F2: Most Perfect Scene


F2: Most Perfect Scene

ఎఫ్2: పర్ఫెక్ట్ సీన్

కొన్ని సినిమాల్లో కొన్ని సన్నివేశాలు మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. వాటిలో ఒకటి మరింత ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మనల్ని వెంటాడుతుంటుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’లో ఒక్కటేమిటి.. మనల్ని కట్టిపడేసే సన్నివేశాలు బోలెడున్నాయి. కుక్కతో వెంకీ సీన్ కానివ్వండి, వరుణ్ తేజ్ లుంగీ సీన్ కానివ్వండి, మెహరీన్ మూన్ వాక్ సీన్ కానివ్వండి, వై.విజయ, అన్నపూర్ణలతో వెంకీ సీన్ కానివ్వండి, రాజేంద్రప్రసాద్, హరితేజ కత్తి సీన్ కానివ్వండి.. ఎన్నని చెప్తాం! అయితే వీటితో పాటు ఇంకో సీన్ ఉంది. అది హనీ (మెహరీన్)తో వరుణ్ తేజ్ పెళ్లికి సిద్ధపడుతున్నప్పుడు వద్దని వెంకీ సలహా ఇచ్చే సీన్.

“ఇంకొక్కసారి ఆలోచించు బ్రో. పెళ్లి అవసరమా?” అంటాడు వెంకీ.

“నేను నీ లెక్క కాదు. పెండ్లాన్ని కంట్రోల్ చేసుడు నాకు మస్తు తెలుసు” అని చెప్తాడు వరుణ్ ఎంతో నమ్మకంగా.

“హేయ్” అని ఆశ్చర్యపోతూ, పక్కనున్న రఘుబాబుతో ‘చూశావా!’ అన్నట్లు వేలితో సైగ చేస్తాడు వెంకీ. ఇంకోసారి ఆ మాట చెప్పమంటాడు. వరుణ్ మళ్లీ అదే మాటను చెప్తే వెంకీ దాన్ని సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తాడు. దీన్ని పర్ఫెక్ట్ సీన్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదివరకు అదే సలహాను వెంకీకి రఘుబాబు ఇస్తాడు. ఇప్పుడు వరుణ్ చెప్పిన మాటల్నే అప్పుడు వెంకీ చెప్తే, రఘుబాబు దాన్ని వీడియో తీస్తాడు. అలా ఒక సీన్‌కు, ఇంకో సీన్‌ను లింక్ చేసి చూపించి, మంచి ఎఫెక్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి రాబట్టాడు. మంచి దర్శకుడి లక్షణాలు తనలో ఉన్నాయని ఈ సీన్ ద్వారా అతడు తెలియజేశాడు.