I Have No Intention To Join Politics: Ajith Kumar


I Have No Intention To Join Politics: Ajith Kumar

నాకు రాజకీయాల్లో చేరే ఆలోచనలు ఏ కోశానా లేవు: తమిళ టాప్ హీరో అజిత్

రాజకీయలతో తనకెలాంటి సంబంధాలు లేవని తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అజిత్‌కుమార్ స్పష్టం చేశారు. తనకు రాజకీయాలతో సంబంధాలు అంటగడుతూ ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తను నటనను వృత్తిగా భావించి సినిమాల్లోకి వచ్చాననీ, ఏ రాజకీయ ఆకాంక్షలతోనో రాలేదనీ ఆయన తెలిపారు. ఆయన తాజా చిత్రం ‘విశ్వాసం’ తమిళనాట విజయ దుందుభి మోగిస్తూ, రజనీకాంత్ సినిమా ‘పేట’కు గట్టి పోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు సినిమాల బాక్సాఫీస్ వసూళ్లపై అంతర్జాలంలో రభస జరుగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అజిత్ రాజకీయ రంగంలోకి అడుగుపెడతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అజిత్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన చెప్పిన  విషయాలు ఆయన మాటల్లోనే…

“ఇప్పటికే మీ అందరికీ తెలుసు.. వ్యక్తిగతంగా కానీ, సినిమాల ద్వారా కానీ రాజకీయాలతో, రాజకీయ పార్టీలతో లేదా వాటి నాయకులతో నాకెలాంటి సంబంధాలు లేవని. దీన్నిబట్టి నటన అనేదొక్కటే నా వృత్తి అనేది స్పష్టం. నిజానికి కొన్నేళ్ల క్రితం, ఈ కారణంగానే నా అభిమాన సంఘాలన్నింటినీ తొలగించేశాను. ఏ సందర్భంలోనైనా నేను కానీ, నా అభిమానులు కానీ, నా అభిమాన సంఘాలు కానీ రాజకీయాలకు దూరమని చెప్పడమే దాని ఉద్దేశం. నా నిర్ణయం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ, కొన్ని రాజకీయ సంస్థలతో నాకూ, నా అభిమానులకూ సంబంధాన్ని అంటగడుతూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు రానున్న ప్రస్తుత సమయంలో అలాంటి నిరాధార వార్తలు నాకు రాజకీయ ఆకాంక్షలున్నాయంటూ తప్పుడు సంకేతాల్ని పంపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయాల్లో చేరే ఉద్దేశం కానీ, ఆకాంక్ష కానీ నాకు లేదని స్పష్టం చేయదలచుకున్నాను. రాజకీయలతో నాకున్న ఒకే ఒక్క ఉత్తమ సంబంధం, ఒక భారతీయ పౌరుడిగా నా ఓటు హక్కు వినియోగించుకోడానికి క్యూలో నిల్చోవడమే. నేనెప్పుడూ ఒక నిర్ధిష్ట రాజకీయ పార్టీకి తమ ఓటు వెయ్యమని నా అభిమానుల్ని బలవంత పెట్టలేదు. మునుముందు కూడా ఆ పని చెయ్యను. నేను ఏ రాజకీయ ఆకాంక్షలతోనో, ఎవరితోనో పోటీపడాలనో సినిమాల్లోకి రాలేదు. నటనను ఒక వృత్తిగా భావించి వచ్చాను. ఈ విషయం నా అభిమానులకు ఎప్పటికప్పుడు చెబ్తూనే ఉన్నా. రాజకీయ సంబంధాలున్న ఏ సంస్థతోనూ నేను అసోసియేట్ కాను, నా అభిమానులూ అలాగే ఉండాలని కోరుకుంటాను. ఆన్‌లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఇతర నటులను, విమర్శకులను కించపరిచే, దూషించే వైఖరిని నేను సపోర్ట్ చెయ్యను. అలాంటివాటిని లోకం మర్చిపోదు, మనల్ని నిశితంగా గమనిస్తుంటుంది.

రాజకీయాల్లోనూ నాకంటూ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉన్నాయి. అయినప్పటికీ, నా రాజకీయ ప్రాధాన్యాలను ఎవరిపైనా నేనెప్పుడూ రుద్దలేదు. నా అభిమానుల నుంచి కూడా ఇదే ఆశిస్తున్నా. ఒకరి వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యాలను ప్రైవేటుగానే ఉంచడం మంచిది. ఏ రాజకీయ పార్టీ కానీ, సంస్థ కానీ నా పేరును లేదా నా ఫొటోను ఉపయోగించడాన్ని పూర్తిగా ఖండిస్తాను.

నా అభిమానులను నేను అభ్యర్థించేదేమంటే.. స్టూడెంట్లు తమ దృష్టిని పూర్తిగా చదువుపై కేంద్రీకరించండి. వ్యాపారాల్లో, సేవా రంగాల్లో ఉన్నవాళ్లు తమ విధుల్ని నిజాయితీగా నిర్వర్తించండి. దేశంలోని చట్టాలను గౌరవిస్తూ, వాటికి లోబడి ఉండండి. తమ సొంత ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ వైమనస్యాలను వదిలించుకోవడం ద్వారా ఐకమత్యంతో ఉండండి. అవే మీరు నాపై చూపించే ప్రేమగా భావిస్తాను.

బతకండి, బతకనివ్వండి.

మీ

అజిత్‌కుమార్”