7 Movie Sequels You Didn’t Know About


7 Movie Sequels You Didn't Know About

మనం మర్చిపోయిన 7 సీక్వెల్స్

సాధారణంగా సీక్వెల్స్ వస్తున్నాయంటే వాటిపై అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకులు వాటి కోసం ఒరిజినల్ కంటే మరింత ఆసక్తిగా ఎదురు చూస్తారు. విడుదలకు ముందు మీడియా కూడా వాటికి ఎక్కువ కవరేజ్ ఇస్తుంది. విమర్శకులు, విశ్లేషకులు తమ కలాలకు పదును పెడుతుంటారు.

అసలు సీక్వెల్ ఎందుకు వస్తుంది? ఒరిజినల్ సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకొని, బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించినప్పుడు. అయితే తెలుగులో ఒరిజినల్ సినిమా ఆశించినంత ఆడకపోయినా సీక్వెల్స్ వచ్చిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు ‘బ్రోకర్ 2’, ‘ఐస్ క్రీం 2’. మొదటి సినిమా కంటే సీక్వెల్‌తో ఎలాగైనా విజయం సాధించగలమనే నమ్మకం వాటిని రూపొందించేలా చేసిందనుకోవాలి.

భారీ, క్రేజీ సినిమాల సీక్వెల్సే బోల్తా కొట్టిన అనుభవాల మధ్య చిన్న సినిమాల సీక్వెల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయా? ఆకట్టుకోలేదని పలు సినిమాలు రుజువు చేశాయి. అవి ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు పోయాయో కూడా ప్రేక్షకులకు గుర్తు లేవు.

ఐతే 2.0 (2018)

చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడిగా పరిచయమైన ‘ఐతే’ సినిమా ఎంత ఉత్కంఠభరితంగా పరుగులెత్తి ఆకట్టుకుందో తెలిసిందే. మూస ధోరణిలో పోకుండా ఒక కొత్త సినిమా చూసిన అనుభవాన్ని కలిగించాడు ఏలేటి. ఆ సినిమాకు సీక్వెల్‌గా రాజ్ ముదిరాజు ‘ఐతే 2.0’ సినిమాని రూపొందించాడు. సైబర్ క్రైమ్స్‌కు పాల్పడుతున్న ఒక క్రిమినల్‌ను నలుగురు నిరుద్యోగ యువకులు ఎలా కనిపెట్టారనేది ఈ సినిమా ఇతివృత్తం.

కానీ కథనంలో పస లేకపోవడం, సన్నివేశాల్ని ఆసక్తికరంగా మలచలేకపోవడం వల్ల ఈ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. సైబర్ నేరగాడిగా పేరుపొందిన బెంగాలీ నటుడు ఇంద్రనీల్‌సేన్ గుప్తా ఎంత బాగా నటించినా ఉపయోగం లేకపోయింది. 2018లోనే ఈ సినిమా వచ్చినా చాలా మందికి అలాంటి సినిమా వచ్చినట్లే తెలీదు.

7 Movie Sequels You Didn't Know About

మంత్ర 2 (2015)

ఛార్మి టైటిల్ పాత్రధారిగా ఓషో తులసీరాం డైరెక్ట్ చేసిన ‘మంత్ర’ ఉత్కంఠభరిత కథనంతో ఆకట్టుకొని హారర్ సినిమాల్లో ఒక ట్రెండ్‌ను సృష్టించింది. అందులోని ‘మహా.. మహా..’ సాంగ్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఆ సినిమాతో ఛార్మికి వచ్చిన పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని ఆమెతోనే యస్వీ సతీశ్ అనే దర్శకుడు ‘మంత్ర 2’ను ప్లాన్ చేశాడు.

ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన మంత్ర (ఛార్మి) అక్కడ ఒక వృద్ధ జంట ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉండగా, గుర్తు తెలీని వ్యక్తులు ఆమెని చంపడానికి ప్రయత్నించడం, పోలీసాఫీసర్ అయిన ఆమె స్నేహితుడు (చేతన్ శీను) ఇన్వెస్టిగేషన్ చేపట్టడం, అప్పుడు షాక్‌కు గురిచేసే నిజాలు బయటపడ్డం ఈ సినిమా ఇతివృత్తం. ఒరిజినల్‌కు వచ్చిన పేరును ఈ సినిమా చెడగొట్టింది.

కథనంలో అడుగడుగునా లోపాలు, ఏమాత్రం ఉత్కంఠభరితంగా లేని సన్నివేశాలు, తర్వాత వచ్చే సన్నివేశాన్ని ముందే ఊహించగలగడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫలితం డిజాస్టర్. జనం మర్చిపోయిన ఈ సినిమా ఛార్మి కెరీర్‌లోనూ ఒక మచ్చగా మిగిలింది.

