F2 Teaser Reactions: Cheerful And Genial


F2 Teaser Reactions: Cheerful And Genial

ఎఫ్2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టీజర్: హాస్యభరితం, ఉల్లాసభరితం

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటిస్తున్న ‘ఎఫ్2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమా టీజర్ విడుదలైన 17 గంటల్లో 3 మిలియన్ల వ్యూస్ సాధించింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వెంకీ జోడీగా తమన్నా, వరుణ్‌కు జతగా మెహరీన్ నటిస్తున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా హాస్యంతో అలరిస్తుందని టీజర్ ప్రామిస్ చేస్తోంది. 81 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ చూస్తుంటే వెంకటేశ్, వరుణ్ ఇద్దరివీ హాస్యాన్ని పండించే పాత్రలుగానే కనిపిస్తున్నాయి. వెంకటేశ్ ఆంధ్రా ప్రాంతం వాడనీ, వరుణ్ తెలంగాణా యువకుడనీ తెలుస్తోంది.

ఎవరో ఆఫీసర్ ముందు కుర్చీల్లో కూర్చొని, “ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు.. (ఏడుపు ముఖంతో) పెళ్లికి తర్వాత సార్” అని చెబుతాడు వెంకటేశ్. అతడి పక్కనే కూర్చున్న వరుణ్ “ఒక చరిత్ర చెప్పాల్నంటే తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక” అని ఆవేశభరితంగా చెబ్తే, వెంకీ “భయ్యా.. ఆ టాపిక్ ఇప్పుడెందుకు భయ్యా” అని కంగారుపడతాడు.

పెళ్లాన్ని కంట్రోల్ చెయ్యడం తెలుసు

ఇంకో సీన్లో రఘుబాబు “ఇప్పుడు పెళ్లవసరమా వెంకీ” అనడిగితే, “నేను మీలాగ్గాదు. పెళ్లాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు” అంటాడు వెంకటేశ్. ఆ వెంటనే చూపించే సీన్లో దేని విషయమో గొడవ జరిగితే, వెంకీపై తమన్నా అప్పడాల కర్ర విసిరేస్తుంది. ఇది వెంకీ, తమన్నాల పెళ్లాయ్యక వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశమా లేక, వెంకీ కలలో వచ్చే సన్నివేశమా?.. అనేది చూడాలి.

వరుణ్‌తో వెంకీ “ఇంకొక్కసారి ఆలోచించు బ్రో.. పెళ్లవసరమా?” అంటే, “నేన్నీలెక్క కాదు. పెండ్లాన్ని కంట్రోల్ జేసుడు నాకు మస్తు తెల్సు” అంటాడు వరుణ్. ఆ మాటకి వెంకీ సంబరపడినట్లు కనిపిస్తాడు.

ఆ తర్వాత వరుణ్‌ని మెహరీన్ దేని కోసమో సాధిస్తే, అది చెప్పుకొని వరుణ్ ఏడుస్తుంటే వెంకీ ఓదార్చడం కనిపిస్తుంది. అంటే అప్పటికే వెంకీకి పెళ్లవుతుందనీ, వరుణ్ కూడా పెళ్లి చేసుకుంటాడనీ ఊహించవచ్చు.

వెంకీ ఆసన్

‘వెంకీ ఆసన్’ అనే డిఫరెంట్ యోగాసనాన్ని ప్రాక్టీస్ చేస్తూ వెంకీ కనిపిస్తాడు. ఈ ఆసనాలు నవ్వు తెప్పించడం గ్యారంటీ. టీజర్ చివరన నేపథ్యంలో ఎవరో “పండక్కి బాగా నవ్వించేటట్లున్నారుగా?” అని ప్రశ్నిస్తే, వెంకీ, వరుణ్ ఇద్దరూ ఒకేసారి తలాడిస్తూ “అంతేగా.. అంతేగా” అంటారు.

మొత్తంగా చూస్తే సినిమా కథ పెళ్లి చుట్టూ నడుస్తుందనీ, పెళ్లికి ముందు హీరోలిద్దరు మంచి హాస్యాన్ని పండిస్తారనీ, పెళ్లి చేసుకున్నాక ఆ ఇద్దరూ అనుభవించే ఫ్రస్ట్రేషన్ నుంచి ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ లభిస్తుందనీ అర్థమవుతోంది.

హాస్యాన్ని కురిపించడం వెంకటేశ్‌కు నల్లేరు మీద బండి నడక. మరి వరుణ్ తొలిసారి హాస్యభరిత పాత్రతో ఎలా మెప్పిస్తాడో చూడాలి. అలాగే వెంకీ, తమన్నా మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండనున్నదనేదీ ఆసక్తి కలిగిస్తోంది.

ఒక విషయం మాత్రం స్పష్టం, సంక్రాతి అల్లుళ్లు విజయం మీద గట్టిగానే గురిపెట్టారు. బడ్జెట్ పరంగా, క్రేజీ పరంగా హెచ్చు స్థాయిలో ఉన్న మరో రెండు సినిమాలతో ‘ఎఫ్2’ బలంగా పోటీపడనున్నది.

  • సంజయ్
    13 డిసెంబర్ 2018