Airaa Teaser: Powerful And Intriguing Performance by Nayanthara

ఐరా టీజర్: నయనతార అద్భుతమైన ప్రదర్శన
లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ‘ఐరా’ అనే హర్రర్ సినిమా టీజర్ విడుదల చేసారు. లఘుచిత్రాల దర్శకుడు సార్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయన్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
“మళ్లీ ఆడపిల్ల పుట్టిందిరా! .. అయ్యో ఆడపిల్లా?!” అంటూ ఆరంభమై, ఒక నిమిషం 20 సెకనుల నిడివి కలిగిన ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిపోతుంది.
నయన్ ఒక పాత్రలో మోడ్రన్ గా, మరో పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా కనపడుతుంది. మోడ్రన్ నయన్ ధైర్యంగా కనపడుతుంటే, పల్లెటూరి నయన్ బేలగా కనపడుతుంది. “సంతోషంగా బతకడం అందరికీ ఒక కల, సంతోషమంటే ఏంటో తెలియని నాకు బతకడమే ఒక కల” అని అంటున్న పల్లెటూరి నయన్ ని చూస్తుంటే హృదయం కలిచివేస్తుంది.

‘‘నాకే తెలియని ఎవరో ఆరుగురు నా తలరాతను తలక్రిందులుగా రాశారు’’ అంటూ నయనతార ఆవేదన చెందటం ఆసక్తిని కలిగిస్తుంది. కొన్ని సన్నివేశాలలో దర్శకుడు ఒక సీతాకోకచిలుకపై ఫోకస్ చేయడం చూస్తుంటే, ఆ సీతాకోకచిలుకకు కథకు ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఎలాంటి సినిమాలోనైనా తన మార్కు నటనతో మెప్పించగల సత్తా ఉంది నయన్ కు. మొత్తానికి టీజర్ చూస్తుంటే సినిమా చూడాలనే ఆతృత కలుగుతుంది. ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్. రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు.
కలైయారసన్, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.