7 Movie Sequels You Didn't Know About

యమలీల 2 (2014)

కమెడియన్ అలీని హీరోని చేసి యస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘యమలీల’ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. అది బ్లాక్‌బస్టర్ కావడంతో కొన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్ ప్లాన్ చేశారు కృష్ణారెడ్డి. సతీశ్ అనే రియల్ ఎస్టేట్ బిజినెస్‌మేన్‌ను హీరోని చేసి ‘యమలీల 2’ను తీశారు.

భూలోకాన్ని సందర్శించడానికి వచ్చిన యమధర్మరాజు (మోహన్‌బాబు), చిత్రగుప్తుడు (బ్రహ్మానందం) తమ దగ్గర ఉండే భవిష్యవాణిని పోగుట్టుకుంటే, అది క్రిష్ (సతీశ్) అనే డాక్టర్ చేతుల్లో పడి, తన భవిష్యత్తును అందులో చూసిన అతడు ఏం చేశాడనేది ఈ సినిమా కథ.

అనేక మలుపులతో కథ పక్కదారి పట్టడం, కథను నడిపించిన విధానం విసుగెత్తించడం, పాటల ప్లేస్‌మెంట్స్ సరిగాలేక చికాకు కలిగించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కృష్ణారెడ్డి కెరీర్‌ను క్రాస్‌రోడ్స్‌లో నిలబెట్టింది. ఈ సినిమాతో హీరోగా తెలుగు చిత్రసీమలో కొనసాగాలనుకున్న సతీశ్ మళ్లీ ఈవైపు చూడలేదు.

7 Movie Sequels You Didn't Know About

బ్రోకర్ 2 (2014)

ఆర్పీ పట్నాయక్ టైటిల్ రోల్ చేస్తూ రూపొందించిన ‘బ్రోకర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపయింది. అయినప్పటికీ దానికి సీక్వెల్ తియ్యాలని ఆ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు మద్దినేని రమేశ్ సంకల్పించారు. పోసాని కృష్ణమురళి టైటిల్ పాత్రధారిగా తన దర్శకత్వంలోనే నిర్మించారు.

దేవుడు (పోసాని) అనే బ్రోకర్, సుభాష చంద్రబోస్ (బెనర్జీ) ముఖ్యమంత్రి కావడానికి తోడ్పడతాడు. నలుగురు దుండగుల చేతుల్లో అత్యాచారానికి గురైన కస్తూరి (స్నేహ) దేవుడికి సన్నిహితమవుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకొనేంతలో కస్తూరి ఖరీదైన వేశ్యగా మారాల్సి వస్తుంది. దానికి కారణమేంటి? దేవుడు ఏం చేశాడనేది ఈ చిత్ర కథాంశం.

అత్యాచారాలు, భూ ఆక్రమణలు, లంచగొండితనం వంటి సామాజిక రుగ్మతలను చర్చించే సదుద్దేశంతో దర్శకుడు ఈ సినిమా తీసినప్పటికీ, మోతాదు మించిన భావోద్రేకాలతో నిండిన సన్నివేశాలు ప్రేక్షకులకి అతి అనిపించాయి. కథనం కూడా సక్రమంగా లేకపోవడంతో ఒరిజినల్‌ను మించి ఈ సినిమా ఫ్లాపయింది. ‘బ్రోకర్ 2’ అనే సినిమా వచ్చి వెళ్లిన సంగతే ఇప్పుడు చాలామందికి జ్ఞాపకం లేదు.

7 Movie Sequels You Didn't Know About

ఆపరేషన్ దుర్యోధన 2 (2013)

శ్రీకాంత్ ప్రధాన పాత్రధారిగా పోసాని కృష్ణమురళి డైరెక్ట్ చేసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రం ఊహించని విజయం సాధించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావు రూపొందించిన చిత్రం ‘ఆపరేషన్ దుర్యోధన 2’. నిజానికి ఒరిజినల్‌కూ, దీనికీ టైటిల్ విషయంలో మినహా వేరే సంబంధం ఉండదు.

నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రి ప్రతాపరెడ్డి (ఏరాసు ప్రతాపరెడ్డి)ని కుర్చీలోంచి దించి తాను ముఖ్యమంత్రి కావాలని హోం మంత్రి వెంకటాద్రి (కోట శ్రీనివాసరావు) పన్నిన పన్నాగంలో పోలీసులకు పట్టుబడ్డ రూ. 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రివనే ఆరోపణలు వస్తాయి. సీబీఐ ఆఫీసర్ అశోక్ (జగపతిబాబు) రంగంలోకి దిగి ఒక హవాలా ఏజెంట్‌కు సన్నిహితుడైన కృష్ణ (పోసాని కృష్ణమురళి)ను పట్టుకొని కూపీ లాగి, నిజాన్ని బయటపెట్టడం ఈ సినిమా ఇతివృత్తం.

