Vinaya Vidheya Rama: Things You Need To Know


Vinaya Vidheya Rama: Things You Need To Know

వినయ విధేయ రామ: తెలుసుకోవాల్సిన విషయాలు

రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తూ జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. తమిళ నటుడు ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేశ్ వంటివాళ్లు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అనేది ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న. వాటిలో మొదటిది రాంచరణ్ కేరక్టర్ ఏంటనేది. సాధారణంగా బోయపాటి శ్రీను సినిమా ఏది చూస్తుకున్నా హీరోయిజం పీక్ స్టేజ్‌తో ఉంటుందనేది తెలుస్తుంది. టైటిల్ సజెస్ట్ చేస్తున్న దాని ప్రకారం ఇందులో రాంచరణ్ కేరక్టర్ పేరు రామ శబ్దంతో ఉంటుందనేది స్పష్టం. మొదట వినయంగా విధేయంగా కనిపించే రాముడు అవసరమైతే శత్రువుల్ని వేటాడి తుదముట్టించే పరశురాముడిగా ఎలా మారతాడో ఈ కేరక్టర్ ద్వారా దర్శకుడు చూపించబోతున్నాడు.

భిన్నంగా కనిపించే రాముడు

ఒకే తరహా కేరక్టరైజేషన్స్‌తో సినిమాలు తీస్తాడనే పేరు తెచ్చుకున్న బోయపాటి ఈ సినిమాలో చరణ్ కేరక్టర్‌ను కొంత భిన్నంగా తీర్చిదిద్దాడు. ఆ పాత్రలో కేవలం హీరోయిజం ఒక్కటే కాకుండా భిన్న ఎమోషన్స్‌ను కూర్చాడు. కుటుంబానికి రక్షగా ఉండే ఆ పాత్రలో ఓ ప్రేమికుడినీ, ఓ అల్లరి యువకుడినీ, ఒక శాంతమూర్తినీ, ఇంకో రౌద్రమూర్తినీ కళ్లముందుంచుతున్నాడు.

ఇప్పటివరకూ రాంచరణ్ చేసిన యాక్షన్ సీన్లు వేరు, ఈ సినిమాలో అతను చేసిన యాక్షన్ సీన్లు వేరు. అవి చేయడానికి చరణ్ ఒళ్లు హూనం చేసుకున్నాడు. చరణ్, వివేక్ ఓబరాయ్ మధ్య యాక్షన్ సీన్ ఒళ్లు గగుర్పాటు కలిగించే రీతిలో చిత్రీకరించారు. అలాంటి హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు కనీసం మూడున్నాయి. మాస్ ప్రేక్షకుల్ని అవి ఉర్రూతలూగిస్తాయి.

అన్నదమ్ముల అనుబంధం

యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ఈ సినిమాలో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. చరణ్ అన్నగా ఇందులో ప్రశాంత్ కనిపించబోతున్నాడు. ఎప్పుడో ‘చామంతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ప్రశాంత్ మధ్యలో ‘జీన్స్’ వంటి సినిమాలతో ఆకట్టుకున్నా, చాలా కాలం నుంచి అతను కనిపించడం లేదు. ఈ సినిమాతో అతను తెలుగువాళ్లకు చేరువకానున్నాడు. అన్నదమ్ముల అనుబంధానికి సంబంధించిన సన్నివేశాలు అలరించడమే కాదు, హృదయాల్ని స్పృశించనున్నాయి.

2018కు బెస్ట్ ఆల్బం అయిన ‘రంగస్థలం’ను అందించిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ‘వినయ విధేయ రామ’కూ పెద్ద ప్లస్ కానున్నది. ఇప్పటికే శాంపిల్స్ తెలుస్తున్నాయి. మెలోడీ, సెంటిమెంట్, ఎమోషనల్ సాంగ్స్‌తో ఈ సినిమా ఆల్బం ఆకట్టుకోనున్నది. సన్నివేశాలకు దేవి ఇచ్చిన రీరికార్డింగ్ ఇంకో ఎస్సెట్. మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచనున్నది.

డ్రైవింగ్ ఫోర్స్‌గా స్టోరీ లైన్

ఒకటీ, అరా తప్ప బోయపాటి సినిమాలు హిట్టవడానికి ప్రధాన కారణం వాటి స్టోరీ లైన్. కొలతల ప్రకారం అన్ని ఎమోషన్స్ క్యారీ అయ్యే విధంగా రైటర్‌తో స్టోరీ లైన్‌ను రూపొందించడం బోయపాటికి తెలిసిన ఒక విద్య. అదే రీతిలో ఈ సినిమా స్టోరీ లైన్ ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేవకుండా కూర్చోబెడుతుందని సమాచారం. హీరో కేరక్టరైజేషన్ మాత్రమే కాకుండా ఇది కూడా సినిమాకు డ్రైవింగ్ ఫోర్స్‌గా మారనున్నది.

బోయపాటి విలన్లకు ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ ఉంది. దానికి తగ్గట్లే వివేక్ ఓబరాయ్ కేరక్టర్ కనిపిస్తుంది. ‘సరైనోడు’లో వైరం ధనుష్ (ఆది పినిశెట్టి), ‘లెజెండ్’లో జితేంద్ర (జగపతిబాబు) పాత్రలలోని క్రూరత్వం కారణంగానే హీరోల కేరక్టర్లు ఎలివేట్ కాగా, ఇందులోనూ వివేక్ కేరక్టర్ ప్రదర్శించే విలనిజానికి ప్రేక్షకుల ఒళ్లు జలదరిస్తుంది.