Padi Padi Leche Manasu Trailer Decoded: 2 Characters Analysed And Explored


Padi Padi Leche Manasu Trailer Decoded: 2 Characters Analysed And Explored

పడి పడి లేచే మనసు ట్రైలర్: రెండు పాత్రల పరిచయం

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ వచ్చి 21 గంటలైంది. 2 మిలియన్ల వ్యూస్‌కు చేరువవుతోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానున్నది. శర్వానంద్, సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ ఊహించిన దానికంటే బాగున్నదని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

వాళ్లిద్దరి మధ్య చూపించిన కొన్ని మూమెంట్స్, భావోద్వేగాలు ఒక మంచి లవ్ స్టోరీతో పాటు ఎంటర్‌టైనర్‌ను కూడా మనం చూడబోతున్నామనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
ట్రైలర్ ఆరంభంలో శర్వానంద్ పాత్ర తనను తాను పరిచయం చేసుకుంటూ “నా పేరు సూర్య. పేరులో ఉన్న వెలుగు జీవితంలో మిస్సయి సంవత్సరమవుతోంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బతికున్నానంటే కారణం వైశాలి” అని చెబుతుంది.

ఏడాది పాటు చీకట్లో ఉన్నానని సూర్య చెప్పినదాన్ని బట్టి అంత కాలం అతడేదో పెద్ద సమస్యలో ఉన్నాడని అర్థమవుతోంది. ఆ తర్వాతే అతడికి వైశాలి (సాయిపల్లవి) పరిచయమవుతుందన్న మాట.
ట్రైలర్ చివర్లో రోడుపై వైశాలి కారులో వెళ్తుంటే, పక్కనే బైక్‌పై వెళ్తూ సూర్య (శర్వానంద్) “హలో మేడం.. పడ్రేమోనని టెన్షన్ పడకండి. పడేసే బాధ్యత నాది” అని రయ్యిన ముందుకు వెళ్లిపోతాడు. అంటే మనోడు ఆమె ప్రేమలో పడ్డాడన్న మాట.

Padi Padi Leche Manasu Trailer Decoded: 2 Characters Analysed And Explored

ఓసారి వెన్నెల కిశోర్ “తొందరగా వెళ్తే బెటరేమో.. లేకపోతే ఏ ఎదవో తగులుకుంటాడు” అంటే, సూర్య “మనకంటే పెద్దెదవెవడూ లేడు ఈ కోల్‌కతాలో” అని జవాబిస్తాడు. అతడి మాటల ప్రకారం చూస్తే, సూర్య ఆవారాగా తిరిగేవాడేమోననే అభిప్రాయం కలుగుతుంది. మరో వైపు వైశాలి జనంతో సంబంధం ఉన్న ఉద్యోగమేదో చేస్తున్నట్లు అనిపిస్తుంది.

మొత్తానికి ఆ ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడుతుంది. అతడి కథేదో ఆమెకు తెలిసింది. అప్పుడు వైశాలి “వెంటపడ్డం వరకూ ఓకే. కాదంటే పిచ్చివాడవడం కొంచెం ఓవర్‌గా లేదూ!” అంటుంది. అంటే సూర్య అప్పటికే భగ్న ప్రేమికుడని అనుకోవాలి. “నిన్నిలాగే వొదిలేస్తే నువెలా బతుకుతావో, ఏంటో!” అని వైశాలి అనడం వల్ల అతడిపై ఆమెకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందని అర్థమవుతుంది.

మిగతా కథల్లాగే వాళ్ల కథ ప్రేమకు చేరుతుంది. ఇద్దరూ గాఢ ప్రేమలో మునుగుతారు. కానీ దేని వల్లో ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు వస్తాయి. “కానీ నిన్నర్థం చేసుకోవడం నావల్లవ్వట్లా” అని వైశాలి అంటే, సూర్య “నీకెలా చెబితే అర్థమవుతుంది?” అని విసురుగా అంటాడు. ఆ ఇద్దరి మధ్యా జరిగిన వాగ్యుద్ధం కలతలకు దారి తీస్తుంది.

వైశాలి తన ఇంట్లో “ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడ్డం కూడా కరెక్ట్ కాదేమో.. సూర్య అనేవాడు ఇంక నా జీవితంలో లేను గాక లేడు” అని ఎవరితోనో చెబుతుంది. అంటే అప్పటికి ఇద్దరూ దాదాపు విడిపోయే స్థితిలో ఉన్నారని అనుకోవచ్చు.

వైశాలికి ఫోన్ చేసిన సూర్య “ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్?” అనడిగితే, వైశాలి “నువ్వంటే నాకస్సలస్సలిష్టం లేదు. ఇంతలా విసిగించాలా? ఇంకెప్పుడూ ఫోన్ చెయ్యకు” అని అరిచినట్లే చెబుతుంది. ఆ తర్వాత ఏమయ్యిందో మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ట్రైలర్ మొత్తం సూర్య, వైశాలి కేరక్టర్ల మీదే ఫోకస్ చేసింది. ఆ రెండు పాత్రల్ని మనకు సూక్ష్మంగా పరిచయం చేసినా, కథ ఎలా ఉండబోతుందనే విషయాన్ని కొద్దిగానైనా మనకు అవగాహన కల్పించింది. అయితే సునీల్ పాత్రని కానీ, ప్రియా రామన్ పాత్రని కానీ ఈ ట్రైలర్‌లో మనకు చూపించలేదు దర్శకుడు.

హాస్యనటులు ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌ను మాత్రమే చూపించాడు. ఏదేమైనా ఆసక్తికరమైన సూర్య, వైశాలి ప్రేమకథను మనం చూడబోతున్నామనే నమ్మకాన్ని కలిగించింది ఈ ట్రైలర్.

  • కార్తికేయ బుద్ధి
    15 డిసెంబర్ 2018