Saaho: Release Date Revealed


Saaho: Release Date Revealed
Prabhaas in Saaho

సాహో: విడుదల తేదీ సస్పెన్స్ వీడింది

‘బాహుబలి’ సినిమాల తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘సాహో’ సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 2019 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో తయారవుతోంది.

ఇటీవలే ‘2.0’ సినిమాకి స్టంట్స్ సమకూర్చిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ ‘సాహో’లోని యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందిస్తున్నాడు. ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘ట్రాన్స్‌ఫార్మర్స్’, ‘పెరల్ హార్బర్’ వంటి హాలీవుడ్ యాక్షన్ మూవీస్‌కు స్టంట్స్ సమకూర్చింది ఆయనే కావడం గమనార్హం. ఆయనే కాదు, ‘సాహో’కు పనిచేస్తున్న సాంకేతిక నిపుణులంతా పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్లే.

శంకర్-ఎహ్‌సాన్-లాయ్ సంగీతాన్నీ, మదీ సినిమాటోగ్రఫీనీ, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్‌నూ, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్‌నూ అందిస్తున్నారు. తారాగణం విషయానికి వస్తే జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి, చంకీ పాండే, మహేశ్ మంజ్రేకర్, మురళీశర్మ, అరుణ్ విజయ్ వంటివాళ్లు నటిస్తున్నారు.

‘బాహుబలి’ తర్వాత తెలుగులో అత్యంత ఖరీదైన సినిమాగా తయారవుతున్న ఈ సినిమాని చూడాలంటే వచ్చే ఏడాది ఆగస్ట్ 15 వరకు ఎదురు చూడాల్సి రావడమే అభిమానులకు కష్టమైన విషయం. అంబరాన్ని అంటుతున్న అంచనాలను మోస్తున్న ‘సాహో’ ఏ రీతిలో అలరిస్తుందో వేచి చూడాలి.