NTR Kathanayakudu Review: 6 Ups And 4 Downs


NTR Kathanayakudu Review: 6 Ups And 4 Downs

‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ రివ్యూ: ఆరడుగులు ముందుకి, నాలుగడుగులు వెనక్కి

తారాగణం: బాలకృష్ణ, విద్యా బాలన్, దగ్గుబాటి రాజా, సుమంత్
దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి
విడుదల తేది: 9 జనవరి 2019

ఎన్టీఆర్ బయోపిక్. తెరపై నందమూరి తారక రామారావు జీవితాన్ని కనులారా వీక్షించే గొప్ప అవకాశం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఆ స్వప్నాన్ని ఆవిష్కరింపజేశారు. సినీ జీవితం ఒక భాగంగా, రాజకీయ జీవితం ఇంకో భాగంగా తీశారు. మొదట ఆయన సినీ జీవితం ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’గా మన ముందుకు వచ్చింది. సినీ నాయకునిగా ఎన్టీఆర్ అనితరసాధ్యుడు. అలాంటి కథానాయకుని పాత్రలో ఆయన కుమారుడే నటించిన ఆ చిత్రం ఎలా ఉన్నదయ్యా అంటే…

కథ

కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చెందిన నందమూరి తారకరామారావుకు అవినీతి అంటే గిట్టదు. అందుకే రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగానికి రాజీనామా చేసి, సినిమాల్లో హీరో కావాలని మద్రాసు వెళ్తాడు. 8 నెలలైనా ఫలితం కనిపించకపోయేసరికి వెనక్కి వెళ్దామని తిరుగు ప్రయాణమవుతాడు. కానీ దర్శకుడు బి.ఎ. సుబ్బారావు వల్ల ‘పల్లెటూరి పిల్ల’లో హీరోగా వేషం వేసి, విజయా సంస్థలో ‘పాతాళభైరవి’లో తోటరాముడు పాత్రలో నటించడం ద్వారా స్టార్ అవుతాడు.

‘మాయాబజార్’లో కృష్ణుని పాత్ర ద్వారా తెలుగువాళ్ల ఆరాధ్య తార అవుతాడు. అక్కడి నుంచి ఆయన సినీ ప్రయాణం మహోత్కృష్టంగా సాగిపోతుంది. ఆయనకు భార్య బసవతారకం అన్ని విధాలుగా సహకరిస్తుంది. రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెనకు కదిలిపోయి సహనటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి జనంలోకి వెళ్లి విరాళాలు వసూలు చేసి ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకుంటాడు.

ఢిల్లీలో పద్మశ్రీ పురస్కారాని అందుకుంటున్న సందర్భంగా అందరూ తమను మద్రాసీలని సంబోధిస్తుంటే సహించలేక తెలుగువాడినని సమాధానం చెప్తాడు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటాలని రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ‘తెలుగుదేశం’ పార్టీ పెడుతున్నట్లు ప్రకటిస్తాడు.

NTR Kathanayakudu Review: 6 Ups And 4 Downs

కథనం

ఎన్టీ రామారావు జీవితాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? డైరెక్టుగా చెప్పకూడదని బసవతారకంకు కేన్సర్ సోకిందనే విషయాన్ని వర్తమానంగా చూపించి, ఆమె ఫొటో ఆల్బం చూస్తూ, అందులో భర్త ఫొటోను ప్రేమగా తాకగా, అక్కడి నుంచి టేకాఫ్ తీసుకొని ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాడు దర్శకుడు క్రిష్.

నిమ్మకూరులో బ్రిడ్జిమీద సైకిల్ తొక్కుకుంటూ ఎన్టీఆర్ (బాలకృష్ణ) దర్శనమిస్తాడు. ఈ ఎత్తుగడ బాగుంది. ఇంప్రెసివ్‌గా ఉంది. ప్రేక్షకులతో ఈలలు వేయించేట్లు ఉంది. అయితే ఓపెనింగ్ సీన్‌కు లింక్ సీన్‌ను సినిమా మొత్తమ్మీద ఎక్కడా చూపించకపోవడం, దానిని అనాథలా వదిలేయడం దర్శకత్వ లోపంగా భావించాలి.

ఆ తర్వాత సినిమాలో ఎక్కడా కథ తిరిగి వర్తమానంలోకి రాదు. పూర్తిగా భూతకాలంలోనే నడిచి, భూతకాలంలోనే ముగుస్తుంది. బహుశా ఫిబ్రవరి 7న వచ్చే రెండో భాగం ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’లో దానికి సంబంధించిన లింక్ సీన్‌లను చూపించవచ్చు. కానీ మొదటి భాగం దానికదే ఒక సినిమా. అందులోనే లింక్ సీన్లను చూపించడం దర్శక ధర్మం. అది మిస్సయ్యారు క్రిష్.

