2018 Tollywood Review: 10 Biggest Disasters


2018 Tollywood Review: 10 Biggest Disasters

2018 టాలీవుడ్ రివ్యూ: 10 బిగ్గెస్ట్ డిజాస్టర్స్

ఎంత పెద్ద స్టార్ నటించినా, డైరెక్టర్‌కు ఎంత గొప్ప పేరున్నా, కథలో, కథనంలో పస లేకపోతే తాము చూడమని ప్రేక్షకులు మరోసారి స్పష్టం చేశారు. 2018లో ఎంతో హైప్‌తో, క్రేజీ కాంబినేషన్స్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్‌మన్నాయి. ఫలితంగా వాటిని నమ్ముకొని డబ్బులు కుమ్మరించినవాళ్ల గల్లా పెట్టెలు ఖాళీ అయ్యాయి. బయ్యర్లను నిండా ముంచిన ఈ సినిమాలేవిటో ఒక్కసారి లుక్కేద్దాం.

అజ్ఞాతవాసి

పవన్ కల్యాణ్, త్రివిక్రం కాంబినేషన్ అంటే ఎలా ఉండాలి? ఒక ‘జల్సా’ లాగా, ఒక ‘అత్తారింటికి దారేది’ లాగా ఉండాలి. ఉంటుందనే ఆశతోటే ‘అజ్ఞాతవాసి’ సినిమాను కొంటానికి క్యూలు కట్టి ఏకంగా రూ. 128 కోట్లు కుమ్మరించారు బయ్యర్లు. ఏమైంది? ఇటు పవన్ కల్యాణ్, అటు త్రివిక్రం కెరీర్లలోనే అతిపెద్ద డిజాస్టర్‌గానే కాకుండా టాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా చెడ్డ పేరు తెచ్చుకుంది ‘అజ్ఞాతవాసి’. పెట్టుబడికి కేవలం 45 శాతమే రాబట్టిన ఈ సినిమా బయ్యర్లకు ఏకంగా రూ. 70 కోట్ల నష్టాన్ని మిగిల్చి వాళ్లను రోడ్డున పడేసింది. ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్ ‘ఖ్యాతి’ ఈ సినిమాదే.

2018 Tollywood Review: 10 Biggest Disasters

నా పేరు సూర్య

అమౌంట్ పరంగా చూస్తే ‘అజ్ఞాతవాసి’ తర్వాత స్థానం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాదే. అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి రూపొందించిన ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమా కోసం బయ్యర్లు రూ. 80 కోట్లు వెచ్చించారు. 62 శాతం రికవరీ సాధించిన ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల నష్టాల్ని చవి చూసింది. దాంతో బయ్యర్లు లబో దిబోమన్నారు. ఎంతో నమ్మకంతో బన్నీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు వంశీ.

2018 Tollywood Review: 10 Biggest Disasters

ఇంటిలిజెంట్

మాస్ డైరెక్టర్‌గా పేరుపొందిన వి.వి. వినాయక్ రూపకల్పనలో సినిమా అంటే ఎగిరి గంతేసి చేశాడు సాయిధరం తేజ్. విడుదల తర్వాత ఆ సంతోషం చప్పున చల్లారిపోయింది. సుమారు రూ. 28 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోగా, వసూలైంది కేవలం రూ. 4 కోట్లే. రూ. 24 కోట్లు హాంఫట్ ఆయిపోయాయి. అంటే ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు 15 శాతమే. 2017లో ‘ఖైదీ నంబర్ 150’తో తెచ్చుకున్న పేరును ఈ సినిమాతో పోగొట్టుకున్నాడు వినాయక్.

2018 Tollywood Review: 10 Biggest Disasters

ఆఫీసర్

‘శివ’ వంటి ట్రెండ్‌సెట్టర్‌ను ఇచ్చిన కాంబినేషన్ వాళ్లది. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసి మళ్లీ సినిమా చేస్తున్నారంటే ‘ఆఫీసర్’లో తప్పకుండా విషయం ఉంటుందని ప్రేక్షకులు భావించారు. ‘శివ’ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత బాగుంటుందనుకున్నారు. కానీ వాళ్ల ఆశల్ని నీరుకార్చేసింది ‘ఆఫీసర్’. బయ్యర్ల పెట్టుబడుల మాట సంగతి దేవుడెరుగు, వాళ్ల పై ఖర్చుల్ని కూడా రాబట్టలేక, రెండు లేదా మూడో రోజు నుంచే థియేటర్ల నుంచి ఈ సినిమా మాయమైంది. అత్యంత దారుణంగా కేవలం రూ. 1 కోటిని మాత్రమే వసూలు చేసి నవ్వులపాలయ్యింది. నాగార్జున కెరీర్‌లో అత్యంత ఘోరంగా ఫ్లాపైన సినిమాగా అపప్రథ మూటగట్టుకుంది.

