2018 Tollywood Review: 9 Actors Who Became Flop Stars


2018 Tollywood Review: 9 Actors Who Became Flop Stars

2018 టాలీవుడ్ రివ్యూ: 9 ఫ్లాప్ స్టార్స్

చిత్రసీమ కఠినమైంది. ఎంత త్వరగా అందలం ఎక్కిస్తుందో, అంత త్వరగా పాతాళానికీ తొక్కేస్తుంది. ప్రేక్షకుల ఆదరణతో స్టార్లుగా వెలిగినవాళ్లే, అదే ప్రేక్షకుల నిరాదరణతో సరైన అవకాశాలు పొందలేక కెరీర్‌లో వెనుకబడిపోతుంటారు. ఆ సంగతి అలా ఉంచితే, ఈ ఏడాది కొంతమంది స్టార్లు ప్రేక్షకుల్ని మెప్పించలేక ఫ్లాపుల్ని మూటగట్టుకున్నారు. పొలిటికల్ కెరీర్ కోసం సినీ కెరీర్‌కు కామా పెట్టిన పవర్‌స్టార్ డిజాస్టర్‌ను చవిచూస్తే, మాస్ మహారాజా అనిపించుకున్నాయన ఏకంగా ఫ్లాపుల్లో హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. మరికొంత మంది కూడా 2018లో ఫ్లాప్ స్టార్లు, డిజాస్టర్ స్టార్లుగా మిగిలారు. వాళ్లపై ఓ లుక్కేద్దాం.

పవన్ కల్యాణ్

2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్‌కు దాని సమీపంలోకి వచ్చిన హిట్టేమీ లేదు. ‘గోపాల గోపాల’లో స్పెషల్ క్యారెక్టర్ చేసిన ఆయన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. ఈ నేపథ్యంలో తనకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రంతో మరోసారి జట్టుకట్టి ‘అజ్ఞాతవాసి’ సినిమా చేశాడు పవన్. అంబరాన్ని చుంబించే అంచనాలతో విడుదలైన ఈ సినిమా, అంబరాన్ని కాదు కదా, నేలను దాటి ఒక్కంగుళం కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

ఒక విషాద ఘటన తాలూకు జ్ఞాపకాన్ని మోస్తూ, ఒక లక్ష్యంతో ఉండే సుబ్రహ్మణ్యం (పవన్ కల్యాణ్) శక్తిమంతమైన వ్యక్తిత్వంతో కనిపించాల్సింది పోయి, కామెడీలు చేస్తుంటే ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. ఫలితంగా ‘అజ్ఞాతవాసి’ని అజ్ఞాతంలోనే ఉండమని దీవించేశారు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో మట్టికొట్టుకుపోయిన డిస్ట్రిబ్యూటర్లను పవన్, త్రివిక్రం ఆదుకొనే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు పూర్తి కాలం కేటాయించే లక్ష్యంతో ఇక సినిమాల్లో నటించనని (కొంత కాలం పాటైనా) చెప్పిన పవన్, హిట్టుతో సినీ కెరీర్‌కు కామా పెడితే అదో తృప్తిగా ఉండేది.

2018 Tollywood Review: 9 Actors Who Became Flop Stars

అల్లు అర్జున్

2016లో ‘సరైనోడు’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ చేసిన అల్లు అర్జున్, గతేడాది నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాతోటే డైరెక్టర్‌గా మారాడు.

ఆవేశపరుడైన ఆర్మీ ఉద్యోగి సూర్యగా అర్జున్ ఆకట్టుకున్నా, కేవలం ఆ పాత్రమీదే దృష్టిపెట్టి మిగతా ప్రాత్రల్ని గాలికి ఒదిలేయడం, డైలాగ్స్‌పై పెట్టిన శ్రద్ధ టేకింగ్‌పై పెట్టకపోవడంతో సినిమా ప్రేక్షకుల్ని అసంతృప్తికి గురిచేసింది. అది బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్దేశించి, బయ్యర్లకు భారీ నష్టాల్ని మిగిల్చింది. కొన్నేళ్లుగా బయ్యర్ల బంగారు బాతుగుడ్డుగా ఉన్న బన్నీకి తగిలిన గట్టి దెబ్బ ‘నా పేరు సూర్య’.

