను తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. తన చెల్లెలి నిశ్చితార్థానికి బస్‌లో వెళ్తూ, అదే బస్‌లో తన పక్క సీట్లో కూర్చున్న గీతను చూసి ఆశ్చర్యపోతాడు. రాత్రివేళ ఆమె నిద్రపోతుండగా బస్ కుదుపుకు ఆమె పెదాలపై అతడి పెదాలు ఆనుతాయి.

ఆమె నుంచి చెంపదెబ్బ తింటాడు. అక్కడి నుంచి ఆమె దయా దాక్షిణ్యాలపై అతడి జీవితం ఆధారపడిపోతుంది. ఆమె వల్ల వేధింపులకు గురవుతాడు. ఆమె ఎట్లా ఆడమంటే అట్లా ఆడే స్థితి వస్తుంది. ఒకనాటికి ఆమెకు అతడేమిటో తెలిసి వస్తుంది. అతడికి మనసిస్తుంది. కానీ అప్పటికే ఆమె కారణంగా నానా అగచాట్లకూ గురైన అతడు గీత తాను అనుకున్నంత మంచి మనసున్న అమ్మాయి కాదని అనుకుంటాడు.

ఆమె నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. ఎట్టకేలకు గీత అతడిదవుతుంది. ఒక చిన్న పొరపాటు వల్ల గోవింద్ జీవితం ఎట్లా అతడి చేతుల్లోంచి గీత చేతుల్లోకి వెళ్లిందో, గోవింద్ ఎన్ని అగచాట్లు పడ్డాడో సహజంగా ‘గీత గోవిందం’లో చిత్రించాడు దర్శకుడు పరశురాం. పేరుకు రొమాంటిక్ కామెడీ అయినా రొమాన్స్ కంటే గోవింద్ పడే కష్టాలపైనే ప్రేక్షకుల దృష్టి పడింది.

ఆ పాత్రపై వాళ్లు సానుభూతి చూపించారు. ఆ పాత్రతో సహానుభూతి చెందారు. గోవింద్‌ను గీత ఆడుకుంటుంటే అయ్యో పాపం అనుకుంటాం. అలాంటి పాత్రను అత్యంత సహజంగా పోషించాడు విజయ్. తెరపై మనకు విజయ్ కనిపించడు, గోవింద్ తప్ప. గోవింద్‌లా విజయ్ నటించలేదు, కేవలం ప్రవర్తించాడు.

అందుకే ఒక మామూలు తెలుగింటి అబ్బాయిలా అందరి హృదయాల్నీ గెలిచాడు. హీరోయిజం లేకుండా ఒక పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అరుదు. ఆ అరుదైన ఫీట్‌ను విజయ్ సాధించాడు. అతడిని అలా మలచిన, అతడితో అలాంటి నటనను రాబట్టిన పరశురాంను మెచ్చుకోకుండా ఉండగలమా!

2018 Tollywood Review: 5 Best Protagonists

రుద్రరాజు సాగర్ (నీదీ నాదీ ఒకే కథ – శ్రీవిష్ణు)

చదువంటే గిట్టని, జీవితాన్ని సంతోషంగా గడిపెయ్యాలని భావించే కుర్రాడు సాగర్. చదువుకొని ప్రయోజకుడివి కావాలంటూ టీచర్ అయిన తన తండ్రి, ఈ సమాజం తనపై ఒత్తిడి చేస్తున్నారని బాధ పడుతుంటాడు. వరుసగా మూడు సార్లు పరీక్షల్లో ఫెయిలవుతాడు. తండ్రి దృష్టిలో అప్రయోజకుడిగా మిగులుతాడు. ఆఖరుకి వ్యక్తిత్వ వికాస నిపుణుడు కూడా సాగర్‌లో మార్పు తీసుకు రాలేకపోతాడు.

సమాజం తనపై పెట్టుకున్న అంచనాల్ని నెరవేర్చలేకపోతాడు సాగర్. ఏ డ్రైవర్ గానో, మెకానిక్ గానో సెటిలైపోదామనుకొనే మనస్తత్వం అతడిది. చదువంటే ఆపేక్షలేని, సృజనాత్మకంగా ఆలోచించలేని, జీవితాశయమంటూలేని, బతికినంత కాలం సరదాగా, హాయిగా గడిపెయ్యాలనుకొనే యువతకు ప్రతినిధిగా ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంలో దర్శనమిస్తాడు సాగర్.

తల్లిదండ్రుల ఆశలు ఎలా ఉన్నా, తాను తానుగానే ఉండాలని తపించే సగటు యువకుడి పాత్రను దర్శకుడు వేణు ఊడుగుల అత్యంత సహజంగా, అదే సమయంలో అత్యంత భావోద్వేగ పూరితంగా మన కళ్ల ముందు నిలిపాడు. సాగర్ పాత్రను శ్రీవిష్ణు అమోఘంగా పోషించాడు. ప్రయోజకుడివి కావాలంటూ అన్ని వేపుల నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోలేక సాగర్ పడే వేదనను ఉన్నత స్థాయిలో ప్రదర్శించాడు.

కొన్ని సందర్భాల్లో అతడి హావభావాలు, చెప్పే డైలాగులకు మనం కదిలిపోకుండా, కరిగిపోకుండా ఉండలేం. నేటి కాలంలో అనేక మంది యువకులు ఎదుర్కొంటున్న బర్నింగ్ ప్రాబ్లెంను సాగర్ పాత్ర ద్వారా ఎత్తి చూపాడు డైరెక్టర్ వేణు. 2018 తెలుగు సినిమాల్లో వచ్చిన పాత్రల్లో సాగర్ నిస్సందేహంగా ఒక ఉత్తమ పాత్ర.

– బుద్ధి యజ్ఞమూర్తి

29 డిసెంబర్ 2018