Subrahmanyapuram Review: 2 Ups And 5 Downs


Subrahmanyapuram Review: 2 Ups And 5 Downs

సుబ్రహ్మణ్యపురం రివ్యూ: 2 అడుగులు ముందుకి, 5 అడుగులు వెనక్కి

తారాగణం: సుమంత్, ఈషా రెబ్బా, సురేశ్, సాయికుమార్

దర్శకుడు: సంతోష్ జాగర్లపూడి

విడుదల తేదీ: 7 డిసెంబర్ 2018

చాలాకాలం హిట్టనేది లేకుండా కెరీర్‌ను ఎట్లాగో లాక్కుంటూ వస్తున్న సుమంత్‌కు మునుపటి సినిమా ‘మళ్లీ రావా’ కాస్త ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో కొత్తదర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పిన థ్రిల్లర్ స్టోరీ నచ్చి చేసిన సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. ఒక గ్రామంలోని గుడి నేపథ్యంలో జరిగే అనూహ్య ఘటనల నేపథ్యంలో జరిగే కథగా ఆమధ్య విడుదలైన ట్రైలర్‌తో ఆసక్తి నింపిన ఈ సినిమా మెప్పించేట్లు ఉందా? సహనానికి పరీక్షపెట్టేట్లు ఉందా?

కథ

నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) పురావస్తు పరిశోధన శాఖలో పనిచేస్తుంటాడు. ప్రియ అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ఊరు సుబ్రహ్మణ్యపురంలోవరుసగా ఆత్మహత్యలు చోటు చేసుకుంటాయి. దేవుడి ఆగ్రహం వల్లే అవి జరుగుతున్నాయని గ్రామస్థులు, పోలీసులు నమ్ముతూ వస్తారు. ఆ విషయం తెలిసి సుబ్రహ్మణ్యపురం వెళ్తాడు కార్తీక్.

ఆత్మహత్యకు ముందు వాళ్లు రాసినవని చెప్పే ఉత్తరాల్లోని లిపి ఎవరికీ అర్థంకాదు. అయితే వీటి వెనుక ఏదో మర్మం ఉన్నదని భావించిన కార్తీక్, ఆ ఆత్మహత్యల రహస్యాన్నిఛేదించే పని ప్రారంభిస్తాడు. ఆత్మహత్యల గుట్టేమిటో అతడు కనిపెడతాడా? ఆత్మహత్యలకూ, గుడికీ ఉన్న లింకేమిటి? అనేది మిగథా కథ.

కథనం

రానా వాయిస్ ఓవర్‌తో కథ ముందుకు నడుస్తుంది కానీ థ్రిల్లర్‌కు అత్యవసరమైన బిగువైన కథనం లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సన్నని లైను మీద అల్లుకున్నకథ కావడం వల్ల ప్రేక్షకుడ్నికన్విన్స్ చేద్దామనే తాపత్రయంతో మొదట్లో చాలా సమయాన్ని వృథాచేశాడు దర్శకుడు. అనుభవ రాహిత్యం వల్ల కానీ, అపరిపక్వత వల్ల కానీ, ఒక మిస్టీరియస్ స్టోరీని ఉత్కంఠభరితంగా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

కథ చిన్నదే అయినా అనేక సన్నివేశాల్ని దర్శకుడు కల్పించాడు. కానీ వాటిలో అధికభాగం సరైన తీరులో లేవు.ఆ సన్నివేశాలు సహనానికి పరీక్షగా నిలుస్తాయి. క్లైమాక్స్ ముందు వచ్చే మలుపు ఒక్కటి ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ కొద్ది కాలం క్రితం చందు మొండేటి రూపొందించిన ‘కార్తికేయ’ సినిమా గుర్తుకు రావడం మన తప్పుకాదు. ఆ సినిమా ప్రేరణతోటే ఈ సినిమాని సంతోష్ రూపొందించినట్లుగా తోస్తుంది.

కథ మొదలైన ముప్పావుగంట వరకు ఆకట్టుకొనే సన్నివేశాలు లేకపోవడం మైనస్. ఇంటర్వల్ ఫర్వాలేదనుకున్నాక, మళ్లీ ప్రిక్లైమాక్స్ వచ్చేదాకా అదే స్థితి. పలు సన్నివేశాలు పదేపదే వస్తూ మన మూడ్‌ను మరింత చెడగొడతాయి.సుమంత్, ఈషా మధ్య రొమాన్స్ సరిగా పండలేదు. వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా అదే తరహాలో ఉంది.

Subrahmanyapuram Review: 2 Ups And 5 Downs

పాత్రల చిత్రణ

నాస్తికుడైన పరిశోధకుడిగా కనిపించే కార్తీక్‌తో సహానుభూతి చెందాలంటే ఆ పాత్రతో ఎమోషనల్ కనెక్షన్ ఒకటి ఉండాలి. అది మిస్సవడం ఆ క్యారెక్టర్ డిజైనింగ్‌లో డైరెక్టర్ చేసినపొరపాటు. ప్రధాన పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోతే ఎంతటి సినిమా అయినా చికాకు పుట్టిస్తుంది. ఫస్టాఫ్‌లో జరిగింది అదే. పది రోజుల్లో ఆత్యహత్యల వెనకున్న మిస్టరీని కనిపెడతానని చెప్పే సన్నివేశంలో మాత్రమే ఆ పాత్ర ఎలివేట్ అయింది.

పక్కింటమ్మాయి తరహా పాత్రగా ఈషా రెబ్బా చేసిన ప్రియ పాత్రను మలిచాడు దర్శకుడు. అయితే ఆ పాత్రను కథకు ప్రయోజనకరంగా మలచడంలో విఫలమయ్యాడు. ఆమె తండ్రి నరేంద్రవర్మ(సురేశ్) పాత్రను మాత్రం కాస్త శ్రద్ధగా తీర్చిదిద్దాడు. వినోదం కోసం కల్పించిన భద్రం, జోష్ రవి పాత్రలను కూడా దర్శకుడు సరిగా వినియోగించలేదు. ఫలితంగా అవి వినోదం కలిగించడానికి బదులు చికాకునే పుట్టించాయి.

నటుల అభినయం

కథ మొత్తం ఆధారపడే కార్తీక్ పాత్రలో తనకు సాధ్యమైన రీతిలో న్యాయం చెయ్యడానికి ప్రయత్నించాడు సుమంత్. నటించడానికి బాగా అవకాశమున్న పాత్ర. గతంలో ఎప్పుడూ చూడని సుమంత్ మనకు ఇందులో కనిపిస్తాడు. ఇంకొంచేం ఎనర్జీతో చేస్తే బాగుండేదనిపిస్తుంది. ఈషా రెబ్బా చూపులకు బాగానే ఉంది కానీ హావభావాల విషయంలో తేలిపోయింది. సురేశ్, సాయికుమార్ తమదైన శైలుల్లో పాత్రలకు న్యాయం చేశారు.

చివరి మాట

పేరుకు థ్రిల్లర్ అయినా థ్రిల్లింగ్ మూమెంట్స్ తక్కువగా ఉండటం, గతంలో వచ్చిన అనేక ఇదే తరహా సినిమాల మాదిరే ఇదీ ఉండటం, కొత్తదనం లేకపోవడం, అసహనానికి పరీక్షపెట్టే కథనం, సన్నివేశాల కల్పన, శేఖర్ చంద్ర సంగీతం సైతం సీన్లను ఎలివేట్ చెయ్యలేకపోవడంతో ‘సుబ్రహ్మణ్యపురం’ అనాసక్తంగా తయారైంది.

– కార్తికేయ

8 డిసెంబర్, 2018