December 21st Fight: Antariksham Vs Padi Padi Leche Manasu


December 21st Fight: Antariksham Vs Padi Padi Leche Manasu

అంతరిక్షం వర్సెస్ పడి పడి లేచే మనసు

రెండు భిన్న జోనర్లకు చెందిన రెండు సినిమాలు డిసెంబర్ 21న బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం ప్రేక్షకులతో పాటు బిజినెస్ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకటి వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి రూపొందించిన స్పేస్ ఫిల్మ్ ‘అంతరిక్షం’ కాగా, మరొకటి శర్వానంద్, సాయిపల్లవి జోడీగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన ప్రేమ కథాచిత్రం ‘పడి పడి లేచే మనసు’. ఒకటి అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు సినిమా కీర్తిని పెంచే సినిమా అయితే, మరొకటి ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే రొమాంటిక్ ఎంటర్‌టైనర్.

అంతరిక్షం

లావణ్యా త్రిపాఠి, అదితిరావ్ హైదరి నాయికలుగా నటించిన ‘అంతరిక్షం’ చిత్రం  తెలుగులో తొలి, దేశంలో రెండో అంతరిక్ష నేపథ్య చిత్రంగా రికార్డు పుటల్లో చోటు సంపాదించుకుంటోంది (తొలి భారతీయ స్పేస్ ఫిల్మ్ తమిళంలో వచ్చిన ‘టిక్ టిక్ టిక్’). ఇదివరకు మనదేశపు తొలి జలాంతర్గామి నేపథ్య చిత్రం ‘ఘాజీ’తో అందరి దృష్టినీ తనవేపుకు తిప్పుకున్న సకల్ప్‌రెడ్డి  రూపొందించడంతో ఈ సినిమా కూడా చరిత్ర సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు నమ్ముతున్నారు.

ఈ సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయని ఆ మధ్య విడుదల చేసిన టీజర్ చూస్తేనే తెలిసిపోతోంది. ఒక అంతరిక్ష కార్యం నిమిత్తం నలుగురు భారతీయ వ్యోమగాములు చేసే అంతరిక్ష యాత్ర, ఆ సందర్భంగా వాళ్లు ఎదుర్కొనే ఒక అనూహ్యమైన అనుభవం చుట్టూ కథ నడుస్తుంది. టీజర్‌లో “దీన్ని ఇండియా వదులుకోదు” అనే వరుణ్ డైలాగ్ ఆసక్తిని మరింత పెంచుతోంది. నవంబర్ 30న విడుదల చేసిన ‘సమయమా..’ అనే మెలోడీ సాంగ్ విన్న తర్వాత ‘అంతరిక్షం’పై మరింత నమ్మకం కలుగుతోంది. క్రేజీ డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం.

Sai Pallavi and Sharwanand

పడి పడి లేచే మనసు

‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ప్రియమైన తారగా మారిన సాయిపల్లవి ఈ సినిమాలో శర్వానంద్ సరసన కనిపించనుండటం ఆసక్తిని కలిగిస్తోంది. శర్వానంద్ అంటేనే భిన్నమైన సబ్జెక్టులు ఎంచుకుంటాడని పేరు. ‘పడి పడి లేచే మనసు’కు సంబంధించి ఇంకో ఇంట్రెస్ట్ పాయింట్ హను రాఘవపూడి డైరెక్షన్. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ వంటి సినిమాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాదు హను. ఇప్పటికే ఈ సినిమా డిజిట‌ల్, శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ క‌లిపి 12 కోట్ల‌కు అమ్ముడుపోయాయని నిర్మాతలు తెలిపారు.

కోల్‌కతా నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో సాయిపల్లవి, శర్వానంద్ జోడీ ఎలా ఉంటుందోననే ఆసక్తి వ్యక్తమవుతోంది ప్రేక్షకుల్లో. ఇద్దరూ కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తాయనేది యూనిట్ సభ్యుల మాట.

ఇలా ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేని రెండు భిన్న తరహా సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందోగానీ, ప్రేక్షకులకు మాత్రం భిన్న రుచుల్ని ఆస్వాదించే అవకాశం లభిస్తున్నట్లే లెక్క.

– కార్తికేయ

1 డిసెంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *