Nithya Menen Says She Quit Mahanati Because It Didn’t Work!

వర్కవుట్ కాకపోవడం వల్లే ‘మహానటి’ని వదులుకున్నా: నిత్యా మీనన్
సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ‘మహానటి’ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. సావిత్రి పాత్ర పోషించిన క్రీర్తి సురేశ్ ప్రేక్షకులకు ఆరాధ్య తారగా మారింది. నిజానికి ఆ పాత్ర మొదట వరించింది నిత్యా మీనన్‌కి. సావిత్రి తరహాలో నిత్య బొద్దుగా ఉంటుందనే ఉద్దేశంతోనూ, తను ప్రతిభావంతురాలైన నటి అనే అభిప్రాయంతోనూ డైరెక్టర్ మొదట ఆమెను సంప్రదించాడు. కానీ తర్వాత ఆమె స్థానంలో కీర్తి వచ్చింది. ఆ విషయమై స్పందించింది నిత్య. “ఆ ఆఫర్ వచ్చినప్పుడు ఎంతో ఎగ్జయిట్ అయ్యాను. కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. సినిమాల్లో కొన్ని విషయాలు అలా జరుగుతుంటాయి” అని మలయాళ పత్రిక మాతృభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.
‘మహానటి’లో సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రను నిత్య స్నేహితుడు, మలయాళ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ పోషించాడు. సినిమాలో కీర్తి, దుల్కర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. వాస్తవానికి నిత్య, దుల్కర్ మలయాళంలో హిట్ పెయిర్‌గా పేరూ తెచ్చుకున్నారు. ‘ఉస్తాద్ హోటల్’, ‘ఓకే కన్మణి’, ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమాలు అందుకు నిదర్శనం. తనకు దుల్కర్ మంచి స్నేహితుడవడం వల్లే తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండిందనీ, ప్రేక్షకుల్ని తమ జంట ఆకట్టుకుందనీ నిత్య చెప్పింది.