7 Actors Who Perfectly Played Both Heroes And Villains


7 Actors Who Perfectly Played Both Heroes And Villains actioncutok.com

అతడే హీరో.. అతడే విలన్!

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ షేడ్‌లో ఉంటుందని వినిపిస్తోంది. జూనియర్‌కు విలన్ పాత్ర కొత్త కాదు. ఇప్పటికే ‘జై లవకుశ’లో విలన్‌గా మెప్పించాడు కూడా.

ఒకప్పుడు హీరోలుగా రాణించినవాళ్లు విలన్ పాత్రల్లో కనిపించడానికి వెనుకంజ వేసేవాళ్లు. ప్రేక్షకులు, ప్రధానంగా తమ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే అనుమానం వాళ్లను పీడించేది. ఉదాహరణకు తెలుగువాళ్ల అందాల నటుడిగా పేరుపొందిన శోభన్‌బాబు విషయమే చూసుకుందాం. ‘మహా సంగ్రామం’ సినిమాలో కృష్ణతో పాటు ఆయన కూడా హీరోనే. కానీ పాత్ర ప్రకారం తన జోడీ అయిన జయసుధను మోసంచేసి, పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి చిత్రహింసల పాలు చెయ్యడం ఆయన అభిమానులకు ఏమాత్రం రుచించలేదు.

దానిపై ఆయనను విమర్శిస్తూ, ఆ పాత్రను ఎందుకు చేశారంటూ ఆయనకే నేరుగా ఉత్తరాలు రాశారు, వాటిలో ఆయనను దుమ్మెత్తిపోశారు. దాంతో ఇక ఆ తరహా పాత్రలు, మల్టీస్టారర్ సినిమాలు చెయ్యనని ఆయన ప్రకటించాల్సి వచ్చింది. ఆ సినిమా తర్వాత తెలుగులో చాలా కాలం దాకా స్టార్ హీరోలు కలిసి నటించడానికి జంకారు. తమ హీరోల పాత్రల నిడివి ఎంత ఉంది, పాత్రల తీరు ఎలా ఉంది, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.. వంటి అంశాల్ని అభిమానులు బేరీజు వెయ్యడం, తమ హీరోకు ఏమాత్రం ప్రాధాన్యం తక్కువైనా అల్లరి చెయ్యడం వంటి పనుల వల్ల స్టార్లు కూడా మల్టీస్టారర్లకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వచ్చాయి. నటులు కూడా భిన్న, విలక్షణ పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఒకప్పుడు హీరోలుగా రాణించినవాళ్లే కాక, ప్రస్తుత స్టార్ హీరోలు కూడా నెగటివ్ రోల్స్ చెయ్యడానికి ముందుకొస్తున్నారు. దీంతో ప్రేక్షకుల ముందు ఆ నటులు కొత్తగా ఆవిష్కృతమవుతున్నారు. తమ హీరోలను విలన్లుగా చూడ్డానికి ప్రేక్షకులూ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ షేడ్‌లో ఉంటుందని వినిపిస్తోంది. జూనియర్‌కు విలన్ పాత్ర కొత్త కాదు. ఇప్పటికే ‘జై లవకుశ’లో విలన్‌గా మెప్పించాడు కూడా.

కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి హీరోలుగా రాణించడానికి ముందు విలన్ పాత్రల్లో మెప్పించారు. తర్వాత హీరోలుగా మారి స్టార్లు అయ్యారు. తర్వాత కాలంలో అలా విలన్ నుంచి హీరోలైనవాళ్లు, హీరోల నుంచి విలన్లుగా మారినవాళ్ల గురించి మాట్లాడుకుందాం…

7 Actors Who Perfectly Played Both Heroes And Villains actioncutok.com

శ్రీకాంత్

రామోజీరావు నిర్మించిన ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’ సినిమాలో నక్సలైట్ లీడర్‌గా నటించడం ద్వారా పరిచయమైన శ్రీకాంత్ మొదట హీరోగానే చేద్దామనుకున్నాడు. అయితే రెండో సినిమా ‘మధురా నగరిలో’ చేశాక, హీరో పాత్రలివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ సలహాతో ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమాతో విలన్‌గా మారాడు. అది అతడికి గుర్తింపు తెచ్చింది. వరుసగా 13 సినిమాల్లో నెగటివ్ రోల్స్ పోషించాడు.

ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ సినిమా ‘ఒన్ బై టు’ సినిమాతో మళ్లీ హీరో అయ్యాడు. హీరోగా 90 సినిమాలకు పైగా నటించాడు. రాఘవేంద్రరావు రూపొందించిన ‘పెళ్లిసందడి’ సినిమా శ్రీకాంత్ ఇమేజ్‌ను ఎన్నో రెట్లు పెంచింది. అతడి కెరీర్‌లో మైలురాయిలా నిలిచింది. కృష్ణవంశీ రూపొందించిన ‘మహాత్మ’ చిత్రంతో వంద సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు ఒక వైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. ఇటీవలే నాగచైతన్య హీరోగా చేసిన ‘యుద్ధం శరణం’ సినిమాలో గ్యాంగ్‌స్టర్ రోల్‌లో విలన్‌గా రాణించాడు. స్టైలిష్ యాక్టింగ్‌తో తనలో విలన్ ఉన్నాడని మరోసారి చూపించాడు. రాబోయే రోజుల్లో శ్రీకాంత్ నుంచి మరిన్ని విలన్ రోల్ మనం ఆశించవచ్చు.

జె.డి. చక్రవర్తి

రాంగోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమై సంచలనం సృష్టించిన ‘శివ’తోటే జె.డి. ఆనే పాత్రతో సైడు విలన్‌గా పరిచయమైన చక్రవర్తి, కొన్ని సినిమాల్లో అదే తరహా పాత్రలు చేశాక ‘ఒన్ బై టు’, ‘మనీ’ చిత్రాలతో హీరోగా మారాడు. కృష్ణవంశీ రూపొందించిన ‘గులాబి’ సినిమా హీరోగా అతడికి క్రేజ్ తెచ్చింది. ‘బొంబాయి ప్రియుడు’, ‘సత్య’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత సన్నిహితమయ్యాడు. తర్వాత హీరోగా క్రమేణా డిమాండ్ కోల్పోతూ రావడంతో తనే డైరెక్ట్ చేసిన ‘హోమం’ సినిమాతో తిరిగి విలన్‌గా మారాడు. ‘జోష్’, ‘డైనమైట్’ వంటి సినిమాల్లో విలన్‌గా రాణించాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విలన్‌గా నటిస్తూ మెప్పిస్తున్నాడు.

7 Actors Who Perfectly Played Both Heroes And Villains actioncutok.com

గోపీచంద్

ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. కానీ అది ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడంతో వెంటనే హీరో అవకాశాలు రాలేదు. ఆ పరిస్థితుల్లో డైరెక్టర్ తేజ ‘జయం’ సినిమాలో ఆఫర్ చేసిన విలన్ పాత్రకు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకారం తెలిపాడు. ఆ నిర్ణయం అతడి కెరీర్ దిశను మార్చింది. సినిమా మొత్తమ్మీద నటనాపరంగా అతడికే అందరికంటే ఎక్కువ మార్కులు పడ్డాయి.

అదే సినిమా తమిళ వెర్షన్‌లోనూ ఆ పాత్ర గోపీనే వరించింది. ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లోనూ విలన్‌గా అనూహ్య రీతిలో రాణించిన గోపీ కెరీర్ ‘యజ్ఞం’ సినిమాతో తిరిగి హీరోగా టర్న్ తీసుకుంది. ఆ సినిమా సాధించిన విజయంతో అతడికి వరుసగా హీరో పాత్రలొచ్చాయి. ‘రణం’, ‘లక్ష్యం’, ‘సాహసం’, ‘లౌక్యం’ వంటి హిట్ సినిమాలతో తనకంటూ మార్కెట్ సృష్టించుకున్న గోపి ఈమధ్యే సంపత్ నంది రూపొందించిన ‘గౌతం నందా’ చిత్రంలో ఇటు హీరోగా, అటు విలన్‌గా ఒకేసారి రెండు పాత్రల్నీ పోషించి, మెప్పించాడు. తనలో విలన్ మెటీరియల్ అలాగే ఉందని నిరూపించుకున్నాడు.

