Varun Tej Career: 2 Downs And 4 Ups


Varun Tej Career: 2 Downs And 4 Ups

వరుణ్‌తేజ్ కెరీర్: 2 అడుగులు వెనక్కి, 4 అడుగులు ముందుకి

‘అంతరిక్షం.. 9000 కేఎంపీహెచ్’ సినిమాతో డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వరుణ్‌తేజ్ కొణిదెల. నటుడిగా మారాక తక్కువ సమయంలోనే విలక్షణమైన కథలు, పాత్రలతో తన కెరీర్‌ను అతడు మలచుకుంటున్న తీరుకు ముచ్చటేస్తోంది. హీరోగా ‘అంతరిక్షం’ అతడికి 7వ సినిమా. అంతరిక్షంపై తీసిన తొలి తెలుగు సినిమాలో వ్యోమగామి అయిన హీరోగా నటించే అవకాశం తొలిగా అతడికే దక్కింది.

అంతకు ముందు అతడు నటించిన 6 సినిమాల్లో 3 ప్రజాదరణ పొందాయి. ఒక సినిమా డిజాస్టర్ కాగా, 2 సినిమాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. అయితే ఎంచుకుంటున్న సబ్జెక్టులు అతడిని యువ హీరోల్లో ఒక విలక్షణ నటుడిగా నిలబెడుతున్నాయి. అందుకే రాంచరణ్ “వరుణ్‌ను చూస్తుంటే జెలసీగా అనిపిస్తోంది” అన్నాడు. ఒక్కసారి వరుణ్ చేసిన పాత్రలను అవలోకిస్తే…

Varun Tej Career: 2 Downs And 4 Ups

ముకుంద (టైటిల్ రోల్)

తొలి సినిమాలోనే టైటిల్ రోల్ చేసే అవకాశం దక్కింది వరుణ్‌కు. సున్నితమైన భావోద్వేగాలతో ఫ్యామిలీ డ్రామాలు తీస్తున్న క్రమంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమానీ అదే తరహాలో రూపొందించినా, ఈ కథకు పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడు. పేరుకు తొలి సినిమాయే అయినా ఊహించిన దానికి మించి ముకుంద పాత్రలో రాణించాడు వరుణ్.

తెరపై అతను బాగున్నాడనిపించింది. పాత్రలోని భిన్న భావోద్వేగాల్ని పరిణతితో ప్రదర్శించాడు. రావు రమేశ్ వంటి ప్రతిభావంతుడైన నటుడితో కలిసి చేసిన సన్నివేశాల్లో వరుణ్ తన అభినయంతో మెప్పించాడు. ఒక్క డైలాగ్ డెలివరీని మెరుగుపర్చుకుంటే చాలనిపించింది. పొడవైన ఆకారం కావడంతో అతడు చేసిన ఫైట్లు నమ్మదగ్గట్లుగా అనిపించాయి.

అయితే అతడు డాన్స్‌లో వీక్ కాబట్టి డాన్స్ మాస్టర్లు కూడా అతడి చేత క్లిష్టమైన డాన్స్ మూమెంట్స్ చేయించలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడకపోయినా తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులే సంపాదించాడు వరుణ్.

Varun Tej Career: 2 Downs And 4 Ups

కంచె (హరిబాబు)

రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం ఏ స్టార్‌కో రావాలి. కానీ స్టార్ కాకుండానే, రెండో సినిమాలోనే అలాంటి చక్కటి అవకాశం పొందాడు వరుణ్. క్రిష్ వంటి డైరెక్టర్ చేతుల్లో పడితే, ఇంక చెప్పాల్సిన పనేముంది! ఒకదాని కొకటి సంబంధంలేని భిన్న ఇతివృత్తాలతో సినిమాలు తీసే క్రిష్ ‘కంచె’ కథానాయకుడు హరిబాబు పాత్రకు వరుణ్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యకరమే. అయితే అతడి ఎంపికకు పూర్తి న్యాయం చేకూర్చాడు వరుణ్.

మనకు తెరపై వరుణ్ కాకుండా హరిబాబే కనిపిస్తాడు. సైనికుడిగా అతడితో మనమూ ప్రయాణిస్తాం. ముకుంద పాత్రలో అతడి నటనకూ, హరిబాబుగా అతడి అభినయానికీ మధ్య ఎంత తేడా! అక్కడ మంచి మార్కులే పొందితే, ఇక్కడ ఏకంగా డిస్టింక్షన్ సాధించాడు. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద సునాయాసంగా మోసుకుపొయ్యాడు.

