F2 Review: 4 Ups And 4 Downs


F2 Review: 4 Ups And 4 Downs

ఎఫ్2 రివ్యూ: నాలుగడుగులు ముందుకి, నాలుగడుగులు వెనక్కి

తారాగణం: వెంకటేశ్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, ప్రగతి, వెన్నెల కిశోర్

దర్శకుడు: అనిల్ రావిపూడి

విడుదల తేది: 12 జనవరి 2019

పూర్తి స్థాయి హాస్య చిత్రాలు ఈ మధ్య కాలంలో తెలుగులో తక్కువగా వస్తున్నాయి. దిల్ రాజు నిర్మించిన ‘ఎఫ్2’ సమగ్ర హాస్య చిత్రంగా ప్రచారం పొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కథ తక్కువ. పెళ్లయ్యాక మగవాళ్లని ఆడవాళ్లు తమ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆడిస్తారనే హీరోల అభిప్రాయం మీద, వాళ్ల పాత్రల చిత్రణ మీద ఆధారపడి సన్నివేశాల్ని కల్పించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ పాత్రల చిత్రణే ఇందులో ప్రధానం కానీ, కథను నడిపించిన తీరు ప్రధానం కాదు.

కథ

ఎమ్మెల్యేకి పిఏ అయిన వెంకీ (వెంకటేశ్) అనే అనాథ యువకుడికి, హారిక (తమన్నా) అనే ఒక ఉద్యోగినికి పెళ్లవుతుంది. అత్త, ఆడబిడ్డల పోరు ఉండదనే ఉద్దేశంతోనే వెంకీని హారిక పెళ్లి చేసుకుంటుంది. అక్కడ్నుంచి హారిక, ఆమె తల్లి, హారిక అమ్మమ్మ నాయనమ్మల పోరు మొదలవుతుంది వెంకీకి. హారిక కొద్ది రోజుల పాటు ప్రేమగా బాగానే ఉన్నా, తర్వాత తను చెప్పినట్లు నడచుకోవాలన్నట్లు ప్రవర్తిస్తుండటంతో వెంకీలో ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. హారిక చెల్లెలు హనీ (మెహరీన్), బోరబండకు చెందిన వరుణ్ (వరుణ్ తేజ్) అనే మాస్ కుర్రాడు ప్రేమించుకుంటారు. ఆ ఇద్దరి నిశ్చితార్థ సమయానికి ఆ కుటుంబం పరిస్థితి వరుణ్‌కు అర్థమవుతుంది. తన తల్లికి విలువ ఇవ్వకుండా వాళ్లకే విలువ ఎక్కువ ఇవ్వాల్సి రావడంతో అతడూ ఫ్రస్ట్రేషన్లో పడతాడు. పెళ్లి సమయం వస్తుంది. కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సి ఉండగా, వెంకీ ఇంటెదురుగా ఉండే వ్యక్తి (రాజేద్రప్రసాద్) సలహా మేరకు ముగ్గురూ కలిసి యూరప్‌కు చెక్కేస్తారు. హనీ పెళ్లి ఆగిపోతుంది. కథ యూరప్‌కు షిఫ్టవుతుంది. హనీ, వరుణ్ పెళ్లి కథ ఏమయ్యింది? హారిక, వెంకీ మళ్లీ ఒకటయ్యారా, లేదా? అనేది మిగతా కథ.

F2 Review: 4 Ups And 4 Downs

కథనం

ప్రథమార్థమంతా ఎంత హిలేరియస్‌గా నవ్విస్తుందో, సెకండాఫ్ కంగాళీగా మారి అంత ఫ్రస్ట్రేషన్ పుట్టిస్తుంది. నేడు భార్యాభర్తల, కుటుంబ బంధాలు పలుచనువుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆధిపత్య ధోరణిని విడనాడి హాయిగా సంసారం చేసుకోవాలనే మంచి పాయింట్ మీద ఈ సినిమాని నడిపించాలనేది దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయత్నం. ఫస్టాఫ్‌లో అతడు కల్పించిన సన్నివేశాలు, సంభాషణలకు పొట్టచెక్కలయ్యేలా పడీ పడీ నవ్వుతాం. సెకండాఫ్‌లో కథను ఎలా నడిపించాలనే విషయంలో దర్శకుడు గందరగోళానికి గురయ్యాడు. దాంతో సన్నివేశాల్నీ, కథా గమనాన్నీ కంగాళీ చేసేశాడు.

పెళ్లయినవాళ్లు మరొక పెళ్లి చేసుకోవాలంటే లీగల్‌గా విడిపోవాలనేది ఎవరికైనా తెలిసిన విషయమే. కానీ ఇందులో హారికకు కానీ, వాళ్ల కుటుంబానికి కానీ, ఆమెను రెండో పెళ్లి చేసుకోడానికి సిద్ధమైన వాళ్లకు కానీ, ఆఖరుకి భర్త అయిన వెంకీకి కానీ స్ఫురించకపోవడం హాస్యాస్పదం. ఎంత నవ్వుల కోసమే కల్పించిన కథయినా, చిన్నపాటి వాస్తవిక అంశాలను విస్మరించడం నిర్లక్ష్యం కిందకే వస్తుంది.

సెకండాఫ్ అంతా తప్పులమయమే. తమ ఆధిపత్య ధోరణి కారణంగానే వెంకీ, వరుణ్ దూరంగా వెళ్లిపోయరని హారిక కానీ, హనీ కానీ రియలైజ్ కారు. తమ తప్పు తెలుసుకున్నామని వాళ్లెక్కడా చెప్పరు. తప్పంతా వాళ్లను వదిలి యూరప్ వెళ్లిన వెంకీ, వరుణ్‌దేనన్నట్లు కథ నడిపించి ఏకపక్షంగా వ్యవహరించాడు దర్శకుడు.

ఫస్టాఫ్‌లో హారిక, హనీ ప్రవర్తించే తీరులో దోషముందని మనకు తెలుస్తూనే ఉంటుంది. హాస్య సన్నివేశాలు, సంభాషణలతో వాళ్ల తీరుని కూడా మనం ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడైతే వాళ్ల జీవితాలు కుదుపుకు గురయ్యాయో అప్పుడు వాళ్లు వేరే పెళ్లిళ్లు చేసుకోడానికి సిద్ధమవుతారు. ఇది ప్రేక్షకులకీ కుదుపే. వాళ్లు పెళ్లి నాటకం ఆడుతున్నారని మనకు అనిపిస్తూనే ఉంటుంది కానీ, తాము తప్పు చేశామని చివరలోనూ ఫీలవరు.

F2 Review: 4 Ups And 4 Downs

‘గుండమ్మ కథ’లో ఎస్వీ రంగారావులా తన ఇద్దరు కొడుకులను అక్కచెల్లెళ్లకు ఇచ్చి పెళ్లి చెయ్యాలనే సంకల్పం ఉన్నవాడిగా ప్రకాశ్‌రాజ్ కేరక్టర్‌ను దర్శకుడు మనకు పరిచయం చేస్తాడు. ఇదివరకు ఒకసారి అలాంటి ఒక సంబంధం చెయ్యాలని చూసి, వారిలో చెల్లెలు ఒప్పుకోకపోవడంతో ఆ సంబంధాన్ని కేన్సిల్ చేసుకుంటాడు ప్రకాశ్‌రాజ్. ఇప్పుడు హారికకు పెళ్లయ్యిందని తెలిసీ, చట్టపరంగా ఆమె వెంకీతో విడిపోలేదనీ తెలిసీ ఎలా సంబంధానికి ఒప్పుకుంటాడనేది అర్థం కాదు. ఆ పాత్రను కూడా దర్శకుడు ఒక బఫూన్ లాగా వాడుకున్నాడు. హారిక, హనీల పెళ్లి ప్లాన్‌ను చెడగొట్టడానికి, తాము ప్రకాశ్‌రాజ్ బయోగ్రఫీ రాస్తామంటూ అతడి ఇంట్లో వెంకీ, వరుణ్ చోటు సంపాదించడం, తదనంతరం వచ్చే సన్నివేశాలు నవ్వుకంటే అపహాస్యాన్నే ఎక్కువ కలిగించాయి.

ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో దర్శకుడి పనితనం కనిపిస్తుంది. కుక్కతో వెంకీ తన ఫ్రస్ట్రేషన్ చెప్పుకోవడం, కరవబోయిన ఆ కుక్క అతడి బాధలు విని చల్లారిపోయి సానుభూతితో దీనంగా ముఖంపెట్టి పడుకోవడం విపరీతంగా నవ్విస్తుంది. అలాగే వరుణ్ లుంగీ సీన్. పొద్దున్నే మేడపై వరుణ్ లుంగీ తీసేసి కనిపిస్తున్నాడనీ, దీనివల్ల చుట్టుపక్కల ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్నారని అక్కడివాళ్లు పోలీసు కంప్లయింట్ ఇస్తే, ఎస్సై వచ్చి దబాయిస్తే, అక్కడ కూడా వరుణ్ లుంగీ తీసి, లోపలి నిక్కరు చూపించే సన్నివేశం తెగ నవ్విస్తుంది. అలాగే వెంకటేశ్, అన్నపూర్ణ, వై విజయపై చిత్రీకరించిన సన్నివేశం కూడా.

క్లైమాక్స్ కోసం వెన్నెల కిశోర్ పాత్రను దర్శకుడు ప్రవేశపెట్టాడు. అతడి సన్నివేశాలు హాస్యం కోసం ఉద్దేశించినవి అయినా అవి నవ్వు తెప్పించలేదు. ప్రకాశ్‌రాజ్ కొడుకులుగా చేసిన సుబ్బరాజు, సత్యం రాజేశ్‌లతో బికినీలు వేసుకొని స్విమ్మిగ్ పూల్‌లో హారిక, హనీ ఈత కొట్టే సన్నివేశం ఎబ్బెట్టుగా ఉంది. వాళ్లతో హారిక, హనీల పెళ్లి చెడగొట్టడానికి వెంకీ, వరుణ్ చేసే ప్రయత్నాలు వాళ్లకే ఎదురు తిరగడం మెప్పించదు. ఎవరిపై ఫ్రస్ట్రేషన్‌తో ఆనందంగా గడపడానికి యూరప్ వచ్చారో వాళ్ల కోసం వెంకీ, వరుణ్‌లు పదే పదే ఓడిపోవడం స్క్రీన్‌ప్లే పరంగా సరికాదు.

పాత్రధారుల అభినయం

నిస్సందేహంగా ఇది వెంకటేశ్ సినిమా. ఫ్రస్ట్రేషన్‌తో సతమతమవుతూ నవ్వు తెప్పించే పాత్రలో ఆయన చెలరేగిపోయాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా నవ్వించేది ఆయనే. తన బాడీ లాంగ్వేజ్, హావభావ విన్యాసాలు, డైలాగులతో ఆయన చక్కని వినోదాన్ని పంచారు. వయసులో తమన్నా తనకంటే చాలా చిన్నదైనా ఆమెతో వెంకీ కెమిస్ట్రీ బాగా పండింది. ఇప్పటివరకూ చేయని వినోదాత్మక పాత్రలో వరుణ్ కూడా రాణించాడు. ఫ్రస్ట్రేషన్‌ను బాగా చూపించాడు. చక్కని అభినయం ప్రదర్శించాడు.

F2 still

తమన్నా, మెహరీన్‌లలో తమన్నా బెస్ట్. భిన్న పరిస్థితులకు తగిన ఎక్స్‌ప్రెషన్స్‌లో మెచ్యూర్డ్‌గా చేసింది. అలాగే ఎక్స్‌పోజింగ్‌లో మెహరీన్‌ను మించిపోయింది. మెహరీన్ తన పాత్రకు తగినట్లు చేయడానికి కృషి చేసింది. కానీ పాత్ర ధోరణి వల్ల ఆమె నటన అలరించలేదు. ఆమె ముఖం కూడా అందంగా కనిపించలేదు.

పైకి భార్యా విధేయుడిగా కనిపిస్తూ, వెంకీకీ, హారిక కుటుంబానికీ మధ్య పుల్లలు పెట్టే ఎదురింటి వ్యక్తి పాత్రలో రాజేంద్రప్రసాద్ విశేషంగా రాణించాడు. అయితే ఆయన భార్యగా ఒక చిన్న నటిని (‘శతమానం భవతి’లో నరేశ్ భార్యగా చేసినామె) పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అతడికి రెండో భార్య ఉన్నదని వెంకీ బయటపెట్టేసరికి తేలు కుట్టినవాడిలా దొరికిపోతాడు. యూరప్‌లో హరితేజను బుట్టలో పెట్టాలని యత్నించడం, ఆమె తన భర్తను చంపమని పురమాయించేసరికి భయపడి తప్పించుకోవాలని చూడటం నవ్వు తెప్పిస్తుంది.

ప్రకాశ్‌రాజ్ తన ఇమేజ్‌కు తగని పాత్రను ఇందులో పోషించాడు. ఆ పాత్రలో మరే నటుడున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. వియ్యపురాళ్లుగా అన్నపూర్ణ, వై విజయ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. వెంకీ, వరుణ్‌లకు ఫ్రస్ట్రేషన్ కలిగించడంలో తమ పనిని సక్రమంగా నిర్వర్తించారు. హారిక, హనీల తల్లిగా ప్రగతి పూర్తి స్థాయి పాత్రను బాగా చేసింది. ఆమె భర్తగా ‘నాలుగు స్తంభాలాట’ ప్రదీప్ సరిగ్గా సరిపోయాడు. భార్య అన్న మాటకు తలూపుతూ “అంతేగా.. అంతేగా” అంటూ అతడు చెప్పే డైలాగ్ వినోదాన్నిస్తుంది. సినిమా మొత్తమ్మీద ఆ మాట తప్ప మరో మాట ఆయన నోట వినిపించదు.

చివరి మాట

ఫస్టాఫ్ ఫన్, సెకండాఫ్ ఫ్రస్ట్రేషన్ కలిగించే సినిమా

  • బుద్ధి యజ్ఞమూర్తి