2018 Tollywood Review: 10 Biggest Disasters

టచ్ చేసి చూడు

‘రాజా ద గ్రేట్’ సినిమా హిట్టవడంతో ‘టచ్ చేసి చూడు’ సినిమాకు మంచి ఆఫర్లతో ముందుకొచ్చారు బయ్యర్లు. ‘మిరపకాయ్’, ‘రేసుగుర్రం’ సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన విక్రం సిరికొండ డైరెక్టర్‌గా మారి రూపొందించిన ఈ సినిమాకు బయ్యర్లు రూ. 27 కోట్లు వెచ్చించారు. వాళ్ల ఆశల్ని నీరు కారుస్తూ ఈ సినిమా 35 శాతాన్నే రికవర్ చేసింది. అంటే రూ. 9.5 కోట్లు. వెరసి నష్టం రూ. 17.5 కోట్లు! దీంతో రవితేజ మార్కెట్ వాల్యూ బాగా పడిపోయింది.

2018 Tollywood Review: 10 Biggest Disasters

కృష్ణార్జున యుద్ధం

రవితేజకు మించి మార్కెట్ వాల్యూ సాధించిన నాని డబుల్ రోల్ చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’కు మేర్లపాక మురళి దర్శకుడు. దాంతో క్రేజ్‌కు కొదవేముంది! అందుకే అనూహ్యంగా ఈ సినిమాపై బయ్యర్లు రూ. 30 కోట్లు పెట్టారు. విడుదలయ్యాక చూస్తే ఏముంది? అంతా డొల్ల! పెట్టుబడిపై కేవలం 48 శాతమే అంటే రూ. 14.8 కోట్లే తిరిగొచ్చాయి. రూ. 15.2 కోట్లు హరీమన్నాయి. బయ్యర్లు గుండెలు బాదుకున్నారు.

2018 Tollywood Review: 10 Biggest Disasters

శ్రీనివాస కల్యాణం

నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ‘శతమానం భవతి’తో అందరి దృష్టినీ తనవేపుకు తిప్పుకున్న సతీశ్ వేగేశ్న. నాయకా నాయికలేమో నితిన్, రాశీ ఖన్నా. పైగా టైటిల్ ‘శ్రీనివాస కల్యాణం’. తిరుగుండదనుకున్నారు బయ్యర్లు. రూ. 27.5 కోట్లు దానిపై కుమ్మరించారు. కానీ ప్రేక్షకులు ఆ సినిమాను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఫలితం రూ. 12.9 కోట్లే వచ్చాయి. రూ. 14.6 కోట్లు పోయాయి. దిల్ రాజు అంచనాలు తప్పాయి.

2018 Tollywood Review: 10 Biggest Disasters

అమర్ అక్బర్ ఆంటోని

రవితేజకు ఈ ఏడాది ఏ రకంగానూ కలిసి రాలేదు. మూడు సినిమాలు విడుదలైతే అన్నీ దారుణంగా దెబ్బకొట్టాయి. వరుస ఫ్లాపులతో డంగైపోయి ఉన్న శ్రీను వైట్లను కసితో తీస్తాడని నమ్మి ‘అమర్ అక్బర్ ఆంటోని’ చేశాడు. అప్పటికే ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’ సినిమాలు పల్టీ కొట్టి ఉండటంతో ఈ సినిమాకు రూ. 20 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ కాలేదు. అయినా దాన్ని రికవర్ చేసుకోవడంలోనూ దారుణంగా దెబ్బతింది ఈ సినిమా. కేవల రూ. 6.2 కోట్లే రావడంతో, రూ. 13.8 కోట్లు నష్టపోయారు బయ్యర్లు.

2018 Tollywood Review: 10 Biggest Disasters

నోటా

‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయాడు. అందుకే ద్విభాషా చిత్రంగా రూపొందిన ‘నోటా’ను కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపారు. రూ. 23 కోట్లు దానిపై వెచ్చించారు. ఆనంద్ శంకర్ డైరెక్షన్ల్‌లో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా 42 శాతాన్నే రికవర్ చేసింది. అంటే కేవలం రూ. 9.8 కోట్లు. దాంతో 13.2 కోట్లు నష్టపోయారు బయ్యర్లు. కథల ఎంపికలో విజయ్‌ను హెచ్చరించిన సినిమా ఇది.

2018 Tollywood Review: 10 Biggest Disasters

సవ్యసాచి

నాగచైతన్య హీరోగా ‘కార్తికేయ’, ‘ప్రేమం’ చిత్రాల దర్శకుడు చందు మొండేటి రూపొందించిన ‘సవ్యసాచి’లో మాధవన్ నటించడం ఆసక్తిని రేకెత్తించింది. హీరో ఎడమ చెయ్యి కూడా ఒక పాత్రలా ఉంటుందని ప్రచారం జరగడంతో దీనిపై బయ్యర్లు రూ. 23 కోట్లు పెట్టారు. కథన లోపాలతో సినిమా నిరాశపరచడంతో 43 శాతమే తిరిగొచ్చింది. అంటే రూ. 9.9 కోట్లు. రూ. 13.1 కోట్ల్ లోటు తేలింది. నాగచైతన్య మార్కెట్ విలువను ఈ సినిమా ప్రభావితం చేసింది.