2018 Tollywood Review: 9 Actors Who Became Flop Stars

నాగార్జున

2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ సినిమాలతో తనలో ప్రేక్షకుల్ని ఆకర్షించే సామర్థ్యం ఏమాత్రం తగ్గలేదనే ఫీలింగ్ కలిగించిన నాగార్జునకు.. ఆ తర్వాత అన్నీ ఎదురు దెబ్బలే తగులుతూ వస్తున్నాయి. 2017లో ‘ఓం నమో వెంకటేశాయ’ డిజాస్టర్ కాగా, ‘రాజుగారి గది 2’ ఆశించిన రీతిలో ఆడలేదు. ఇక 2018లో ఆయన రెండు సినిమాలు చేశాడు.

నానితో కలిసి ఆయన నటించిన ‘దేవదాస్’ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది కేవలం పాతిక కోట్లే కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం. దేవ అనే డాన్‌గా నాగార్జున ఆకట్టుకున్నా, దర్శకుడి ఫెయిల్యూర్ కారణంగా సన్నివేశాల్లో ఎక్కువ శాతం సహజంగా కాక బలవంతంగా చొప్పించినట్లు ఉండటం, మాఫియా నేపథ్యాన్ని కూడా అనవసరంగా హైలైట్ చేసినట్లుండటంతో సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు.

ఇక రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో నాగ్ చేసిన ‘ఆఫీసర్’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతంలో నాగ్ స్వయంగా ‘భాయ్’ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చారు. ఆ సినిమా ఎందుకు చేశానో తనకు ఇప్పటికీ అర్థం కావట్లేదనేవాళ్లు. అలాంటిది ‘ఆఫీసర్’ గురించి ఏమని చెబుతారో! ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసిందెంతో తెలుసా? అక్షరాలా ఒక కోటి రూపాయలు!

ఒక స్టార్ హీరోకి ఇదెంత అవమానకరమైన విషయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున కెరీర్ మొత్తమ్మీద అతిపెద్ద డిజాస్టర్‌గానే కాక, టాలీవుడ్ ఇండస్ట్రీలోని మిజరబుల్ డిజాస్టర్లలో చెడ్డ పేరు సంపాదించుకుంది ‘ఆఫీసర్’. ఈ బాధ నుంచి తేరుకోవడానికి ఆయనకు చాలా కాలం పట్టవచ్చు. ప్రస్తుతం ఆయన తెలుగులో కాకుండా మిగతా భాషల్లో నటిస్తుండటం గమనార్హం.

2018 Tollywood Review: 9 Actors Who Became Flop Stars

రవితేజ

2017లో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో హిట్ కొట్టి ఊపిరి పీల్చుకున్న రవితేజ ఆనందం 2018లో మొత్తం ఆవిరైపోయింది. ఇటీవలి కాలంలో స్టార్ హీరోల్లో ఒకే ఏడాది విడుదలైన మూడు సినిమాలూ ఫ్లాపైన అపవాదును మూటగట్టుకున్నాడు రవితేజ. ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి బయ్యర్లను నిండా ముంచేశాయి.

విక్రమ్ సరికొండ డైరెక్టర్‌గా పరిచయమవుతూ తీసిన ‘టచ్ చేసి చూడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్ల షేర్ కూడా సాధించలేక డిజాస్టర్‌గా నిలిచింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే రెండు వరుస హిట్లతో జోరు మీదున్న కల్యాణ్ కృష్ణతో ఎంతో నమ్మకంతో ‘నేల టిక్కెట్’ సినిమా చేసిన రవితేజకు షాక్ తగిలింది. ఇది కేవలం రూ. 22 కోట్ల లోపే షేర్ (ప్రపంచవ్యాప్తంగా) వసూలు చేసి, బయ్యర్లను ఉసూరుమనిపించింది.

