Vinaya Vidheya Rama: Major Questions After The Trailer


Vinaya Vidheya Rama: Major Questions After The Trailer

వినయ విధేయ రామ ట్రైలర్: ఎన్నో ప్రశ్నలు!

రాంచరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ డిసెంబర్ 27న విడుదలైంది. బోయపాటి సినిమా అంటే ఎలా ఉంటుందో అందుకు తగ్గట్లే పవర్‌ఫుల్‌గా ట్రైలర్ ఉంది. దీన్ని చూస్తుంటే ఎన్నో ప్రశ్నలు మనసులో మెదలడం ఖాయం.

వాటిలో మొదటిది, అసలు ఈ సినిమా కథ నేపథ్యం ఏమిటి? ట్రైలర్‌లో కొండలు, గుట్టల నడుమ సన్నివేశాలు, పోరాటాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవేమైనా గనులకు సంబంధించిన కొండగుట్టలా అనే సందేహం కలుగుతోంది. చూపులకు అవి మన ప్రాతం కొండలుగా లేవు. వేరే రాష్ట్రానికి చెందినవిగా అగుపిస్తున్నాయి. అంటే ఈ కథ నేపథ్యం తెలుగు ప్రాంతానికి పరిమితమైంది కాదనీ, వేరే రాష్ట్ర నేపథ్యం కూడా ఎక్కువగానే ఉందనీ అనుకోవాలి.

విలన్ రాజ్యం!

రాంచరణ్ “సరైన సింహం తగలనంత వరకూ ప్రతి వేటగాడూ మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్తే డెత్ ను గెలిచొచ్చా.. రా..” అంటాడు. అప్పుడు అతని కాస్ట్యూమ్స్ చూస్తుంటే ఖైదు చేయబడ్డ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. గడ్డం పెరిగి రఫ్‌గా కనిపిస్తున్నాడు. చుట్టూ తెల్లటి కొండ గుట్టలు.

అతడు “రా..” అన్నప్పుడే నల్లటి షేర్వాణీలో కళ్లజోడు పెట్టుకొని నడిచొస్తూ జోడును తీసి చేత్తో పట్టుకొని వివేక్ ఓబరాయ్ ఎంట్రీ ఇచ్చాడు. అతడు “ఈ ప్రాంతంలో ఓటైనా, మాటైనా, తూటా అయినా నాదే” అంటాడు, ఎదురుగా కూర్చున్న వ్యక్తితో. దాన్ని బట్టి అతడు తన సామ్రాజ్యంలా భావించే ప్రాంతానికి హీరో వస్తాడనీ, అతడికి సవాలు విసురుతాడనీ అనుకోవచ్చు.

ఒక సీను బ్యాగ్రౌండులో పోలీసులు కాల్పులు జరుపుతుంటే, ముందున్న నలుగురు స్కూలు పిల్లలను కియారా అద్వాణీ కాపాడే ప్రయత్నం చేస్తోంది. అక్కడేదో బీభత్సం జరిగిన వాతావరణం కనిపిస్తోంది. ఆ సన్నివేశం ఎందుకు వస్తుంది, అక్కడ ఏం జరిగిందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

అన్నావదినలు

ప్రశాంత్ “ద బ్యాలెట్ ఈజ్ పవర్‌ఫుల్ దేన్ బుల్లుట్. లెట్స్ ప్రూవ్ ఇట్. క్యాస్ట్ దెం డౌన్” అని ఆవేశంగా చెబుతాడు. అతని వెనకున్నవాళ్లంతా ఎన్నికల నిర్వహణ సిబ్బందిలా కనిపిస్తున్నారు. అంటే ఎన్నికలకు, ప్రశాంత్‌కూ సంబంధం ఉంది. విలన్ ఏరియాలో ఎన్నికలు నిర్వహించడానికి వచ్చే ఎలొక్టోరల్ ఆఫీసర్ కేరక్టర్‌లో ప్రశాంత్ ఏమైనా కనిపిస్తాడా? అనేది ప్రశ్న.

ఇంకో సీనులో దుండగులు తుపాకులు అడ్డం పెడుతుంటే స్నేహ ఆవేశంగా నడిచివస్తోంది. అది ఒక ఎమోషనల్ సీన్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. ప్రశాంత్ భార్యగా, చరణ్ వదినగా కనిపించే స్నేహ పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉన్నదని సమాచారం.

బోయపాటి సిగ్నేచర్ యాక్షన్

ఒంటిపై షర్టు లేకుండా, కండలు తిరిగిన దేహం, ఛాతీ మీద నుంచి భుజాల దాకా, పొట్ట మీదా గ్రీన్ టాట్టూ, రెండు చేతులూ గొలుసులతో కట్టివేయబడ్డ రాంచరణ్ “ఒక్క నా కొడుక్కి ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు, టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు. సరిగ్గా పుట్టినోడు, సరైన మగాడు ఒక్కడు కూడా తగల్లేదు. అంతా జంగ్” అంటాడు ఆవేశంగా.

ఈ ట్రైలర్ ద్వారా చరణ్ కేరక్టర్‌ను ఎలివేట్ చేశారు. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌కు పూర్తి విరుద్ధంగా శక్తిమంతమైన పాత్రలో, హింసకు ఏమాత్రం వెనుదీయని యువకునిగా చరణ్ దర్శనమిస్తున్నాడు. గుర్రపు స్వారీ చేస్తూ కూడా అతనో ఫైట్ చేస్తూ కనిపించాడు. ఈ ట్రైలర్ ప్రకారం ఇందులో యాక్షన్ సీక్వెన్సులకు భారీ బడ్జెట్‌నే కేటాయించినట్లు తెలుస్తోంది. అంత భారీతనంతో, అంత రిచ్‌గా వాటిని చిత్రీకరించారు.

ఒకచోట కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందించిన రాబందులు కూడా కనిపించాయి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇందులో బాగానే ఉన్నాయన్న మాట. ఈ ట్రైలర్‌తో తలెత్తుతున్న ప్రశ్నలకు జనవరి 11న జవాబులు లభించనున్నాయి. ఆ రోజు ‘వినయ విధేయ రామ’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.