F2: Venky Is Back With A Bang!


F2: Venky Is Back With A Bang!

ఎఫ్2: మళ్లీ అప్పటి వెంకీ కనిపించాడు!

‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘నమో వెంకటేశ’ సినిమాల్లో వెంకటేశ్ చేసిన అల్లరి గుర్తుందా? ఆ సినిమాల్లో వెంకీ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ప్రదర్శించిన హావభావాలు కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఎంతటి హాస్యాన్ని పంచాయో! ‘నమో వెంకటేశ’ తర్వాత మళ్లీ వెంకీ నుంచి మంచి హాస్యభరిత చిత్రం రాలేదు. ఆ లోటును అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ తీర్చింది. చాన్నాళ్ల తర్వాత తనకు లభించిన చక్కని వినోదాత్మక పాత్రలో ఆయన చెలరేగిపోయాడు. వెంకీ కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. దాన్ని డైరెక్టర్ బాగా పట్టుకున్నాడు. ఆయన చేత ‘వెంకీ ఆసనం’ వేయించాడు. ఆ ఆసనం జనాల్లో క్రేజ్ సృష్టించిందని చెప్పాలి. ఫ్రస్ట్రేషన్‌కు గురైనప్పుడల్లా ఆయన ‘వెంకీ ఆసనం’ వేస్తూ తెగ నవ్వించారు.

రఘుబాబు కాంబినేషన్‌తో ఆయన చేసిన అల్లరి ఎంతగా నవ్వించిందో, కొన్ని సన్నివేశాల్లో ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ అంతగానూ నవ్వించింది. ఉదాహరణకు హారిక (తమన్నా)తో పెళ్లి సీన్‌లో పురోహితుడు “ఆఖరిసారి నవ్వుకొని తాళికట్టు నాయనా” అంటే ఆయనిచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కు నవ్వాగదు. అలాగే వై. విజయ, అన్నపూర్ణ కాంబినేషన్‌లో చేసిన సన్నివేశంలో అన్నపూర్ణ “అట్టా ఏడిపిచ్చకపోతే దాని (హారిక) కడుపున ఓ కాయ కాయించొచ్చుగా” అని చేతులు ఝాడించి విదిలిస్తుంది. దానికి వెంకీ “24 గంటలూ మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలెక్కడ కాస్తాయ్ నీ తలకాయ్” అని అంతే విసురుగా చేతులు ఝాడించి విదిలించి కొడతాడు. అప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్‌కీ, ఆ డైలాగ్‌ను ఆయన చెప్పిన తీరుకీ థియేటర్లలో నవ్వుల సందడే. వరుణ్, హనీ (మెహరీన్) పెళ్లి చూపుల్లో హారిక తండ్రి (ప్రదీప్) “అంతేగా.. అంతేగా” అనే మేనరిజం తన నోటివెంట యథాలాపంగా వచ్చినప్పుడు వెంకీ పెట్టిన ఫీలింగ్స్‌కు నవ్వలేక పొట్టచెక్కలవుతుంది. సెకండాఫ్‌లో డైరెక్టర్ పట్టు సడలించాడు కానీ, లేకపోతే వెంకీ మరింతగా నవ్వులు పంచేవాడే. మొత్తానికి చాలా కాలానికి ఆయన నుంచి పసందైన కామెడీని ఆస్వాదించగలిగాం.