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నా, తన సినిమా ‘నీ కోసం’తోటే డైరెక్టర్‌గా పరిచయమై, ఆ తర్వాత ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ సినిమాలతో తనకు హిట్లిచ్చిన శ్రీను వైట్ల మంచి కసి మీద ఉన్నాడనే భరోసాతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చేసి దెబ్బతిన్నాడు రవి. ఈ సినిమా ఎంత దెబ్బ కొట్టిందంటే ప్రపంచవ్యాప్తంగా రూ 7 కోట్లు కూడా వసూలు చెయ్యలేక, రవితేజ కెరీర్‌లోని అతిపెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. రవికి డిజాస్టర్ల హ్యాట్రిక్‌ను సంపూర్ణం చేసింది.

2018 Tollywood Review: 9 Actors Who Became Flop Stars

నాగచైతన్య

2017లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా విజయం సాధించిన ఆనందం నాగచైతన్యలో క్రమేణా ఆవిరవుతూ వచ్చింది. అదే ఏడాది వచ్చిన ‘యుద్ధం శరణం’ డిజాస్టర్ కాగా, 2018లో చేసిన సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఫ్లాపుల హ్యాట్రిక్ సాధించినట్లయింది. మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్‌గా పేరుపొందిన మారుతి డైరెక్షన్‌లో చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు చైతు. ఇందులో రమ్యకృష్ణ అల్లుడిగా కనిపించాడు. ప్రేక్షకుల ఆసక్తి కారణంగా వారాంతంలో మంచి కలెక్షన్లే వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వసూళ్ల తిరోగమనం మొదలైంది. కనీసం రూ. 6 కోట్ల మేర బయ్యర్లు నష్టపోయినట్లు సమాచారం.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ వంటి సంస్థ నిర్మాణంలో, ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ వంటి హిట్ సినిమాల డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో చైతు చేసిన ‘సవ్యసాచి’ మరింత ఘోరంగా ఆడింది. మాధవన్ తొలిసారి తెలుగులో నటించిన సినిమాగా ఎంత ప్రచారం చేసినా, కనీసం రూ. 10 కోట్లను కూడా వసూలు చేయలేక డిజాస్టర్ ముద్ర వేయించుకుంది. చైతును డిఫెన్స్‌లో పడేసింది.

నాని

వరుసగా 8 సినిమాలు విజయం సాధించడం అనేది ఏ హీరోకైనా డ్రీమ్ రన్ లాంటిదే. ఇటీవలి కాలంలో ఆ ఫీట్‌ను సాధించిన ఏకైక హీరో నాని. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ వరకు ఆ డ్రీమ్ రన్ కొనసాగడంతో నాని కెరీర్ చకచకా ఆకాశానికెగసింది. మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిన నాని సినిమాల కోసం బయ్యర్లు పోటీపడుతూ వచ్చారు. అయితే 2018 సంవత్సరం ఆ డ్రీమ్ రన్‌కు కుదుపు వచ్చింది. నాని చేసిన రెండు సినిమాలు బయ్యర్లకు నష్టాలు మిగిల్చాయి.

మొదట అతను మేర్లపాక మురళి డైరెక్షన్‌లో చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ ప్రేక్షకులకు రుచించలేదు. రెండు బిన్న మనస్తత్వాలు కలిగిన రెండు పాత్రల్లో స్క్రీన్ మొత్తం అతడే కనిపించినా వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్ల షేర్ దాటలేదు. ఇక నాగార్జునతో కలిసి నటించిన ‘దేవదాస్’ కూడా ఫ్లాపై నానికి నిరాశ కలిగించింది. ఇందులో దాస్ అనే డాక్టర్‌గా కనిపించిన నాని క్యారెక్టరైజేషన్‌ను ప్రేక్షకులు మెచ్చలేదు. ఫలితంగా 2018 సంవత్సరం అతడికి చేదు జ్ఞాపకంగా మారింది.

2018 Tollywood Review: 9 Actors Who Became Flop Stars

కల్యాణ్‌రామ్

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేసిన ‘పటాస్’ (2015) సినిమా హిట్టవడంతో కల్యాణ్‌రామ్ ఆనందానికి అవధులు లేవు. అతడికి విజయం లభించి ఎన్నేళ్లయిందో! అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత అతడు నటించిన ‘షేర్’, ‘ఇజం’ సినిమాలు ఫెయిలయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం కూడా ‘ఇజం’ను గట్టెక్కించలేదు.

