Mr Majnu: The Most Perfect Scene!


Mr Majnu: The Most Perfect Scene!

మిస్టర్ మజ్ను: పర్ఫెక్ట్ సీన్!

ఓవరాల్‌గా సినిమా ఎలా ఉన్నా, ఒక్కో సినిమాలో కొన్ని సన్నివేశాలు కానీ, ఒక సన్నివేశం కానీ చాలా బాగా వస్తుంది. నిజానికి దర్శకుడు సినిమాలోని అన్ని సన్నివేశాల్నీ ఒకే విధంగా ప్రేమించాలి, ఒకే కన్విక్షన్‌తో తియ్యాలి. చాలా మంది అలాగే తీస్తారు కూడా. అయితే కొన్ని సన్నివేశాలు బాగా కుదురుతాయి. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో ఒక సన్నివేశం అలాగే మనల్ని కట్టిపడేస్తుంది. నిజానికి అది ఒక సన్నివేశం కాదు, ఒక ఎపిసోడ్. పెళ్లి ఎపిసోడ్. హీరో హీరోయిన్లది కాదు. హీరో విక్కీ చెల్లెలు (బాబాయ్ కూతురు), హీరోయిన్ నిక్కీ అన్న కిశోర్ (రాజా) పెళ్లి ఎపిసోడ్. విక్కీ బాబాయ్ (రావు రమేశ్) పెళ్లి పనుల్లో ఉండగా అతడికి రూ 25 కోట్లు అప్పిచ్చినతను (అజయ్) తన మనుషులతో ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. అప్పటికప్పుడు తన బాకీ సెటిల్ చెయ్యమంటాడు.

దిక్కుతోచని బాబాయ్ ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకం పెడతాడు. అతని కొడుకును కూడా సంతకం పెట్టమంటే, ఆ కొడుకు చివరి నిమిషంలో పెట్టనంటాడు. తండ్రి “ఏం కాదు, నేను చూసుకుంటా పెట్టు” అంటే, “నువ్వు చూసుకోకపోతే.. నా పరిస్థితి ఏంటి?” అని లేచి వెళ్లిపోతాడు కొడుకు. అప్పుడు విక్కీ తండ్రి (జయప్రకాశ్) ఆ పేపర్లపై తాను సంతకం చేస్తాడు. విక్కీని కూడా పెట్టమంటే క్షణం ఆలస్యం చెయ్యకుండా సంతకం పెట్టేస్తాడు. అది చూసి బాబాయ్ నిశ్చేష్టుడవుతాడు. అంతదాకా తను గొప్పగా పొగిడిన కొడుకు తనని నమ్మకుండా వెళ్లిపోతే, అప్పటిదాకా సరిగా చదవడని చులకనగా తాను మాట్లాడిన విక్కీ, తండ్రి అడిగిన వెంటనే ఏమీ అడక్కుండా సంతకం పెట్టడంతో నోట మాటరాని వాడవుతాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ తర్వాత అప్పిచ్చినవాడికి బుద్ధి చెప్పిన విక్కీ, బాబాయ్ కొడుకుకు అతడు చేసిన తప్పేమిటో తెలుసుకొనేలా చేస్తాడు. కొడుకు ప్రవర్తనతో కుంగిపోయిన బాబాయ్‌కి కొడుకు క్షమాపణలు చెప్పేలా చేస్తాడు. బాబాయ్ కళ్లల్లో ఆనందాన్ని తిరిగి రప్పిస్తాడు. సినిమా మొత్తమ్మీద ఆకట్టుకున్న, కచ్చితంగా వచ్చిన సన్నివేశాల సమాహారం ఇది. ఈ సన్నివేశాల్ని దర్శకుడు వెంకీ బాగా హ్యాండిల్ చేశాడు.

Mr Majnu: The Most Perfect Scene!

Click here for Mr.Majnu review