ETv Life: For Better Life-Style

ETv Life: For Better Life-Style

ఈటీవీ లైఫ్: జీవన శైలిని మెరుగుపరిచే చానల్

నేటి ఆధునిక యుగంలో ప్రజల జీవన విధానం ఇంతకు ముందు కంటే మరింత మెరుగుపడుతోందని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యంపై ప్రజలు అధిక శ్రద్ధ చూపిస్తున్నారు. బిజీ లైఫ్ కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. అంతే కాకుండా ఇవాళ మనం తీసుకుంటున్న ఆహారం రసాయనాల మయం.

ఫాస్ట్ ఫుడ్ మొదలుకొని పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు.. ఒకటేమిటి, ప్రతిదీ మనకు ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యాన్ని ఇస్తున్నాయి. అందువల్ల మనం ఏం తినాలో, ఏం తినకూడదోననే అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నాం. ఈ మధ్య కాలంలో టీవీ చానళ్లలో వీటి గురించిన ప్రాచుర్యం పెరిగింది. ఆరోగ్యకర జీవితానికి సంబంధించిన ప్రోగ్రామ్స్‌తో కొన్ని జాతీన చానళ్లు నడుస్తున్నాయి.

అదే కోవలో తెలుగులో వస్తున్న చానల్ ఈటీవీ లైఫ్. ఇందులో సైకాలజీకి సంబంధించిన ‘మానస’ అనే ప్రోగ్రాం మొదలుకొని ‘యోగా క్లాస్’, ‘గెట్ సెట్ ఫిట్’ వంటివి ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటున్నాయి. మన ఆలోచనా విధానాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలో వంటి విధానాలతో పాటు యోగాని ఇంట్లోనే సులభంగా ప్రాక్టీస్ చేసుకొనే విధంగా ఈ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉంటున్నాయి.

చిరుధాన్యాల వల్ల మన ఆరోగ్యం ఎలా మెరుగవుతుందో తెలియజేస్తూ, వాటితో ఎంతో రుచికరమైన వంటలను తయారుచేసి చూపిస్తూ ‘అమృతం.. చిరుధాన్యాలు’ ప్రోగ్రాం ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. అలాగే మరో ప్రోగ్రాంలో వివిధ ఆహార పదార్థాల్లోని పోషక విలువలను తెలియజేస్తూ సులువుగా తయారు చేసుకొనే రెండు రకాల వంటలను చూపిస్తూ, మధ్య మధ్యలో ఆరోగ్యానికి సంబంధించి వీక్షకుల వ్యక్తంచేసే సందేహాల్ని నివృత్తి చేస్తూ న్యూట్రిషియన్లు చక్కని సలహాలు ఇస్తున్నారు.

చిన్న పిల్లలకు, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వాటిని నివారణోపాయాలను ప్రత్యేకంగా ఇస్తున్నారు. ‘ఆరోగ్యమస్తు’ మన జీవనశైలికి సంబంధించిన ఎంతో ఉపయోగకరమైన అంశాలు, ఎలాంటి సమస్యలకు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఎల్నాటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయాలను తెలియజేస్తుంది.

‘అంతరంగం’ అనే కార్యక్రమంలో ప్రవర్తనా పరమైన సమస్యలకు పరిష్కారాల్ని తెలియజేస్తున్నారు. ఈ చానల్ వల్ల గృహిణులకు చాలా మేలు కలుగుతోందనేది నిజం. వాళ్ల కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం చేసే ప్రయత్నంలో ఈటీవీ లైఫ్ ఎంతో సాయపడుతోందని చెప్పాలి. కొన్ని పనికిమాలిన సీరియళ్లను వీక్షించే కన్నా మన జీవితానికీ, ఆరోగ్యానికీ పనికొచ్చే ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడ్డం మేలు.