తొలి సినిమాలో అతడి డైలాగ్ డెలివరీపై విమర్శలు చేసిన వాళ్లే ఇందులో అతడి వాచకాన్నీ అమితంగా మెచ్చారు. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఎంత శాంతమూర్తిగా, ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడో, సైనికుడిగా ఆవేశాన్ని ప్రదర్శించి అంతకంటే ఎక్కువ మన్ననలు పొందాడు. క్లైమాక్స్ సీన్ ఒక్కటి చాలు అతడి నటనా సామర్థ్యాన్ని అభినందించడానికి! వరుణ్ కెరీర్‌లో ‘కంచె’లోని హరిబాబు పాత్ర ఒక ఆణిముత్యం.

Varun Tej Career: 2 Downs And 4 Ups

లోఫర్ (రాజా)

‘కంచె’లో హారిబాబు పాత్రలో వరుణ్ ను చూసిన మనం, ఆ వెంటనే అతడిని ఒక ‘లోఫర్’గా ఊహించగలమా! కానీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఊహించాడు. అతడిని ‘లోఫర్’గా రాజా పాత్రలో చూపించాడు. తండ్రి (పోసాని) పెంపకంలో అతడి లాగే లోఫర్‌గా పెరిగిన రాజా, తన తల్లి (రేవతి) బతికి ఉందని తెలిసి, ఆమెకు తనెవరో చెప్పకుండా దగ్గరవడానికి చేసే ప్రయత్నాలు చూస్తే గుండె తరుక్కుపోక మానదు. అంత బాగా సెంటిమెంట్‌ పండించాడు వరుణ్.

సబ్జెక్ట్ పరంగా ‘కంచె’ అతడి కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అయితే, నటుడిగా ‘లోఫర్’ కేరక్టర్ అతడికి టర్నింగ్ పాయింట్. ఈ సినిమాతో ఆల్‌రౌండర్‌గా అవతరించాడు వరుణ్. రాజా కేరక్టర్‌తో అతడు మాస్‌కు సైతం దగ్గరయ్యాడు. రేవతితో కలిసి చేసిన సన్నివేశాల్లో అతడు భావోద్వేగాలు ప్రదర్శించిన తీరుకు కన్నులు చెమ్మగిల్లని వాళ్లు ఉండరు.

రానున్న రోజుల్లో అతడి నుంచి మరిన్ని మంచి పాత్రలు వస్తాయనే నమ్మకం కలిగింది, ఈ పాత్ర పోషణ తర్వాత. అతడిని అనూహ్యంగా ఈ పాత్రలో చూపించిన డైరెక్టర్ పూరిదే ఆ క్రెడిట్.

Varun Tej Career: 2 Downs And 4 Ups

మిస్టర్ (చైతన్య)

తప్పటడుగులు వేయని మనిషంటూ ఉండడు. నటులైనా అంతే. ఒక్కోసారి డైరెక్టర్ మాటల్లో చెప్పిన సబ్జెక్ట్, కేరక్టర్ నచ్చి చేస్తే, స్క్రీన్‌పై అందుకు భిన్నంగా కనిపించి నిరాశపర్చవచ్చు. వరుణ్ కెరీర్‌లో ‘మిస్టర్’ సినిమా, అందులో అతడు పోషించిన చైతన్య అలియాస్ చై పాత్రా అలాంటివే. వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల కసి మీద ఉన్నాడనీ, అందువల్ల అతడి నుంచి మంచి ప్రాడక్ట్ వస్తుందనీ నమ్మి చై పాత్ర చేశాడు వరుణ్.

అతడి నమ్మకం పూర్తిగా వమ్మయింది. చెత్త కథనం వల్ల చై పాత్రా, ఆ పాత్రలో వరుణ్ రాణించలేకపోయారు. చైగా వరుణ్ స్టైలిష్‌గా కనిపించాడు. నటనలో వంక పెట్టాల్సిందీ లేదు. అయితేనేం.. అదంతా వృథా అయిన సినిమా ఇది. వరుణ్ కెరీర్‌లో తొలి డిజాస్టర్ ‘మిస్టర్’.

Varun Tej Career: 2 Downs And 4 Ups

ఫిదా (వరుణ్)

మనసులో ఒకరిపై మరొకరికి అమితమైన ప్రేమ ఉన్నా, పొరపొచ్చాలతో దూరమై, మానసిక వేదనను అనుభవించే ఇద్దరు ప్రేమికుల కథను ‘ఫిదా’ పేరుతో తెరపైకి తెచ్చాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. నాయిక భానుమతిగా సాయిపల్లవిని ఎంచుకొని, నాయకుడి పాత్రకు వరుణ్‌ను సంప్రదించాడు. హీరో పాత్ర కంటే, హీరోయిన్ పాత్రకు స్కోప్ ఎక్కువ కనిపిస్తున్నా, సబ్జెక్ట్ బాగా నచ్చి, హీరోగా కంటే నటుడిగా కనిపించాలనే ఉద్దేశంతో వరుణ్ కేరక్టర్ చేశాడు.

నిజంగానే ‘ఫిదా’ సాయిపల్లవి సినిమా. అయినప్పటికీ వరుణ్ పాత్రలో ఉన్నత స్థాయిలో రాణించాడు వరుణ్‌తేజ్. భానుమతి తన ప్రేమను తిరస్కరించడాన్ని భరించలేక మానసిక వేదననీ, ఆమెపై ప్రేమని మరొకరిపై మళ్లించలేక సంఘర్షణనీ అనుభవించే పాత్రను ఎంతో పరిణతితో పోషించాడు. ఓ వైపు భానుమతిపై అమితమైన ప్రేమ ఉన్నా, తొందరపాటుతో నోరుజారి, తర్వాత భాధపడే పాత్రలో అతడు ఆకట్టుకున్నాడు.

ఇక కథ మొదట్లో భానుమతి హృదయాన్ని దోచుకునే క్రమంలో అతడు ప్రదర్శించిన హుషారైన నటన కూడా ఆకట్టుకుంది. ఇలా భిన్న బావావేశాలున్న వరుణ్ పాత్ర నటుడిగా అతడిని మరో మెట్టు పైన నిలిపింది. ఈ సినిమా అతడి కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్.

Varun Tej Career: 2 Downs And 4 Ups

తొలిప్రేమ (ఆది)

‘ఫిదా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చేసిన సినిమా కావడం, బాబాయ్ పవన్ కల్యాణ్‌కు తొలి భారీ విజయం అదించిన సినిమా టైటిల్ కావడంతో ‘తొలిప్రేమ’పై అందరి దృష్టీ నిలిచింది. అంచనాలు అమితంగా ఉండటంతో వరుణ్‌పై ఒత్తిడీ పెరిగింది. వాటన్నింటినీ అధిగమించి, ఒత్తిడిని తట్టుకొని ‘తొలిప్రేమ’ బాక్సాఫీస్ వద్ద నిలిచింది.

ఇంటర్మీడియేట్ పూర్తయ్యాక పరిచయమైన వర్ష (రాశీఖన్నా)ను హైదరాబాద్‌లో తను చేరిన ఇంజినీరింగ్ కాలేజీలో సహాధ్యాయిగా చూసి తొలిప్రేమను అనుభవించిన ఆది, ఒక అనుకోని ఘటన కారణంగా వర్షతో విడిపోయి ఎలాంటి బాధను అనుభవించాడు, లండన్‌లో ఒక ఉద్యోగిగా ఆమెను కలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాడు, చివరకు వర్షకు ఎలా దగ్గరయ్యడనే కథను కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి సమర్థవంతంగా తెరపై మలిస్తే, అంతకన్నా సమర్థవంతంగా ఆది పాత్రను పోషించాడు వరుణ్.

పాత్ర ప్రకారం ఇంటర్మీడియేట్ విద్యార్థి నుంచి, ఉద్యోగి దాకా ఎదిగే క్రమాన్ని అప్పటికే అలవాటైన శైలిలో సునాయాసంగా చేసుకుపోయాడు. భిన్న దశల ప్రేమలోని కోణాల్ని అంతే విలక్షణంగా ప్రదర్శించాడు. చెప్పాలంటే వరుణ్‌లో స్వభావసిద్ధంగా ఉన్న నటనా సామర్థ్యాన్ని మరోసారి వెలికి తీసిన సినిమా ‘తొలిప్రేమ’.

– సజ్జా వరుణ్

19 డిసెంబర్ 2018