జగపతిబాబు

హీరో నుంచి విలన్‌గా మారిన నటుడు జగపతిబాబు. సుప్రసిద్ధ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడిగా 1989లో ‘సింహస్వప్నం’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయన 2013 వరకు అంటే 24 సంవత్సరాలపాటు కథానాయకుడిగా, అతికొద్ది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్ట్సిటుగా నటించాడు. హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని చూరగొన్నాడు. రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘గాయం’ చిత్రంతో యాక్షన్ హీరోగానూ మెప్పించాడు. ‘శుభలగ్నం’, ‘ఆయనకి ఇద్దరు’, ‘మావిచిగురు’, ‘శుభాకాంక్షలు’, ‘పెదబాబు’ వంటి సినిమాలతో ఫ్యామిలీ సినిమాల కథానాయకుడిగా రాణించారు.

కృష్ణవంశీ రూపొందించిన ‘అంతఃపురం’ ఆయనలోని మరో డైమెన్షన్‌నూ చూపించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో స్పెషల్ క్యారెక్టర్లు చేశారు. అయితే బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ‘లెజెండ్’ సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆయన విలన్‌గా చేయడం ఏమిటి? ప్రేక్షకులు హర్షిస్తారా?.. అని చాలామంది సందేహించారు. సినిమా విడుదల తర్వాత వారి అనుమానాలు పటాపంచలయ్యాయి. అతి క్రూరుడైన విలన్ పాత్రలో గొప్పగా రాణించి ఆకట్టుకున్నారు. అప్పటిదాకా తనను అభిమానించినవాళ్లనే తన నటనతో భయపెట్టేశారు. అప్పటి నుంచీ ఆయన కెరీర్ కీలక మలుపు తిరిగింది.

ఎక్కువగా బాలీవుడ్ లేదా ఇతర భాషా నటులనే విలన్ పాత్రలు వరిస్తూ వస్తుండగా, అచ్చ తెలుగు విలన్‌గా జగపతిబాబు తనదైన ముద్రవేసి, విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఆయనకు హీరోగా లేని డిమాండ్ విలన్‌గా రావడం చిత్రమే! లేటెస్టుగా త్రివిక్రం చిత్రం ‘అరవింద సమేత’లో కరుడుగట్టిన రాయలసీమ ఫ్యాక్షనిస్టు బసిరెడ్డి పాత్రలో ఎంతగా భయపెట్టాడో!

7 Actors Who Perfectly Played Both Heroes And Villains actioncutok.com

అర్జున్

పేరుకు కన్నడ నటుడైనా ఆ భాషలో కంటే తెలుగు, తమిళ భాషల్లోనే ఎక్కువ పాపులర్ అయిన నటుడు అర్జున్. కోడి రామకృష్ణ 1985లో రూపొందించిన ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఆ సినిమాతోటే అందర్నీ ఆకట్టుకున్న అర్జున్, తర్వాత ‘మన్నెంలో మొనగాడు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘పుట్టింటికిరా చెల్లీ’ సినిమాలతో మరింత దగ్గరయ్యాడు.

అలాగే శంకర్ తమిళంలో రూపొందించగా తెలుగులో విడుదలైన ‘జెంటిల్‌మన్’, ‘ఒకే ఒక్కడు’ సినిమాలు అర్జున్‌కు మరింత క్రేజ్ తెచ్చాయి. 2010లో వచ్చిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాతో తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన అయన నితిన్ హీరోగా నటించిన ‘లై’ (2017) సినిమాలో తొలిసారి విలన్‌గా కనిపించి మెప్పించాడు. అలాగే ఇటీవలే తమిళం నుంచి తెలుగులో డబ్ అయిన విశాల్ సినిమా ‘అభిమన్యుడు’లోనూ ప్రతినాయకుడిగా గొప్పగా రాణించాడు.

