Minor Movie Appearances Made By Massive Stars


Minor Movie Appearances Made By Massive Stars

మైనర్ కేరెక్టర్లు చేసిన మాస్ స్టార్లు!

వాళ్లు మెగాస్టార్లు, సూపర్‌స్టార్లు, పవర్‌స్టార్లు, స్టైలిష్ స్టార్లు.. మాస్‌లో తిరుగులేని హీరోలు.. అయినా కొన్ని సందర్భాల్లో, వేరే హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు లేదంటే స్పెషల్ అప్పీరెన్సులూ ఇచ్చారు.. పాటల్లో డాన్సులు చేశారు. అభిమానుల్ని అలరించారు. ఆ సినిమాల దర్శకుల కోసమో, నిర్మాతల కోసమో లేదంటే తోటి హీరోల కోసమో వాళ్లవి చేశారు. అలాంటి మాస్ స్టార్లెవరో చూద్దాం.

చిరంజీవి

కొడుకు రాంచరణ్ కోసం రెండు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో దర్శనమిచ్చారు చిరంజీవి. మొదట యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘మగధీర’లో ‘బంగారు కోడిపెట్ట’ పాట రీమేక్‌లో చరణ్‌తో కలిసి స్టెప్పులేశారు. తర్వాత శ్రీను వైట్ల రూపొందించిన ‘బ్రూస్ లీ’ సినిమా క్లైమాక్స్‌లో ఫైట్ చేసి, హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ను విలన్ గ్యాంగ్ నుంచి కాపాడారు. వీటికంటే ముందు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘హ్యాండ్స్ అప్’ సినిమాలో జయసుధ భర్తగా మెరుపులా కనిపించారు. లారెన్స్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘స్టైల్’ క్లైమాక్స్‌లో విలన్‌ను చితగ్గొట్టి హీరోను ఆదుకున్నారు.

Minor Movie Appearances Made By Massive Stars
బాలకృష్ణ

బాలకృష్ణ చిన్న పాత్రల్లో కనిపించిన సందర్భం ఒకటే కనిపిస్తుంది. అది వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన ‘త్రిమూర్తులు’ చిత్రంలో. ఒక సీక్వెన్స్‌లో టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తరలి వస్తారు. బాలకృష్ణ కూడా. చిరంజీవీ అందులో ఉన్నారు. ఆ తర్వాత ఆయన స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు కానీ, మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ చిత్రంలో ఒక శక్తిమంతమైన ప్రత్యేక పాత్రను చేశారు. తాజాగా శివ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఒక కన్నడ సినిమాలో ఆయన నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Minor Movie Appearances Made By Massive Stars
నాగార్జున

సమకాలీన హీరోల్లో ఎక్కువ గెస్ట్ అప్పీరెన్సులూ, స్పెషల్ అప్పీరెన్సులూ ఇచ్చిన హీరో నాగార్జున. ‘ప్రేమం’లో నాగచైతన్య తండ్రిగా కనిపించిన ఆయన, అనుష్క ‘సైజ్ జీరో’లో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. చిన్నకొడుకు కోసం ‘అఖిల్’లో ‘అక్కినేని అక్కినేని..’ పాటలో స్టెప్పులేశారు. మంచు లక్ష్మి ‘దొంగాట’లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి, భూమిక ‘తకిట తకిట’లో నాగ్‌గానే కనిపించారు. ‘స్టైల్’ సినిమా క్లైమాక్స్‌లో హీరోని కాపాడారు. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఘటోత్కచుడు’లోనూ, తండ్రి సినిమా ‘రావుగారిల్లు’లోనూ అలా కనిపించి ఇలా మాయమయ్యారు.

Minor Movie Appearances Made By Massive Stars
వెంకటేశ్

భేషజాలు లేకుండా నటించే హీరోగా పేరున్న వెంకటేశ్ సైతం ఇటీవలి కాలంలో కొన్ని స్పెషల్ రోల్స్ చేశారు. తన కోసం ‘గోపాల గోపాల’ సినిమా చేసిన పవన్ కల్యాణ్ కోసం ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో గురువుగా నటించారు. ‘ప్రేమం’లో నాగచైతన్యకు పోలీస్ మావయ్యగా కనిపించారు. ‘కృష్ణం వందే జగద్గురుం’లో బళ్లారి బాబుగా స్పెషల్ డాన్సులేశారు. రవిబాబు సినిమా ‘సోగ్గాడు’లోనూ, జంధ్యాల సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’లోనూ తన నిజ జీవిత పాత్రలోనే కనిపించారు.

Minor Movie Appearances Made By Massive Stars
పవన్ కల్యాణ్

వెంకటేశ్ సినిమా ‘గోపాల గోపాల’లో ప్రత్యేక పాత్ర చేశారు పవన్ కల్యాణ్. ఆయన చేసిన ప్రత్యేక పాత్ర అదొక్కటే. కాకపోతే అన్నయ్య చిరంజీవి సినిమాలు ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రాల్లో గెస్ట్ అప్పీరెన్స్‌లిచ్చారు.

Minor Movie Appearances Made By Massive Stars
జూనియర్ ఎన్టీఆర్

ఇప్పటివరకూ ఒకే సినిమాలో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. అది వెంకటేశ్ సినిమా ‘చింతకాయల రవి’. అందులో ‘షావా షావా..’ పాటలో స్టెప్పులేశారు.

అలాగే అల్లు అర్జున్ ‘శంకర్‌దాదా జిందాబాద్’లో ఒక పాటలోనూ, రాంచరణ్ ‘ఖైదీ నంబర్ 1’లో పాటలోనూ కనిపించారు. ప్రభాస్ తెలుగులో చేయలేదు కానీ ప్రభుదేవా డైరెక్ట్ చేసిన హిందీ సినిమా ‘యాక్షన్ జాక్సన్’లో ఒక పాటలో కనిపించి మాయమయ్యారు. మాస్ స్టార్లలో ఇప్పటివరకూ ఎక్కడా ప్రత్యేక పాత్రలో కనిపించని స్టార్ ఒక్క మహేశ్ మాత్రమే. కాకపోతే నాలుగు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అవి.. ‘జల్సా’, ‘బాద్‌షా’, ‘శ్రీ శ్రీ’, ‘మనసుకు నచ్చింది’ సినిమాలు.