Donga Ramudu: A Social Epic In Cinematic Art


Donga Ramudu: A Social Epic In Cinematic Art

దొంగరాముడు: సాంఘిక ఆణిముత్యం

తెలుగు సినిమాకు సంబంధించిన సుప్రసిద్ధ నిర్మాణ సంస్థల్లో ఒకటైన అన్నపూర్ణ పిక్చర్స్ ఏర్పడిన సంవత్సరం 1955. దాని అధినేత దుక్కిపాటి మధుసూదనరావు. ఆ బేనర్‌పై వచ్చిన తొలి సినిమా ‘దొంగరాముడు’ అధ్భుత విజయాన్ని సాధించి, సంస్థకు గట్టి పునాది వేసింది. విఖ్యాత దర్శకుడు కె.వి. రెడ్డి రూపొందించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి జంటగా నటించగా, విలక్షణ నటుడు ఆర్. నాగేశ్వరరావు విలన్‌గా కనిపించారు. ఏన్నార్, ఆర్. నాగేశ్వరరావుపై చిత్రీకరించిన ఫైట్‌ను అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు. అప్పటివరకూ సాంఘిక చిత్రాల్లో అలాంటి ఫైట్ సీన్ రాలేదన్నారు. అక్కినేని ‘దొంగరాముడు’ను సినిమా ఆర్ట్‌లో ఒక సోషల్ ఎపిక్‌గా అభివర్ణించారు. ఇందులోని పాటలన్నీ రసగుళికలే. ‘అందచందాల సొగసరివాడు..’, ‘చిగురాకులలో చిలకమ్మా..’, ‘భలే తాత మన బాపూజీ..’, ‘రావోయి మా ఇంటికి..’, ‘అనురాగము విరిసేనా..’ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.

కథేమిటంటే..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనారోగ్యవంతురాలైన తల్లికి మందు కొనడానికి డబ్బుల్లేక రాముడనే పిల్లవాడు దొంగతనం చేస్తూ పట్టుబడతాడు. జైలుకు వెళ్తాడు. ఈ లోగా తల్లి చనిపోతుంది. చెల్లెలు దిక్కులేక అనాథ శరణాలయంలో చేరుతుంది. జైలు నుంచి విడుదలైన రాముడు చెల్లెలి కోసం వెదుకుతాడు. తన అవతారం చూసి ఎవరూ దగ్గరకు రానివ్వక పోవడంతో సంపన్నుడి వేషం వేసుకొని, అనాథాశ్రమానికి వెళ్లి చెల్లెల్ని చూస్తాడు. డబ్బున్నవాడినని అబద్ధం చెప్పడం వల్ల చెల్లెలి కోసం మళ్లీ దొంగతనం చేయాల్సి వస్తుంది. దాంతో మళ్లీ దొరికి, మళ్లీ జైలుకు వెళ్తాడు. అతడికి దొంగరాముడనే పేరు స్థిరపడిపోతుంది. ఎక్కడ ఏ వస్తువు మాయమైనా నేరం అతడికే అంటగడతారు. ఆఖరుకి ఒక హత్యానేరానికి కూడా గురవుతాడు. ఎట్టకేలకు హంతకుడు దొరకడంతో రాముడు నిర్దోషి అని తేలుతుంది. అతని చెల్లెలు ఒక సంపన్నవంతుడైన డాక్టర్‌ను ప్రేమించి అతడ్ని పెళ్లి చేసుకుంటుంది. రాముడు అంతకు ముందు తనను ప్రేమించిన సీత అనే పేదింటమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.

Donga Ramudu: A Social Epic In Cinematic Art

దొంగరాముడిగా అక్కినేని నాగేశ్వరరావు నటనను చూసి తీరాల్సిందే. హాస్యాన్ని, విషాదాన్ని సమాన నేర్పుతో ఆయన పోషించిన తీరు అమోఘం. ఈ సినిమాకు ప్రధానాకర్షణ ఆయన నటనే. ఆయన తర్వాత రేలంగి వెంకటేశ్వరావును ప్రస్తావించాలి. పీనాసి భద్రయ్యగా తనకే సాధ్యమైన శైలిలో నటించి, హాస్యాన్ని పండించారు. ఎన్ని చిత్రాల్లో ఎన్ని పాత్రలు చేసినా, ప్రతిసారీ కొత్తగా హాస్య చేష్టలు చెయ్యడం ఆయనకే చెల్లు. రాముని చెల్లెలు లక్ష్మిగా జమున తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సీత పాత్రలో సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాలా! అక్కినేనికి సరిజోడీ! వంగర (పంతులుగారు), ఆర్. నాగేశ్వరరావు (రౌడీ బాబుల్), సూర్యకాంతం (భద్రయ్య భార్య), జగ్గయ్య (డాక్టర్) తమ తమ పాత్రల్ని ఉన్నత స్థాయిలో పోషించి సినిమా విజయంలో పాలు పంచుకున్నారు. డి.వి. నరసరాజు సంభాషణలు, సముద్రాల పాటలు, పెండ్యాల నాగేశ్వరరావు స్వరాలు ఉత్తమ స్థాయిలో సాగి బాగా ఆకట్టుకున్నాయి.

సంభాషణలు: డి.వి. నరసరాజు
పాటలు: సముద్రాల రాఘవాచార్య
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం: ఘంటసాల, పి. సుశీల, జిక్కి
ఛాయాగ్రహణం: ఆర్దషేర్ ఎం. ఇరాని
నిర్మాత: డి. మధుసూదనరావు
దర్శకుడు: కె.వి. రెడ్డి
బేనర్: అన్నపూర్ణా పిక్చర్స్
విడుదల తేది: 1 అక్టోబర్, 1955