అడివి శేష్

ఏక కాలంలో హీరోగా, విలన్‌గా రాణిస్తున్న నటుడు అడివి శేష్. 2010లో ‘కర్మ’ చిత్రంతో హీరోగా, దర్శకుడిగా పరిచయమైన శేష్ ఆ వెంటనే పవన్ కల్యాణ్ ‘పంజా’, రవితేజ ‘బలుపు’ చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేసి మెప్పించాడు. రాజమౌళి కీర్తి ప్రతిష్ఠల్ని ఖండాంతరాలు దాటించిన ‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవ కొడుకు భద్ర పాత్రలో క్రూరత్వాన్ని బాగా పండించాడనే పేరు తెచ్చుకున్నాడు.

దాని తర్వాత ‘క్షణం’, ‘అమీ తుమీ’, ‘గూఢచారి’ చిత్రాల్లో హీరోగా నటించి విజయాలు సాధించాడు. సినిమా మేకింగ్, టెక్నిక్ తెలిసిన మనిషిగా భిన్న పాత్రలను పోషిస్తూ ముందుకు వెళ్తున్నాడు. తెలుగులో గూఢచారి పాత్రలకు కృష్ణ పెట్టింది పేరు. ఆ స్థాయిలో మళ్లీ ఎవరూ విజయాలు సాధించలేదు. మహేశ్ సైతం ‘స్పైడర్’తో హిట్ కొట్టలేకపోయాడు. ఆ నేపథ్యంలో ‘గూఢచారి’ సినిమాతో అందర్నీ తనవైపుకు తిప్పుకున్న శేష్, ఆ సినిమాను తన అభిమాన నటుడు కృష్ణకు అంకితమిచ్చాడు కూడా.

7 Actors Who Perfectly Played Both Heroes And Villains actioncutok.com

జూనియర్ ఎన్టీఆర్

బాలలతో గుణశేఖర్ రూపొందించిన పౌరాణిక చిత్రం ‘రామాయణం’లో రాముడిగా నటించి ‘ఔరా’ అనిపించిన జూనియర్ ఎన్టీఆర్ 2001లో ‘నిన్ను చూడాలని’ అనే ఫ్లాప్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే రాజమౌళి డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1’గా ఆకట్టుకున్నాడు. అప్పట్నుంచీ వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘ఆది’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘అదుర్స్’, ‘బృందావనం’, ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గారేజ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడిగా రూపుదాల్చాడు.

అవన్నీ ఒకెత్తు అయితే, ‘జై లవకుశ’ సినిమా ఒక్కటీ ఒకెత్తు. ఎందుకంటే కె.ఎస్. రవీంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తొలిసారి విలన్‌గా నటించాడు. ఊహాతీతంగా ఆ పాత్రలో రాణించాడు. స్టార్ హీరోగా రాణిస్తున్న ఒక నటుడు విలన్ పాత్ర చెయ్యడం తెలుగులో మనం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. జగపతిబాబు, అర్జున్, అరవింద్ స్వామి వంటి వాళ్లు చేస్తున్నారంటే.. వాళ్లిప్పుడు స్టార్ హీరోలు కాదు. అయినా ధైర్యం చేసి, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం లేకుండా, ప్రయోగం చేసి సక్సెసయ్యాడు ఎన్టీఆర్.

ఆ వెంటనే త్రివిక్రం సినిమా ‘అరవింద సమేత.. వీరరాఘవ’లో హీరోగా తన స్టార్ స్టేటస్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి సినిమా చేస్తుండటంతో తెలుగు ప్రేక్షకులంతా అత్యంతాసక్తితో ఆ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. స్టార్‌డం కలిగిన ఇద్దరు యువ హీరోలు కలిసి నటించడం తెలుగులో ఇదే తొలిసారి. ఇదివరకు యంగ్, సీనియర్ స్టార్లు కలిసి నటించారు కానీ, సమాన ఇమేజ్ కలిగిన ఇద్దరు స్టార్లు నటిస్తున్నది ఇప్పుడే. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయనే ప్రచారం నడుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

– బుద్ధి యజ్ఞమూర్తి

5 డిసెంబర్ 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *