Will Nani Enter The Success Path Again?


Will Nani Enter The Success Path Again?

నాని మళ్లీ సక్సెస్ బాటలోకి వస్తాడా?

విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి నాని రెడీ అవుతున్న విషయం తెలిసిందే. భిన్న ఇతివృత్తాలతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే విక్రమ్ కుమార్‌ను ‘హలో’ సినిమా దెబ్బ కొట్టింది. ’13 బి’ సినిమా నుంచి మొదలుకొని ‘ఇష్క్’, ‘మనం’, ’24’ సినిమాల వరకు విక్రమ్ కెరీర్ బ్రహ్మాండంగా ఉంది.

సినిమా కథ, కథనాల విషయంలో అతడు చేసిన పొరపాట్లే ‘హలో’ ఫ్లాప్‌కు కారణమయ్యాయి. ఫలితంగా అఖిల్ వరుసగా రెండో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. ‘హలో’ విషయంలో నాగార్జున సూచనల మేరకు మొదట రాసుకున్న స్క్రిప్టును విక్రమ్ మార్చాల్సి వచ్చిందనీ, దానివల్ల స్క్రీన్‌ప్లే బలహీనపడిందనీ టాలీవుడ్‌లో ఒక ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలో అతడు చెప్పిన కథ నానికి బాగా నచ్చింది. ఈ సినిమాని తాను అనుకున్నట్లు తీయడానికి నాని వద్ద విక్రమ్ మాట తీసుకున్నాడని వినిపిస్తోంది. మరోవైపు నాని వరుస హిట్ల పరంపరకు ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ సినిమాలు గండి కొట్టాయి. దాంతో కెరీర్ విషయంలో అతడు మరింత శ్రద్ధ చూపిస్తున్నాడు.

‘దేవదాస్’ విడుదలకు ముందే అతడు ‘జెర్సీ’ని ఒప్పుకొని షూటింగ్ మొదలుపెట్టాడు. సుమంత్‌తో ‘మళ్లీ రావా’ సినిమాని రూపొందించి ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ‘భీమిలి కబడ్డి జట్టు’లో కబడ్డీ ఆటగాడుగా నటించిన నాని ఇందులో అర్జున్ అనే క్రికెటర్ కేరక్టర్ చేస్తున్నాడు. 1986-96 మధ్య కాలం కథతో ఈ సినిమా రూపొందుతోంది.

‘జెర్సీ’తో తిరిగి విజయాల బాటలోకి వస్తాననే నమ్మకం నానిలో గట్టిగా వ్యక్తమవుతోంది. దాని తర్వాత విక్రమ్ డైరెక్షన్‌లో చేసే సినిమా విజయం సాధించడంతో పాటు నటుడిగా తనను మరో మెట్టు పైకెక్కిస్తుందనే ఆశాభావంతో ఉన్నాడు.