ఈ నేపథ్యంలో 2018లో రెండు సినిమాలు చేశాడు కల్యాణ్‌రామ్. ఉపేంద్ర మాధవ్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ చేసిన ‘ఎంఎల్ఏ’లోని మంచిని ప్రేక్షకులు గ్రహించలేదు. ‘లక్ష్మీ కల్యాణం’ వచ్చిన పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో జంటగా నటించాడు. అయినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత ‘మిల్కీ బ్యూటీ’గా పేరుపొందిన తమన్నాతో తొలిసారి చేసిన ‘నా నువ్వే’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కేవలం రూ. 1.5 కోట్ల షేర్ మాత్రమే సాధించిందంటే కల్యాణ్, తమన్నా జోడీని ఏ స్థాయిలో జనం నిరాకరించారో అర్థం చేసుకోవాల్సిందే.

సాయిధరమ్ తేజ్

వరుసగా మూడు సినిమాలు ఫెయిలయ్యాయంటే ఏ హీరోకైనా మార్కెట్ డౌన్ అవుతుంది. అలాంటిది వరుసగా ఆరు సినిమాలు ఫెయిలైతే? అలాంటి విపత్కర స్థితిని ఎదుర్కొంటున్నాడు సాయిధరమ్ తేజ్. నటనలో ఈజ్ ఉందనిపించుకున్న అతనికి 2016లో వచ్చిన ‘సుప్రీం’ తర్వాత మళ్లీ విజయం దక్కలేదు. ‘తిక్క’, ‘విన్నర్’, ‘నక్షత్రం’, ‘జవాన్’ సినిమాలు వరుసగా విఫలమయ్యాయి.

ఈ పరిస్థితుల్లో 2018లో చేసిన రెండు సినిమాలూ తేజ్‌ను బాధపెట్టాయి. వాటిలో ఒకటి వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో చేసిన ‘ఇంటిలిజెంట్’. ప్రేక్షకులు ఇంటలిజెంట్స్‌గా వ్యవహరించి ఈ సినిమాను అట్టర్‌ఫ్లాప్ చేశారు. తర్వాత లవ్ స్టోరీలు తీయడంలో ఎక్స్‌పర్ట్ అని పేరున్న ఎ. కరుణాకరన్ డైరెక్షన్‌లో ‘తేజ్.. ఐ లవ్ యు’ అనే సినిమా చేస్తే ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఫలితం డిజాస్టర్. ఇక అతడి ఆశలన్నీ కిశోర్ తిరుమల తీస్తున్న ‘చిత్రలహరి’ మీదే ఉన్నాయి.

2018 Tollywood Review: 9 Actors Who Became Flop Stars

రాజ్ తరుణ్

తొలి మూడు చిత్రాలు – ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ హిట్టవడంతో హీరోగా రాజ్ తరుణ్ క్రేజ్ యూత్‌లో దూసుకుపోయింది. ఆ తర్వాత ‘ఈడో రకం ఆడో రకం’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలతో ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత నుంచే అతనికి కాలం కలిసి రావట్లేదు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ తర్వాత చేసిన ‘అందగాడు’ సినిమా సూపర్ ఫ్లాపయింది.

2018లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘రంగుల రాట్నం’ ఫ్లాపవగా, ‘రాజుగాడు’, ‘లవర్’ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఒకే రకమైన పాత్రలు, నటన, డైలాగ్ డిక్షన్‌తో ప్రేక్షకులను ఇంకేమాత్రమూ ఆకర్షించలేననే విషయం అతను గ్రహించాల్సి ఉంది. కథలపై, క్యారెక్టరైజేషన్స్‌పై దృష్టి పెడితేనే అతని కెరీర్ మళ్లీ గాడినపడే అవకాశం ఉంది.

– బుద్ధి యజ్ఞమూర్తి

6 డిసెంబర్, 2018