Nagarjuna Plays As ‘Nata Samrat’?


Nagarjuna Plays As 'Nata Samrat'?

‘నటసామ్రాట్’గా నాగార్జున?

అక్కినేని నాగేశ్వరరావును ‘నటసామ్రాట్’గా పిలుచుకోవడం తెలిసిందే. అందుకే నాగార్జున నటుడిగా పరిచమైనప్పటి నుంచీ ఆయనను ‘యువసామ్రాట్’గా పరిగణిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన యువకుడు కాదు కాబట్టి ఆ సంబోధనను ఆయన కుమారుడు నాగచైతన్యకు తగిలిస్తూ వస్తున్నారు అభిమానులు.

ఇదంతా చెప్పడం ఎందుకంటే.. ఇప్పుడు ‘నటసామ్రాట్’గా నటించే అవకాశం నాగార్జునకు వస్తున్నదని. అవును. మరాఠీలో నానా పటేకర్ టైటిల్ రోల్ చేసిన ‘నట సమ్రాట్’ సినిమా ఘన విజయం సాధించింది. దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కొంత కాలం నుంచీ డైరెక్టర్ కృష్ణవంశీ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే టైటిల్ రోల్‌కు ప్రకాశ్‌రాజ్‌ను ఎంచుకున్నారు కూడా.

అయితే తెలీని కారణాల వల్ల ప్రకాశ్‌రాజ్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. దాంతో కృష్ణవంశీ దిక్కుతోచని స్థితిలో పడ్డారనీ, చివరకు ‘నటసామ్రాట్’గా నాగార్జున అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చి, ఆయనను సంప్రదించారనీ వినిపిస్తోంది. నాగార్జున నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. ఒకవేళ ఆయన ఒప్పుకుంటే టైటిల్‌కు ఆయన న్యాయం చేస్తారనడంలో సందేహం లేదు.