Jersey Teaser Promises A Different Nani


Jersey Teaser Promises A Different Nani

‘జెర్సీ’ టీజర్: సరికొత్తగా ఆవిష్కృతమైన నాని

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తోన్న ‘జెర్సీ’ సినిమా టీజర్ జనవరి 12న యూట్యూబ్‌లో విడుదలైంది. ఒక్క రోజులో 1.47 మిలియన్ వ్యూస్ వచ్చిన ఈ టీజర్‌లో 36 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా రాణించాలని కలలు కంటున్న ఒక వ్యక్తి ఆరాట పోరాటాలు తెలుస్తున్నాయి.

“నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైరయ్యే ఏజ్” అని ఎవరో అంటుంటే ఖాళీగా ఉన్న క్రికెట్ స్టేడియంలో కూర్చొని గ్రౌండ్ వైపు చూస్తున్న అర్జున్‌ను వెనుక నుంచి చూపించారు. దాన్ని బట్టి ఆ క్రికెట్ గ్రౌండే అతడి లక్ష్యమని తెలుసుకోవచ్చు. “పిల్లల్నాడించే వయసులో మనకు ఆటలేంది బావా.. అని ఎవరో నేపథ్యంలో అంటుంటే నాని చలిమంట పొగల మధ్య రన్నింగ్ చేస్తూ కనిపిస్తాడు. బహుశా ఆ మాటలు ఎవరో ఫ్రెండ్ అన్నవి కావచ్చనిపిస్తుంది. “బావా.. బావా” అని పిలుచుకొనేది ఫ్రెండ్సే కదా. లేదంటే అప్పటికే అర్జున్‌కు పెళ్లయి, బావమరిది చెప్తున్నవి కూడా కావచ్చు.

ఆ తర్వాత క్రికెట్ పిచ్‌ను తయారు చేసే సీన్. ఆ పైన ఇంట్లో అర్జున్ సాధించిన కొన్ని కప్పులు, మెమెంటోల మీద కెమెరా ఫోకస్ చేస్తుండగా నేపథ్యంలో ఒక ఆడగొంతు “ఎంత ప్రయత్నించినా ఇప్పుడు నువ్వేం చెయ్యలేవు” అంటుంది. అది హీరోయిన్ గొంతుగా మనం ఊహించవచ్చు.

“యు చేజింగ్ ఎ యూజ్‌లెస్ డ్రీమ్.. యు ఆర్ ఎ లూజర్ ఇన్ ఆల్ యువర్ లైఫ్” అని ఎవరో చెప్తుంటే క్రికెటర్‌గా అర్జున్ పెద్ద కప్పు పట్టుకొని ఉన్న ఫొటోను క్రికెట్ బాల్‌తో ఎవరో పగలగొడతారు. ఆ తర్వాత అర్జున్ బ్యాటింగ్ చేస్తూ కొట్టిన షాట్‌కు బాల్ స్టేడియం బయట పార్క్ చేసి ఉన్న కారు అద్దాన్ని పగలగొడుతూ దాంట్లోకి వెళ్లి పడుతుంది. అంపైర్ సిక్స్ సిగ్నల్ ఇస్తుండగా, అర్జున్ పిచ్‌పై బ్యాట్ పట్టుకొని నడుస్తూ, సాధించాననే సంతోషంతో ‘యెస్’ అన్నట్లు చేతిని గుప్పిట పట్టి ఊపుతాడు. ఒక చేత్తో హెల్మెట్ తీసి, ఇంకో చేత్తో బ్యాట్ పైకెత్తి చూపుతుండగా “ఆపేసి ఓడిపోయినోడున్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు లేడు” అనే అతడి మాటలు నేపథ్యంలో వినిపిస్తాయి.

అంటే అందరూ యూజ్‌లెస్ డ్రీమ్ గా అనుకొనే తన డ్రీమ్ ను సక్సెస్‌ఫుల్‌గా ఛేదించిన ఒక క్రికెటర్ విజయ గాథగా ‘జెర్సీ’ని చెప్పుకోవాలి. రాష్ట్రం తరపునో, దేశం తరపునో ఆడటానికి జెర్సీని ధరించాలనేది ప్రతి ఆటగాడి కల. అలా తనూ ఒక జట్టు తరపున జెర్సీని ధరించాలని కలలు కని. ఆ కలను సాకారం చేసుకున్న 36 ఏళ్ల అర్జున్ కథ ఇది. అర్జున్‌గా నాని నటిస్తున్న ఈ సినిమాలో అతడి సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనున్నది. ఈ సినిమాతో నాని సరికొత్తగా మన ముందు ఆవిష్కృతం కానున్నాడనేది నిజం. ఈ టీజర్‌తో అతడిపై అంచనాలూ పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.