అప్పటి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డికి సపోర్ట్‌గా తీసిన ఈ సినిమా నాసిరకం కథనం, బి గ్రేడ్ తరహా సన్నివేశాల వల్ల ఘోరంగా ఫ్లాపై, జనం మనసుల్లో లేకుండా పోయింది.

7 Movie Sequels You Didn't Know About

అరవింద్ 2 (2013)

రాజీవ్ కనకాల, రిషి ప్రధాన పాత్రధారులుగా శేఖర్ సూరి రూపొందించిన ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త హారర్ మూవీ అనుభవాన్నిచ్చి మంచి విజయం సాధించింది. అదిచ్చిన ప్రేరణతో చాలా కాలం తర్వాత శేఖర్ సూరి దానికి సీక్వెల్ తీశాడు.

షూటింగ్ నిమిత్తం హీరో (కమల్ కామరాజు), సెకండ్ హీరో (శ్రీ), హీరోయిన్ (అడోనిక), డైరెక్టర్ (శ్రీనివాస్ అవసరాల)తో కూడిన ఒక సినిమా యూనిట్ దండేలి అడవులకు వెళ్లి ఒక గెస్ట్ హౌస్‌లో దిగుతుంది. యూనిట్‌లోని మిగతా బృందం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఒక సైకోపాత్ దృష్టిలో పడతారు. తన దారికి అడ్డొచ్చేవాళ్లను చంపడమే పనిగా పెట్టుకొన్న అతని వల్ల ప్రమాదంలో పడిన యూనిట్ సభ్యులు ఏమయ్యారు? సెకండ్ హీరోగా యూనిట్‌తో పాటు వచ్చిన శ్రీ అసలు ఉద్దేశమేమిటి? అనేది ఈ సినిమా ఇతివృత్తం.

ఒరిజినల్ భయపెడుతూనే ఎంతగా ఆకట్టుకుందో, ఈ సీక్వెల్ వీక్షణం అంత భయంకరంగా ఉంటుంది. చెత్త స్క్రీన్‌ప్లే కారణంగా ప్రతి సన్నివేశం చికాకు పుట్టిస్తూ కుర్చీల్లో కూర్చున్నంత సేపూ ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు సరైన తీర్పునిచ్చారు. తమ మనసుల్లోంచి దీన్ని చెరిపేశారు.

7 Movie Sequels You Didn't Know About

వెన్నెల 1 1/2 (2012)

రాజా, పార్వతీ మెల్టన్ జంటగా నటించగా, దేవా కట్టా దర్శకుడిగా పరిచయమైన ‘వెన్నెల’ యువతను బాగా ఆకట్టుకుంది. అమెరికాలో నివసించే ఎన్నారై యువత ఆశలు, ప్రేమలను దేవా ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సెల్యులాయిడ్‌పై మలిచాడు. ఆ సినిమాతోటే పరిచయమై, దాని పేరుతోనే పాపులర్ అయ్యాడు వెన్నెల కిశోర్. అందుకే దానికి సీక్వెల్ తియ్యాలన్న ప్రేరణ కలిగి, తనే డైరెక్టర్‌గా మారి ‘వెన్నెల 1 1/2’ అనే చిత్రమైన పేరుతో సినిమా రూపొందించాడు.

కృష్ణ కృష్ణ అలియాస్ కేకే (చైతన్య) అనే సంపన్న యువకుడు బ్యాంకాక్‌లో ఉంటూ, ప్రేమికుల్ని విడగొట్టడమే ధ్యేయంగా ఉంటాడు. అలాగే వెన్నెల (మోనాల్ గుజ్జార్), శ్రావణ్ (శ్రావణ్)ను విడదీయడానికి అతడేం చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడనేది ఈ సినిమా కథాంశం. కేకే, వెన్నెల పాత్రలు మినహాయిస్తే మిగతా పాత్రల్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల కథలో ఆసక్తి సన్నగిల్లిపోయింది.

బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, గిరి వంటి కమెడియన్లు ఉన్నా వాళ్ల హాస్యం పండలేదు. కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌తో కథను నడపాలనుకున్న దర్శకుడు కిశోర్ తనే కన్ఫ్యూజన్‌లో పడి తప్పుల మీద తప్పులు చేస్తూ పోవడంతో సినిమా నిరాసక్తంగా మారి జనానికి తలనొప్పి తెచ్చింది. ఫలితం అట్టర్‌ఫ్లాప్.

  • కార్తికేయ బుద్ధి
    18 డిసెంబర్ 2018