That Is Mahalakshmi: Where Is The Director?


That Is Mahalakshmi: Where Is The Director?

దటీజ్ మహాలక్ష్మి: డైరెక్టర్ లేని సినిమా

కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించగా సూపర్ హిట్టయిన ‘క్వీన్’ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను తమన్నా పోషిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 21న రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మను కుమరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రమోషన్స్‌లో డైరెక్టర్ పేరు తప్ప మిగతా టెక్నీషియన్స్ పేర్లన్నీ ఇస్తున్నారు. నిజానికి మొదట ఈ చిత్రానికి నీలకంఠను దర్శకుడిగా ఎంచుకున్నారు. తర్వాత తెలీని కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత ‘అ!’ ఫేం ప్రశాంత్‌వర్మకు ఆ బాధ్యతలు అప్పగించారు.

జూలైలో సినిమా షూటింగ్ పూర్తయినట్లు నిర్మాతలు ప్రకటించారు. మళ్లీ ఏమైందో తెలీదు, ప్రశాంత్‌వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ సినిమా రూపకల్పనలో మునిగిపొయ్యాడు. దాంతో డైరెక్టర్ పేరు లేకుండానే ‘దటీజ్ మహాలక్ష్మి’ ప్రమోషన్‌ను కొనసాగిస్తున్నారు నిర్మాతలు. అంటే డైరెక్టర్ లేని సినిమాగా మారిందన్న మాట! ఒక ప్రతిష్ఠాత్మక చిత్రం ఇలాంటి పరిస్థితికి రావడం ఇబ్బందికరమే.

ఒరిజినల్‌లో కంగన కాబోయే భర్తగా రాజ్‌కుమార్ రావ్ నటించగా, తెలుగులో ఆ పాత్రను సిద్ధు జొన్నలగడ్డ (‘గుంటూర్ టాకీస్’ ఫేం) పోషించాడు. 21న రిలీజ్ కానున్న టీజర్‌లో సినిమా విడుదల తేదీని ప్రకటించవచ్చు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి 5 నెలలు అయినందున 2019 జనవరిలో చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘100% లవ్’ సినిమాలో మహాలక్ష్మి పాత్ర తమన్నాకు మంచి పేరు తెచ్చింది. అందులో ‘దటీజ్ మహాలక్ష్మి’ పాట మంచి ఫేమస్ కూడా అయ్యింది. అందుకే దాన్నే ఈ సినిమాకు టైటిల్‌గా నిర్మాతలు ఎంచుకున్నారు. ఇక ‘దటీజ్ మహాలక్ష్మి’గా తమన్నా ఆకట్టుకోవడమే తరువాయి.