NTR – Kathanayakudu: Balakrishna Will Be A Sankranthi Star Again?


NTR - Kathanayakudu: Balakrishna Will Be A Sankranthi Star Again?

బాలకృష్ణ మళ్లీ సంక్రాంతి స్టార్‌గా నిలుస్తాడా?

సంక్రాంతి పండగంటే సినిమాకూ పెద్ద పండగే. ఏ పండగ సీజన్‌కూ లేని విధంగా సంక్రాంతి సీజన్‌లో తమ సినిమాల్ని విడుదల చేయడానికి అందరూ ఉవ్విళ్లూరుతుంటారు. సాధారణంగా పెద్ద సినిమాలు ఈ సీజన్‌లో వస్తుంటాయి కాబట్టి చిన్న సినిమాలు పోటీలో లేకుండా తప్పుకుంటాయి. కారణం వాటికి థియేటర్లూ దొరకవు, ఒకవేళ దొరికినా పెద్ద సినిమాల మధ్యలో వాటిని పట్టించుకొనేవాళ్లూ ఉండరు.

ఇలాంటి స్థితిలోనే 2019 సంక్రాంతికీ మూడు పెద్ద సినిమాలు – ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్2’ విడుదలవుతున్నాయి. మూడింటిలోనూ ముందుగా జనవరి 9న ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ వస్తోంది. ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన కథతో వస్తున్న ఈ సినిమాతో సంక్రాంతి హీరోగా మరోసారి తనను తాను నిరూపించుకోడానికి బాలకృష్ణ ఉవ్విళ్లూరుతున్నారు.

గడచిన మూడు సంక్రాంతి సీజన్‌లకూ ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాటిలో ‘డిక్టేటర్’ ఫ్లాప్ కాగా, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మంచి విజయం సాధించడమే కాకుండా బాలకృష్ణకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. 2018 సంక్రాంతికి వచ్చిన ‘జై సింహా’ సైతం గుంటూరు, కృష్ణా ఏరియాల్లో మినహా మిగతా అన్ని చోట్లా బయ్యర్లకు లాభాలు తెచ్చింది. గతంలో బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమాలు వచ్చింది సంక్రాంతికే.

ఈ నేపథ్యంలో మరోసారి ఆ తరహా రికార్డుల్ని సాధించాలని బాలకృష్ణ కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్టీఆర్ అంటే ప్రేక్షకుల్లో ఉన్న అమేయమైన ఇమేజ్ వల్ల, ఆయన కథతో రూపొందిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు నటుడిగా తనకూ గొప్ప పేరు తెస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు.

తనను ఇదివరకు ‘శాతకర్ణి’గా చూపించిన క్రిష్‌పై భారాన్ని మోపి ఈ సినిమా చేశారు. క్రిష్ సైతం ఆ భారాన్ని ఇష్టంగా మోసి, ఎన్టీఆర్‌లా బాలకృష్ణను తెరపైకి అనువదించారని అంటున్నారు. చూద్దాం.. ‘యన్.టి.ఆర్’గా బాలకృష్ణ ఏ స్థాయిలో మెప్పిస్తారో?