Peta: A Threat To The Sankranti Telugu Movies?

పేట: సంక్రాంతి తెలుగు చిత్రాలకు దెబ్బ?
రజనీకాంత్ ‘పేట’ చిత్రం జనవరి 10న వస్తుండటంతో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే మూడు భారీ, క్రేజీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు – ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్2’ – సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్నాయి.
‘యన్.టి.ఆర్’ 9న, ‘వినయ విధేయ రామ’ 11న రిలీజవుతుండగా, ఆ రెండింటి మధ్యలో ‘పేట’ వస్తోంది. అన్నింటి కంటే చివరగా ‘ఎఫ్2’ 12న విడుదల అవుతోంది. తెలుగు ప్రేక్షకుల్లో రజనీకాంత్ కు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. చాలామంది పేరున్న తెలుగు హీరోలకు మించి ఆయనకు ఫాలోయింగ్ ఉంది.
అందుకే పొంగల్ కానుకగా తమిళంలో జనవరి 10న ఒరిజినల్ ను తీసుకొస్తున్న నిర్మాతలు, తెలుగు వెర్షన్ నూ అదే రోజు తేవాలని నిర్ణయించారు. అయితే ‘పేట’కు ఏ స్థాయిలో థియేటర్లు లభ్యం అవుతాయనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తొలిరోజు పోటీ లేనందున ‘యన్.టి.ఆర్’కు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం.
మిగతా మూడు చిత్రాలకు ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రావు. ‘యన్.టి.ఆర్’, ‘పేట’ చిత్రాల వల్ల ‘వినయ విధేయ రామ’ ఓపెనింగ్స్ కు దెబ్బ తగలనుంది. అది ఏ లెవల్లో ఉంటుందో వాటికొచ్చే మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది. ఇక ‘ఎఫ్2’ ఓపెనింగ్స్ మరింత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మూడు సినిమాలను తట్టుకొని అది నిలబడాలి. చూద్దాం.. ‘పేట’ ప్రభావం ఎలా ఉంటుందో!