Shivani Set For Impact Debut?


Shivani Set For Impact Debut?

తొలి పరిచయంతో శివాని ఆకట్టుకుంటుందా?

యాక్టర్లు రాజశేఖర్, జీవితల కుమార్తె శివాని ‘2 స్టేట్స్’ సినిమాతో ప్రేక్షకులకు తొలిసారి నాయికగా పరిచయం కాబోతోంది. చేతన భగత్ నవల ‘2 స్టేట్స్: ద స్టోరీ ఆఫ్ మై మ్యారేజ్’ ఆధారంగా తయారవుతున్న ఈ సినిమాలో అడివి శేష్‌కు జోడీగా శివాని కనిపించనున్నది. వెంకట్ కుంచం డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది.

ఒక షెడ్యూల్ కోల్‌కతాలో, ఇంకో షెడ్యూల్ హైదరాబాద్‌లో చేశారు. యు.ఎస్.లో జరిగే చివరి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేయాలనేది నిర్మాతల ప్లాన్. ఆ షెడ్యూల్ ఇప్పటికే జరగాల్సింది కానీ వీసా సమస్యల కారణంగా ఆలస్యమయ్యిందని నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఈ లోపే సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైపోయింది.

వీసా సమస్య పరిష్కారమయ్యిందనీ, జనవరిలో యు.ఎస్. షెడ్యూల్‌కు వెళ్తున్నామనీ నిర్మాతలు అంటున్నారు. ప్యాచ్‌వర్క్‌ను హైదరాబాద్‌లో చేస్తామంటున్నారు. ఆ ప్రకారం చూస్తే 2019 వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. హిందీలో హీరో హీరోయిన్లుగా అర్జున్ కపూర్, అలియా భట్ నటించిన ‘2 స్టేట్స్’ మంచి హిట్టయింది.

రెండు బిన్న సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలున్న కుటుంబాల నుంచి వచ్చిన హీరో హీరోయిన్లు ఒక్కటవడానికి ఆ నేపథ్యాలే ఆటంకంగా మారితే, వాళ్ల కుటుంబాలే అడ్డుగోడలుగా నిలిస్తే ఆ జంట ఏం చేసింది? ఒక్కటయ్యిందా? విడిపోయిందా? అనేది ఈ సినిమాలోని ప్రధానాంశం. తెలుగులో ఒక పేరుపొందిన హీరో కుమార్తె హీరోయిన్‌గా పరిచయమవడం ఇది మూడో సందర్భం.

గతంలో కృష్ణ కుమార్తె మంజుల చడీ చప్పుడు లేకుండా ‘షో’ సినిమాతో నాయికగా పరిచయమైతే, మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి మొదట ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో విలన్‌గా, తర్వాత ‘గుండెల్లో గోదారి’ చిత్రంతో నాయికగా మారారు. ఇప్పుడు శివాని వంతు. శేష్‌తో ఆమె జోడీ ఆకట్టుకుంటున్నట్లు స్టిల్స్ చెబుతున్నాయి. సినిమాలోనూ వాళ్ల కెమిస్ట్రీ పండితే తొలి పరిచయం శివానికి తీపి గుర్తుగా మిగిలిపోతుంది.