Old Is Gold: Pellinati Pramanalu


Old Is Gold: Pellinati Pramanalu

అలనాటి ఆణిముత్యం: పెళ్లినాటి ప్రమాణాలు

అక్కినేని నాగేశ్వరరావు, జమున జంటగా నటించిన ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రం విడుదలై 2018 డిసెంబర్ 17 నాటికి సరిగ్గా 60 యేళ్లు. అంటే ఇదే తేదీన 1958లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అందరి ఆదరాభిమానాల్ని చూరగొన్నది.

పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా కృష్ణారావు (అక్కినేని) భార్య రుక్మిణి (జమున)ని నిర్లక్ష్యం చేసి, తన సెక్రెటరీ అయిన రాధ (రాజసులోచన)పై వ్యామోహపడి, ఆమెకు సన్నిహితుడైతే, తన సమీప బంధువుల సాయంతో రుక్మిణి తన భర్తలో ఎలా మార్పు తీసుకొచ్చిందనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. హాస్య, శృంగార రస మేళవింపుతో ఈ చిత్రాన్ని దర్శకుడు కె.వి. రెడ్డి ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు.

‘చల్లగ చూడాలి..’, ‘రావే ముద్దుల రాధా..’, ‘ఏదో తెలియక పిలిచితినోయి..’ పాటలు ఆ రోజుల్లో బాగా పాపులర్ అయ్యాయి. ఘంటసాల స్వరాలు కూర్చగా పింగళి నాగేంద్రరావు పాటలు రాశారు. సినిమాలోని సంభాషణలను రాసిందీ ఆయనే. ఘంటసాల, పి. లీల, పి. సుశీల, జిక్కి పాడిన పాటలకు పసుమర్తి కృష్ణమూర్తి నృత్యాలు సమకూర్చారు.

ఎస్వీ రంగారావు, ఆర్. నాగేశ్వరరావు, రమణారెడ్డి, డాక్టర్ శివరామ కృష్ణయ్య, పేకేటి శివరాం, అల్లు రామలింగయ్య, సురభి కమలాబాయి, ఛాయాదేవి వంటి ఉద్ధండులు నటించిన ఈ సినిమా తెలుగులో ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి నుంచి రజత పతకాన్ని అందుకుంది కూడా. జయంతి పిక్చర్స్ పతాకంపై దిగ్దర్శకుడు కె.వి. రెడ్డి రూపొందించి నిర్మించిన ఈ చిత్రానికి తోట వెంకటేశ్వరావు కళా దర్శకుడు.