రైతుబిడ్డ రామారావు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ఎదిగి, రాజకీయ రంగ ప్రవేశం వరకు దారి తీసిన పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు దర్శకుడు. టైటిల్ ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ కాబట్టి, తొలి సినిమాలో సినీ జీవితాన్ని, మలి సినిమాలో రాజకీయ జీవితాన్ని చూపిస్తున్నామని ప్రకటించారు కాబట్టి, ఆ విధంగానే తొలి సినిమా ముగింపు ఉండాల్సింది.

అందుకు భిన్నంగా రాజకీయ రంగ ప్రవేశం, ‘తెలుగుదేశం పార్టీ’ ప్రకటన చేయించి, అక్కడ ఈ సినిమాని ముగించడం యాప్ట్‌గా లేదు. ఎన్టీఆర్ సినీ జీవితంలోని ఒక ఉత్కృష్ట ఘటనను ఎంచుకొని దానిపై ముగింపు ఇచ్చినట్లయితే అర్థవంతంగా ఉండేదనిపించింది.

ఎన్టీఆర్ వేసిన కేరక్టర్ల గెటప్పుల మీద ఎక్కువ దృష్టిపెట్టడం వల్ల ఆయన సినీ జీవితాన్ని మరింత లోతుగా చూపించే అవకాశాన్ని దర్శకుడు కోల్పోయాడు. ఎన్టీఆర్ సినీ జీవితంలో చాలా వరకు బయటి ప్రపంచానికి తెలిసిన విషయాలే తెరపై దర్శనమిచ్చాయి. అదనంగా కనిపించింది భార్యతో, తమ్మునితో ఆయన అనుబంధం గురించే.

పాత్రలు మరీ ఎక్కువ కావడం వల్ల ఆయన్ సినీ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చూపించినట్లుగా ఉంది. గెటప్పులతోటే భావోద్వేగాల్ని పండించాల్సిన స్థితిని దర్శకుడు కల్పించుకున్నాడు. అక్కడ కథ లోపించిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రథమార్థం వేగంగా నడిచినా, ద్వితీయార్థం బాగా సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ‘తెలుగుదేశం’ పార్టీ ప్రకటనతో సినిమా పూర్తవుతుందని ప్రేక్షకుడు అనుకోడు. అందుకే సినిమా అయిపోయిందని లైట్లు వేస్తుంటే మొదటి షో చూసినవాళ్లు ఆశ్చర్యపోతారు.

NTR Kathanayakudu Review: 6 Ups And 4 Downs

పాత్రలు – పాత్రధారుల అభినయం

ఎన్టీఆర్ – భారతదేశపు తొలి సూపర్‌స్టార్! అశేషాభిమానుల హృదయాల్లో దేవునిగా కొలువుదీరిన మహానటుడు! మరి.. అలాంటి నటుడి పాత్రనే పోషించడమంటే మాటలా! ఎవరు అంత ధైర్యం చేస్తారు!! ఎవరు ఆయనలా కనిపించడానికి సాహసం చేస్తారు!! బాలకృష్ణ ఆ సాహసం చేశారు. తండ్రిలా కనిపించడానికి తీవ్రంగా శ్రమించారు. ఎన్టీఆర్‌లా తెరపై అభినయించడానికి ప్రయత్నించారు. చాలావరకు సఫలమయ్యారు కూడా.

రామారావు ఆహార్యమే వేరు. అది జగన్మోహన రూపం. అంతటి రూపం లేకపోయినా, ఆ రూప ఛాయలు బాలకృష్ణలో ఉన్నాయి. అందుకే ఆ పాత్రను చేయగలిగారు. ఆ పాత్రలోని భావోద్వేగాలను ఉన్నత స్థాయిలో ప్రదర్శించగలిగారు. ఆయన వేసిన పాత్రల ఆహార్యంలోకి వెళ్లగలిగారు. సినీ నటుడిగా ఎన్టీఆర్ వేసిన చిరస్మరణీయ పాత్రల గెటప్పుల్లో బాలకృష్ణ ఒదిగిపోయారు.

‘మాయాబజార్’లో శ్రీకృష్ణుడి పాత్రకు నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణిలు ఎన్టీఆర్‌ను ఒద్దంటే, కె.వి. రెడ్డి ఆయన చేతే వేయించాలని పట్టుపట్టినప్పుడు.. శ్రీకృష్ణావతారంలో బాలకృష్ణ నడిచి వస్తున్న సన్నివేశం అపురూపం. ఆ రూపంలో ఆయన తండ్రికి అతి సమీపంగా వచ్చారు. అలాగే మిగతా పౌరాణిక గెటప్పుల్లోనూ.

