Balakrishna Just Looks Like NTR: Superstar Krishna

ఎన్టీఆర్‌లా బాలకృష్ణ వంద శాతం కనిపించారు: కృష్ణ
ఎన్టీఆర్ సినీ జీవిత గాథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ చిత్రానికి చిత్రసీమ నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటించగా క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి 11న సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు ప్రత్యేకంగా వీక్షించారు. కృష్ణ మాట్లాడుతూ “నందమూరి బాలకృష్ణ తీసిన యన్.టి.ఆర్. బయోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసినట్లు కాకుండా ఒక లైఫ్ చూసినట్టు అనిపించింది. ఎన్టీఆర్‌గారిలా బాలకృష్ణ వందశాతం కనిపించారు. ఆయన వేసిన అన్ని గెటప్స్‌లోనూ బావున్నారు. డెఫనెట్‌గా సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
విజయనిర్మల మాట్లాడుతూ “నాకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఎన్టీఆర్‌గారితో కలిసి ‘పాండురంగ మహత్యం’ చేశాను. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించాను. బయోపిక్ చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూస్తున్నట్లుండేలా బాలకృష్ణగారు నటించారు. సినిమా చాలా బావుంది” అన్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ డైరెక్టర్ బి.ఎ. సుబ్బారావుగా నటించిన నరేశ్ మాట్లాడుతూ “ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ అయినప్పుడు ఇందులో ఓ అవకాశం వస్తుందా! అని ఆసక్తిగా ఎదురుచూశాను. వేషం వేయాలని నన్ను అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. అది కూడా బి.ఎ. సుబ్బారావుగారి వేషం. ఆ సన్నివేశాలను చేస్తున్నప్పుడు థ్రిల్ ఫీలయ్యాను. దర్శకుడు క్రిష్ ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుండి లెజెండ్రీ డైరెక్టర్ అయ్యారు. బాలకృష్ణగారు మహానటుడిగా అవతరించారు. ఆయనకు హ్యాట్సాఫ్” అన్నారు.