NTR Kathanayakudu: A Lone Opening Sequence


NTR Kathanayakudu: A Lone Opening Sequence

యన్.టి.ఆర్: కథానాయకుడు: అనాథ అయిన ఓపెనింగ్ సీన్

ఎన్టీఆర్ జీవిత కథలో తొలిభాగంగా మనముందుకొచ్చిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ను దర్శకుడు క్రిష్ తనకు సాధ్యమైనంతలో బాగా తియ్యడానికి కృషి చేశారు. అందులో చాలావరకు సఫలమయ్యారు. అయితే ఓపెనింగ్ సీన్‌కు లింక్ సీన్‌ను సినిమా మొత్తమ్మీద ఎక్కడా చూపించకపోవడం, దానిని అనాథలా వదిలేయడం దర్శకత్వ లోపంగా భావించాలి.

ఎన్టీఆర్ భార్య బసవతారకం కేన్సర్‌కు గురైందనే సన్నివేశాన్ని వర్తమాన సన్నివేశంగా చూపించాడు దర్శకుడు. కీమో చేయించుకున్నాక ఆమెకు చూపు సరిగా ఆనడం లేదన్నట్లు అందులో చూపించాడు. వృద్ధురాలైన బసవతారకం పాత్రధారి విద్యా బాలన్, హరికృష్ణ పాత్రధారి కల్యాణ్‌రాం, ఇద్దరు కూతుళ్ల పాత్రలతో ఈ ఓపెనింగ్ సీన్‌ను దర్శకుడు తీశారు.

భర్తను ఫొటోల్లో చూసుకుంటానంటే కూతురు ఆల్బం తీసుకొచ్చి ఇస్తుంది. హరికృష్ణను పక్కన కూర్చోబెట్టుకొని ఆల్బం తెరిచి, ఎన్టీఆర్‌ను చూసుకొని మురిసిపోతుండగా నిమ్మకూరులో బ్రిడ్జిమీద సైకిల్ తొక్కుకుంటూ ఎన్టీఆర్ (బాలకృష్ణ) దర్శనమివ్వడంతో కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది.

ఆ తర్వాత సినిమాలో ఎక్కడా కథ తిరిగి వర్తమానంలోకి రాదు. పూర్తిగా భూతకాలంలోనే నడిచి, భూతకాలంలోనే ముగుస్తుంది. నాదెండ్ల భాస్కరరావును పక్కన పెట్టుకొని జనం సమక్షంలో పార్టీ పెడుతున్నామంటూ, ఆ పార్టీ పేరు ‘తెలుగుదేశం’ అంటూ ఎన్టీఆర్ ప్రకటించడంతో సినిమా ముగుస్తుంది.

బాగానే ఉంది కానీ, ఓపెనింగ్ సీన్‌ను వర్తమానంలో ఎందుకు చూపించినట్లు అనే ప్రశ్న వస్తుంది. ఎన్టీఆర్ పాత్రధారి పరిచయ సన్నివేశాన్ని ఆసక్తికరంగా చూపించాలనే తలంపుతో ఓపెనింగ్ సీన్‌ను అలా పెట్టారనుకుందాం. ఎత్తుగడ బాగానే ఉంది. కానీ ఆ ఎత్తుగడకు మధ్యలోనో, చివరలోనో లింక్ ఉండాలి. అదేమీ లేకుండా సినిమాని ముగించాడు దర్శకుడు.

బహుశా ఫిబ్రవరి 7న వచ్చే రెండో భాగం ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’లో దానికి సంబంధించిన లింక్ సీన్‌లను చూపించవచ్చు. కానీ మొదటి భాగం దానికదే ఒక సినిమా. అందులోనే లింక్ సీన్లను చూపించడం దర్శక ధర్మం. అది మిస్సయ్యారు క్రిష్.