Sixth Sense: Enjoyable Game Show

Sixth Sense: Enjoyable Game Show

సిక్స్త్ సెన్స్: ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీలు

సినిమాల కంటే టీవీ గేం షోలతోటే ఎక్కువగా పాపులర్ అయిన ఓంకార్ తనదైన శైలిలో ‘సిక్స్త్ సెన్స్’ సెలబ్రిటీ గేం షో తొలి సీజన్‌ను నిర్వహించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ గేం షో రెండో సేజన్ డిసెంబర్ 8న మా స్టార్ టీవీలో మొదలైంది. తొలి ఎపిసోడ్‌లో రెండు జంటలు గీతామాధురి – నందు, అమిత్ – అతని భార్య పాల్గొన్నారు. ఈ షోని వాళ్లు బాగా ఎంజాయ్ చేశారు. గీత మధ్య మధ్యలో తన పాటలతో వీక్షకుల్ని అలరించింది కూడా.

ఇక డిసెంబర్ 9న రెండో ఎపిసోడ్ మరింత ఉల్లాసభరిత వాతావరణమో జరిగిందని చెప్పాలి. ‘కవచం’ సినీ బృందంలోని నలుగురు వ్యక్తులు ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. కాజల్ అగర్వాల్, సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఒక జంటగా, బెల్లంకొండ శ్రీనివాస్, మెహరీన్ మరో జంటగా గేంలో పాల్గొన్నారు. నలుగురూ ఈ షోను అమితంగా ఆస్వాదించడంతో పాటు, వీక్షకులనీ బాగా అలరించారు.

అందరిలోకీ కాజల్ మరీ చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ షోని ఎంజాయ్ చెయ్యడం ఆకట్టుకుంది. షో చూస్తున్నంత సేపూ మనం ఇప్పటి వరకూ చూడని కాజల్‌ని చూస్తున్నట్లే అనిపించింది. అలాగే శ్రీనివాస్ తన డాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. పోటీలో పదే పదే ఓడిపోవడంతో మెహరీన్ “నాకు సిక్స్త్ సెన్స్ లేదని అర్థమైంది” అని వచ్చీ రాని తెలుగులో చెప్పడం నవ్వు తెప్పించింది.

ఎవరూ తెలుగులో మాట్లాడమని చెప్పకపోయినా తనంతట తానుగా తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించి (తప్పులతో అయినా) ఆకట్టుకుంది మెహరీన్. పుష్కర కాలం నుంచీ తెలుగు సినిమాలు చేస్తున్నా కాజల్‌కు మాత్రం తెలుగు ఏమాత్రం వంటపట్టలేదని అర్థమైంది. తనెక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడింది. ఒకటీ అరా సందర్భంలోనే ఒకట్రెండు తెలుగు మాటలు మాట్లేడేందుకు ప్రయత్నించింది. అవి కూడా సరిగా చెప్పలేకపోయింది.

మిగతా వాళ్లు తనకంటే వయసులో చాలా చిన్నవాళ్లయినా వాళ్లతో కలిసిపోయి షోని ఆస్వాదించాడు చోటా కె. నాయుడు. ఎప్పటిలా ఓంకార్ ‘ఒక్క నిమిషం’ అంటూ సెలబ్రిటీలను కన్ఫ్యూజ్ చేసే పనిని సమర్థవంతంగా నిర్వర్తించాడు.