బసవతారకం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. గృహిణిగా, భర్త చాటు భార్యగా, గంపెడు పిల్లల తల్లిగా వాళ్ల ఆలనా పాలనా చూసుకుంటూ, బయటి ప్రపంచానికి చాలా తక్కువ తెలిసిన మనిషిగా ఆమె రూపం మనకు సుపరిచితం కాదు. అందుకే బసవతారకం ఇలాగే ఉండేవారేమోనన్నంతగా ఆ పాత్రలో విద్యా బాలన్ పరకాయ ప్రవేశం చేశారు.

ఆ పాత్రలోని అమాయకత్వాన్ని, ముగ్ధత్వాన్ని ఆమె ప్రదర్శించిన తీరుకు భేష్ అనకుండా ఉండలేం. రామకృష్ణ మృతిచెందినప్పుడు “బావా వాడిని లేవమని చెప్పు బావా” అని ఆమె విలపిస్తున్న తీరు ఇంకా గుండెల్ని పిండేస్తున్నట్లే ఉంది.

రాముడికి లక్ష్మణుడు ఎలాగో రామారావుకు త్రివిక్రమరావు అలాగా. అన్న మాటను శిలాశాసనంలా భావించి, ఆచరించే తమ్ముడి పాత్రలో దగ్గుబాటి రాజా చక్కగా ఒదిగిపోయాడు. కొంతమంది నటుల్ని ‘అండర్ రేటెడ్’ యాక్టర్లుగా పిలుస్తుంటారు. అంటే ఎవరూ వాళ్లు అంత బాగా చేస్తారని ఊహించని నటులన్న మాట.

రాజా కూడా అదే కోవకు చెందిన నటుడే. అలాంటివాడు త్రివిక్రమరావు పాత్రను ఇంత బాగా చేస్తాడని ఎవరూ ఊహించరు. ఆ పాత్రకు రాజాను తీసుకోవాలని ఎవరికనిపించిందో కానీ, తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాడు రాజా.

అక్కినేని నాగేశ్వరరావు పొట్టి. సుమంత్ పొడుగు. అయింతా తాత పాత్రను చేయడానికి ఒప్పుకొని అందులో ఒదిగిపోయాడు సుమంత్. చిన్నతనం నుంచి తాతగారి దగ్గరే పెరగడం వల్ల ఆయన మాట తీరు, ఆయన నడక, ఆయన నడత అన్నీ సుమంత్‌కు తెలుసు. అందుకే ఆ పాత్రలోకి వెళ్లగలిగాడు సుమంత్.

కానీ ఈ సినిమాలో అందుకు భిన్నంగా ఆరడుగుల ఎత్తులో ఏఎన్నార్ కనిపిస్తుంటే ఆయన కంటే పొట్టిగా ఎన్టీఆర్ కనిపించారు. అయినా కూడా ఏఎన్నార్ పాత్ర పండింది. ఏఎన్నార్‌లోని నెమ్మదితనం, సున్నితత్వాన్ని బాగా పట్టుకున్న సుమంత్ ఆయనలా ప్రవర్తించగలిగాడు.

కొన్ని పాత్రలకు ఎంచుకొన్న తారలు వాటికి సరిపోలేదని చెప్పాలి. మిగతావాటిని అలా ఉంచితే ఎన్టీఆర్‌తో సినిమాల్లో జోడీ కట్టిన తారలకు ఎంచుకున్న పాత్రధారుల్లో ఇద్దరు మాత్రమే వాటికి న్యాయం చేశారని చెప్పాలి. ఒకరు సావిత్రిగా చేసిన నిత్యా మీనన్, మరొకరు ప్రభగా కనిపించిన శ్రియ. షావుకారు జానకి పాత్రలో శాలినీ పాండే, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్, కృష్ణకుమారిగా ప్రణీత, జయప్రదగా హన్సిక ఏమాత్రం నప్పలేదు.

నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్, చక్రపాణిగా మురళీశర్మ, ఎల్వీ ప్రసాద్‌గా జిషుసేన్ గుప్తా, కె.వి.రెడ్డిగా క్రిష్, యోగానంద్‌గా రవిప్రకాశ్, రుక్మానందరావుగా వెన్నెల కిశోర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

చివరి మాట

‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ను దర్శకుడు క్రిష్ బాగా తీశారు. కానీ గొప్పగా రూపొందించలేకపోయారు.

  • బుద్ధి యజ్ఞమూర్తి