2.0 Gets Sound Editing Nomination At Golden Reel Awards


2.0 Gets Sound Editing Nomination At Golden Reel Awards

‘2.0’ సౌండ్ డిజైన్‌కు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ రీల్ నామినేషన్

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ మూవీ ‘2.0’కు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ రీల్ అవార్డుల్లో నామినేషన్ లభించింది. యు.ఎస్.ఎ. లోని మోషన్ పిక్చర్ సౌండ్ ఎడిటర్స్ (ఎంపిఎస్ఇ) ప్రతి యేటా సినిమా, టెలివిజన్, యానిమేషన్, కంప్యూటర్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలలో సౌండ్ ఎడిటింగ్ విజయాలకు సంబంధించి అవార్డులను అందజేస్తూ వస్తోంది. ఈ అవార్డులను ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవిగా భావిస్తుంటారు. ఈసారి 66వ వార్షిక గోల్డెన్ రీల్ అవార్డుల్లోని విదేశీ చలన చిత్రాల విభాగంలో ‘2.0’ సౌండ్ ఎడిటింగ్‌కు నామినేషన్ లభించింది. ఈ నామినేషన్ లభించిన మొత్తం 8 సినిమాల్లో ‘2.0’ ఒకటి కావడం గమనార్హం. గతంలో ‘స్లండాగ్ మిలియనీర్’కు ఆస్కార్‌ను సాధించిన రసూల్ పోకుట్టి ఈ సినిమాకు సౌండ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 17 (ఆదివారం) లాస్ ఏంజిల్స్‌లోని వెస్టిన్ బోనావెంచర్ హోటల్‌లో జరిగే వేడుకలో అవార్డులను అందజేయనున్నారు. మరి రసూల్ పోకుట్టి అక్కడ అవార్డును అందుకుంటాడో, లేదో చూడాలి. గోల్డెన్ రీల్ నామినేషన్ పొందిన సందర్భంగా ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు రసూల్.